దూసుకెళ్లుడే..!
ఇక శరవేగంగా అభివృద్ధి
* ప్రాధాన్యత ప్రకారం పనుల వివరాలివ్వండి
* పనిచేయని అధికారులను మార్చండి
* జిల్లా ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దూకుడు పెంచారు. దాదాపు 5 నెలల పాటు సమగ్ర సర్వేలు, క్షేత్రస్థాయి పరిశీనలతో ప్రజా సమస్యల మూలాల్ని గుర్తించిన ఆయన ఇక వాటిని పెకిలించేందుకు రంగం సిద్ధం చేశారు. దీపావళి తర్వాత అభివృద్ధి పనులు దూసుకపోతాయని చెప్పిన సీఎం అదే మాట మీద నిలబడ్డారు. ఈమేరకు శుక్రవారం కేసీఆర్, జిల్లా మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాబూమోహన్, సోలిపేట రామలింగారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మదన్‌రెడి ్డ, ఎంపీలు బీబీపాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వీ భూపాల్‌రెడ్డి, రాములు నాయక్, సుధాకర్‌రెడ్డిలతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లోప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాటర్ గ్రిడ్ విద్యుత్తు, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు, ఆహార భద్రత కార్డులపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. ప్రతి ఎమ్మెల్యే వద్ద నుంచి ఆయన వారి వారి నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల సమగ్ర వివరాలను తీసుకున్నట్లు సమాచారం. ప్రతి ఎమ్మెల్యే,ఎంపీతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి వారి సాదకబాధకాలు తెలుసుకున్నట్లు తెలిసింది.
మంచిగా లేకుంటే మార్చుకోండి..
ఆయా నియోజకవర్గాల్లోని అధికారుల వైఖరిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ‘అధికారులు సరిగా పని చేయకపోతే, మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి పనులు చేపట్టినా ఫలితం ఉండదు, ప్రభుత్వానికి మంచి పేరు రాదు’ కనుక అనుకూలంగా లేని అధికారులను మార్చుకోవచ్చని కేసీఆర్ ప్రజా ప్రతినిధులకు చెప్పినట్లు సమాచారం. అలాంటి అధికారులు ఏ శాఖలో ఉన్నా సరే వారి వివరాలు తనకు ఇవ్వాలని సీఎం సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పాటు ప్రజలతో మమేకమై పని చేసే అధికారులు మీ దృష్టిలో ఎవరైనా ఉంటే, వారి పేర్లను సూచించమని కూడా అడిగినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు కోరిన చోట వారివారి నియోజకవర్గాల్లో అధికారులకు పోస్టింగు ఇచ్చేందుకు కూడా ఆయన అంగీకరించినట్లు తెలిసింది.
భూపాల్‌రెడ్డి ఇంట్లో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు భేటీ
సీఎంతో సమావేశం ముగిసిన అనంతరం రాత్రి పొద్దుపోయాక టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పటాన్‌చెరులోని ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి ఇంట్లో భేటీ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలో చర్చించినట్లు తెలిసింది.