సాక్షి, హైదరాబాద్: ‘‘దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం ద్వారా సుదీర్ఘకాలం అధి కారంలో ఉండేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. దీనిపై ఉమ్మడి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీని అడ్డుకోవడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవడం అవసరం’’ అని తమిళనాడు సీఎం, డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్‌తో భేటీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేసినట్టు తెలిసింది. తమిళనాడు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. మంగళవారం సాయం త్రం చెన్నైలో స్టాలిన్‌తో భేటీ అయ్యారు.
సుమారు గంటపాటు జాతీయ, ప్రాం తీయ అంశాలపై వారు మాట్లాడుకున్నారు. దేశం లో బీజేపీ, కాంగ్రెస్ ఒకదానికొకటి ప్రత్యామ్నాయం కాదని పేర్కొన్న కేసీఆర్.. రాష్ట్రా ల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండటాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని స్టాలిన్‌తో పేర్కొన్నట్టు సమాచారం. అధికార బలాన్ని ఉపయోగిం చి బలమైన ప్రాంతీయపార్టీలను దెబ్బతీయడం ద్వారా సుదీర్ఘకాలం అధికారంలో ఉండా లని కుట్ర లు చేస్తోందని ఆరోపించినట్టు తెలిసింది. బీజేపీ ఓ పెద్ద ప్రాంతీయ పార్టీ అని, దక్షిణాదిలో బీజేపీకి బలమే లేదని స్పష్టం చేసినట్టు తెలిసింది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ బలపడకుండా ఏవిధంగా అడ్డుకోవాలనే అంశంతోపాటు.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోనూ చెక్ పెట్టడానికి ఏ విధమైన వ్యూహం అనుసరించాలన్న దానిపైనా ఇరువురు సీఎంలు చర్చించినట్టు సమాచారం. బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసేలా.. రాష్ట్రాల అవసరాలు, ఆకాంక్షలతో సంబంధం లేకుండా తన ఎజెండాను రుద్దేందుకు ప్రయత్నం చేస్తోందని సీఎం కేసీఆర్ మండిపడినట్టు తెలిసింది. బీజేపీని విమర్శించిన వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తోందన్న విషయాన్నీ లేవనెత్తినట్టు సమాచారం. సెక్యులరిజం, సోషలిజం స్ఫూర్తికి బీజేపీ తూట్లు పొడుస్తోందని.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే దేశం బీజేపీ వంటి శక్తుల చేతుల్లోకి వెళితే విచ్చిన్నమై ఉండేదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీలు ఏకమై బీజేపీ విధానాలను అడ్డుకోవడం ద్వారా.. దేశ ఐక్యత, సమగ్రతలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్టు సమాచారం.
జాతీయ అంశాలు.. సంస్థాగత నిర్మాణం
దేశంలో అపార వనరులున్నా వాటిని సద్వినియో గం చేసుకుని, సంపద పెంచే దిశగా ప్రయత్నాలు జరగడం లేదని స్టాలిన్‌తో కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా నదీజలాలు వృ«థాగా సముద్రంలో కలుస్తున్నాయని, నీటిని సరిగా వినియోగించుకోలేనిస్థితి నెలకొందని అన్నట్టు తెలిసింది. నదుల అనుసంధానం ద్వారా ఉత్తర, దక్షిణ భారత దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సుసంపన్నమయ్యే అవకాశం ఉందని.. ఆ దిశగా టీఆర్‌ఎస్, డీఎంకే తీసుకోవాల్సిన చొరవపై చర్చించినట్టు సమాచారం. ఇక దశాబ్దాల క్రితం ఆవిర్భవిం చిన డీఎంకే నేటికీ రాజకీయాల్లో క్రియాశీలశక్తిగా ఉండటం వెనుక జరిగిన కృషిని కేసీఆర్ ప్రశంసించారని.. సంస్థాగతంగా ఆ పార్టీ నిర్మాణంపై ఆరా తీశారని తెలిసింది. డీఎంకే సంస్థాగత నిర్మాణాన్ని అధ్యయనం చేసేందుకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఓ బృందాన్ని పంపిస్తామని కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. ఇరు రాష్ట్రాల్లోని అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సారూప్యతలు, రాజకీయ పరిస్థితులు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.
మీడియాతో మాట్లాడకుండానే..
సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు స్టాలిన్, కేసీఆర్ భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తొలుత సంకేతాలు వచ్చాయి. కానీ భేటీ తర్వాత కేసీఆర్ నేరుగా హోటల్‌కు వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి చెన్నైలోనే బస చేసిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.
యాదాద్రి ప్రారంభోత్సవానికి రండి
సాక్షి, చెన్నై: వచ్చే ఏడాది మార్చిలో జరిగే యాదాద్రి ఆలయ పునః ప్రారంభోత్సవానికి కుటుంబ సభ్యులతో సహా రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ప్రారంభోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలను వివరించారు. పురాతన గుడులు, గోపురాలతో తమిళనాడు ఆధ్యాత్మిక పర్యాటకానికి చిరునామాగా ఉందని, అదే తరహాలో యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. ఇరువురి కుటుంబాలు కలిసి..: మంగళవారం సీఎం కేసీఆర్, ఆయన భార్య శోభ, తనయుడు, మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, మనవడు, మనవరాలు, ఎంపీ సంతోష్‌కుమార్ కలిసి చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారికి స్టాలిన్, ఆయన భార్య దుర్గ, కుమారుడు ఉదయనిధి సాదరంగా ఆహ్వానం పలికారు. కేటీఆర్‌కు ఉదయనిధి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులు, స్టాలిన్ కుటుంబ సభ్యులు కొంతసేపు మాట్లాడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment