త్వరలో మంత్రివర్గ విస్తరణ?
♦ సీఎం ముమ్మర కసరత్తు.. అతి త్వరలోనే ముహూర్తం?
♦ ముగ్గురు కొత్తవారికి అవకాశమంటున్న టీఆర్‌ఎస్ నేతలు
♦ పరిశీలనలో 15 మంది సీనియర్ ఎమ్మెల్యేల పేర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో అతి త్వరలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందంటూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. గురువారం రోజంతా ఇదే వార్త హల్‌చల్ చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో ఈ అంశంపై తీవ్రస్థాయిలో కసరత్తు చేసినట్టు పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. దేవాలయాల కమిటీ నియామకాలతో పాటు మంత్రివర్గ విస్తరణపైనే రోజంతా ఆయన కసరత్తు చేశారన్న వార్త టీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా చక్కర్లు కొట్టింది.
మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొద్ది రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అది అతి త్వరలోనే జరుగుతుందనేందుకు తాజా కసరత్తే నిదర్శనమని ఆశావహ నేతలు చెబుతున్నారు. మంత్రివర్గం నుంచి ముగ్గురికి ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయించారని కూడా టీఆర్‌ఎస్ వర్గాల్లో గట్టిగానే విన్పిస్తోంది.
ఇందులో భాగంగానే సీనియర్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం సర్వే కూడా చేయించినట్టు చర్చ నడుస్తోంది. ఆ సర్వే నివేదిక ఆధారంగా 15 మంది సీనియర్ ఎమ్మెల్యేల పేర్లను కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారని, అంతిమంగా వారిలో నుంచి ముగ్గురికి అవకాశం ఉంటుందని సీనియర్ నాయకులు కూడా చెబుతున్నారు. విస్తరణ అతి త్వరలోనే ఉంటుందని, అందుకు ముహుర్తం కూడా ఇప్పటికే ఖరారైందని వారు గట్టిగా చెబుతున్నారు!