కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ పెండ్యాల సంతోష్‌కుమార్(57) మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆర్‌కేపురంలోని అల్కాపురి ప్రాంతంలో ఉన్న స్వగృహంలోనే సంతోష్ తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి బుధవారం ఆయన ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. సంతోష్ కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సంతోష అంత్యక్రియలను ఆయన స్వస్థలమైన కరీం నగర్‌లో నిర్వహించారు. కాకతీయ వర్సిటీలో ఎంఏ, పీహెచ్‌డీ చేసిన సంతోష్..
1985లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో ఉపాధ్యాయుడిగా చేరారు. క్రమంగా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా ఎదిగారు. కేసీఆర్ సీఎం అయ్యాక వారం క్రితమే సంతోష్‌ను కార్యదర్శిగా నియమించుకున్నారు. సంతోష్ భార్య మంగళాదేవి రచయిత, పెద్ద కుమారుడు అరుణ్‌కుమార్ కోల్‌కతాలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడు, చిన్న కుమారుడు నల్సార్ లా వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. సంతోష్ తండ్రి దివంగత శంకర్‌రావు స్వాతంత్య్ర సమరయోధుడు, తల్లి సుగుణాదేవి రిటైర్డ్ హిందీ పండిట్.