కేశ్‌పల్లి గంగారెడ్డి కన్నుమూత
⇒ గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన మాజీ ఎంపీ
⇒ నేడు నిజామాబాద్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
సాక్షి,హైదరాబాద్/జక్రాన్‌పల్లి (నిజామాబాద్ రూరల్): మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త గడ్డం గంగారెడ్డి (84) సోమవారం తెల్లవారు జామున గుండెపోటుతో మరణించారు. ఆయన కేశ్‌పల్లి గంగారెడ్డిగా సుపరిచితుడు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో నివాసముంటున్న ఆయన సోమవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురై వెంటనే తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో సన్నిహితులు నివాళులర్పించాక ఆయన భౌతికకాయాన్ని నిజామాబాద్‌కు తరలిం చారు. గంగారెడ్డికి భార్య కాంతమ్మతో పాటు కుమారులు ఆనంద్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కుమార్తెలు అహల్యారెడ్డి, శశికళారెడ్డి, అవనిజారెడ్డి ఉన్నారు.
విదేశాల్లో స్థిరపడ్డ సన్నిహితులు వచ్చాక మంగళవారం నిజామాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహి స్తారు. హైదరాబాద్‌లో 35 ఏళ్ల కింద ఆధునిక హంగులతో నిర్మించిన సెంట్రల్ కోర్టు హోటల్ గంగారెడ్డిదే. ఆయన తెలంగాణ జిల్లాల్లో తొలితరం పారిశ్రామికవేత్తల్లో ఒకరికిగా పేరు గడించారు. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నాయకుడిగా, ఓటమి ఎరుగని నాయకుడిగా గంగారెడ్డి తనదైన ముద్ర వేశారు. కాగా, ప్రస్తుతం గంగారెడ్డి కుమారుడు ఆనంద్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడిగా, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు.
నేడు అంత్యక్రియలు..
నిజామాబాద్‌లోని సుభాష్‌నగర్ నుంచి డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి ఫౌమ్‌హౌస్ వరకు గంగారెడ్డి అంతిమయాత్ర కొనసాగ నుంది. అనంతరం అక్కడ అంత్యక్రియలు జరుగుతాయి. గంగారెడ్డి అంత్యక్రియలకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు హాజరుకానున్నారు. కాగా, గంగారెడ్డి మృతి పట్ల కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ కవిత సంతాపం తెలిపారు.
సీఎం కేసీఆర్ సంతాపం
గంగారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమం సమయంలో గంగారెడ్డి తన వెన్నంటి నిలిచారని గుర్తుచేసుకున్నారు. గంగారెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
1991లో తొలిసారి ఎంపీగా ఎన్నిక
1933 జూలై 12న నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లిలో గంగారెడ్డి జన్మించారు. తండ్రి గడ్డం రాజిరెడ్డి. రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన గంగారెడ్డి తొలిసారిగా 1956 నుంచి 1960 వరకు పడకల్ గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం టీడీపీ నుంచి తొలిసారిగా 1991లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 1998–2004 మధ్య రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2004 ఎన్నికల్లో డిచ్‌పల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. 1998, 1999లో అర్బన్, రూరల్ డెవలప్‌మెంట్ సబ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. కేంద్ర నీటి వనరుల సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా కూడా పనిచేశారు. 2012లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. 2014లో ఎన్నికల ముందు బీజేపీలో చేరిన ఆయన అప్పటినుంచి దాదాపు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.