కేసీఆర్ జీ.. బీజేపీతో జర జాగ్రత్త
తెలంగాణలో పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది
కట్ చేయడానికి హైదరాబాద్ కేక్ కాదు
భారత్ శత్రువులు ముస్లింలకు శత్రువులే
మిలాద్-ఉన్-నబీ సభలో ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రంలో మిషన్-7 స్టేట్స్ పేరుతో బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది, కేసీఆర్ జీ జర జాగ్రత్త’ అని ఏఐ ఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్- ముస్లిమీన్) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ దారుస్సలాంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
బీజేపీ హిందూ రాజ్యస్థాపనలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితర ఏడు రాష్ట్రాల్లో అధికారం కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని అన్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలో సంఘ్ పరివార్, బీజేపీ నేతల రాకపోకలు అధికమయ్యాయన్నారు. కట్ చేయడానికి హైదరాబాద్ కేక్ కాదని, తమకంటూ ప్రత్యేకంగా మిషన్ ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ అప్రమత్తమై 2019 ఎన్నికలపై దృష్టిపెట్టాలని సూచించారు.
బీజేపీ ప్రభుత్వం ఒకవైపు దేశంలో ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తుండగా, మరోవైపు అదే పార్టీకి చెందిన నేతలు 2020 నాటికి దేశాన్ని హిందూ రాజ్యంగా మారుస్తామని ప్రకటనలు చేస్తున్నారన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాన్ని ఎట్టిపరిస్థితుల్లో హిందూ రాజ్యం కానివ్వమని అన్నారు. గుజరాత్ పోలీసులు అక్కడి యువకుల తలలపై టోపీలు పెట్టి వారితో ఇస్లాం జిందాబాద్ అని నినాదాలు చేయించి వీడియోలు తీసి సంఘవిద్రోహ శక్తులుగా, ఉగ్రవాదులుగా అభివర్ణించడం సహించరానిదన్నారు. కేంద్రానికి దమ్ముంటే ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను పట్టుకోవాలన్నారు.
దేశంలోని ముస్లింలందరూ భారతీయులేనని, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భారత్‌కు శత్రువులైన వారు ఇక్కడి ముస్లింలకు కూడా శత్రువులేనన్నారు. సంఘ్‌పరివార్ శక్తులను రాజకీయంగా అడ్డుకుంటామన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగానికీ సిద్ధమేనని స్పష్టం చేశారు.
ఆ రెండు జీవోలు సవరించండి..
తెలంగాణ ప్రభుత్వం ఆక్రమిత భూములు, గృహాల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన రెండు జీవోలను సవరించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. అఖిల పక్ష సమావేశంలో కూడా ఈ జీవోలపై తాము అభ్యంతరం చెప్పామని గుర్తు చేశారు. ప్రభుత్వం నిర్ణయించినంత మొత్తాన్ని పేదలు చెల్లించలేరని, 250 గజాల వరకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. నిజాం పాలనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు చెప్పారు.