సాక్షి, విశాఖపట్నం: తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం విశాఖపట్నంలోని శారదాపీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు మరింత మేలు చేకూర్చేలా తమ ప్రభుత్వానికి శారదాంబ అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో కలసి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న కేసీఆర్ దంపతులు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా పెందుర్తి మండలం చినముషిడివాడ గ్రామంలోని శ్రీ శారదాపీఠానికి చేరుకున్నారు. పీఠాధిపతి శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతిని దర్శించుకున్నారు. స్వామీజీకి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఆయనకు పట్టువస్త్రాలు, పండ్లు బహూకరించి గజమాలతో సత్కరించారు. అనంతరం స్వామీజీతో కలసి సతీసమేతంగా పీఠంలోని శార దాంబ, రాజశ్యామల, వల్లీదేవి సమేత సుబ్రçహ్మణ్యేశ్వరస్వామి, దక్షిణామూర్తి, దాసాంజనేయ స్వామి వారి ఆలయాలతోపాటు స్వర్ణ మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పీఠంలో నిత్యం జరిగే యజ్ఞ, యాగాలు, హోమాలు, పూర్ణాహుతిలో పాల్గొన్నారు. కోరిన కోర్కెలు తీర్చే శమీ వృక్షం చుట్టూ కేసీఆర్ దంపతులు ప్రదక్షిణలు చేశారు.
ఇచ్చిన మాట ప్రకారమే...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో శారదా పీఠాధిపతి శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం చక్కటి ఫలితాలు ఇవ్వడంతో ఆ రోజే స్వామీజీకీ కేసీఆర్ మాటిచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే పీఠాన్ని సందర్శిస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ పీఠాన్ని సందర్శించి స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు. దాదాపు రెండు గంటలపాటు ఆశ్రమంలో గడిపిన కేసీఆర్... అందులో గంటా 20 నిమిషాలపాటు స్వామీజీతో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఇరువురి మధ్య పలు ఆధ్యాత్మిక, రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా తాను ఏర్పాటు చేయనున్న ఫెడరల్ ఫ్రంట్‌పై స్వామీజీ సలహాలను కేసీఆర్ తీసుకున్నారని సమాచారం. తెలంగాణ ప్రజల అభిమానం, దేవుని ఆశీస్సులతో తాను రెండోసారి అధికార పగ్గాలు చేపట్టానని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారని పీఠం సిబ్బంది తెలిపారు. ఉద్యమ సమయంలోనూ.. ఆ తర్వాత రెండుసార్లు సీఎం కావడంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు ఎంతో ఉన్నాయని కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారన్నారు. గతంలో ప్రధాని కాకముందు పీవీ నర్సింహారావు కూడా పీఠా న్ని సందర్శించి స్వామిజీ ఆశీస్సులు పొందేవారని సిబ్బంది పేర్కొన్నారు.
హోరెత్తిన కేసీఆర్ నినాదాలు...
ముఖ్యమంత్రి రాకతో విశాఖ ఎయిర్‌పోర్టు, శారదాపీఠం పరిసరాలు కేసీఆర్ నినాదాలతో హోరె త్తాయి. ఎయిర్‌పోర్టు నుంచి పీఠం వరకు దారిపొడవునా రోడ్లకు ఇరువైపులా కేసీఆర్‌కు స్వాగతం పలు కుతూ ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ను చూసేందుకు ఎయిర్‌పోర్టు వద్ద, పీఠం వద్ద జనం ఎగబడ్డారు. ఎయిర్‌పోర్టు వద్ద బోనాలతో సినీ నటి రమ్యశ్రీ సహా పెద్ద ఎత్తున మహిళలు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. ఏపీ టీఆర్‌ఎస్ నేతలమంటూ విజయవాడ నుంచి కొణిజేటి ఆదినారాయణ అనుచరులతో కలసి పార్టీ కండువా లు, జెండాలతో రాగా, కాకినాడ నుంచి వచ్చిన దూసర్లపూడి రమణరాజు అన్నవరంలో కేసీఆర్ కోసం పూజలు చేశానంటూ కేసీఆర్ ఫొటో ఫ్రేమ్, సత్యదేవుని ప్రసాదంతో పీఠం వద్దకు వచ్చారు. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి కేసీఆర్ సామాజిక వర్గీయులు పీఠం వద్దకు చేరుకుని కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. పీఠంలోకి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు కేసీఆర్ తన కారు దిగి అభిమానులకు అభివాదం చేయడంతో పీఠం పరిసరాలు నినాదాలతో హోరె త్తాయి. కేసీఆర్ వెంట ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎంపీ సంతోష్, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి సుభాష్ రెడ్డి ఉన్నారు. వారికి ఉత్తర పీఠాధిపతి బాలస్వామి, ధర్మాధికారి కామేశ్వరశర్మ తదితరులు స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment