రాష్ట్రపతికి ఘనస్వాగతం
పుష్పగుచ్ఛ్చం అందించిన గవర్నర్, పాదాభివందనం చేసిన సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పది రోజుల విడిది కోసం సోమవారం హైదరాబాద్ వచ్చారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహా త్రివిధ దళాల అధికారులు, రాజకీయ ప్రముఖులు రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. గవర్నర్ పుష్పగుచ్ఛం అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతికి పాదాభివందనం చేశారు. మధ్యాహ్నం 2 గంటల 13 నిముషాలకు రాష్ట్రపతి భారత వాయుసేన విమానంలో హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
అప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడకు చేరుకుని స్వాగత ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర మంత్రివర్గం దాదాపుగా రాష్ట్రపతి స్వాగత కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతికి పరిచయం చేశారు.
అనంతరం రాష్ట్రపతి తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, త్రివిధ దళాలకు చెందిన అధికారులతో కొద్దిసేపు గడిపారు. పది రోజుల పాటు ఇక్కడే ఉండే రాష్ట్రపతి కోసం అన్ని ఏర్పాటు చేయాలని, ఏ చిన్న అసౌకర్యం కలగనీయవద్దని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.
నేడు రాష్ట్రపతికి గవర్నర్ విందు: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ మంగళవారం విందు ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్‌లో రాత్రి ఏడు గంటలకు నిర్వహించే విందుకు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులను సతీసమేతంగా హాజరుకావాలని ఆహ్వానించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులను కూడా విందుకు ఆహ్వానించారు.