నల్లగొండ అగ్రికల్చర్ : ఖరీఫ్ పంటరుణం పొందడానికి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత పంటరుణాలను మాఫీ చేస్తామని చెప్పి 25 శాతం నిధులను మాత్రమే విడుదల చేసిన విషయం విదితమే. వెంటనే ఖరీఫ్ పంట రుణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించిన ప్రభుత్వం అనేక కొర్రీలను పెట్టింది. దీంతో రైతులకు సకాలంలో పంటరుణాలు అందడం లేదు. పహాణీ కాపీ, రుణమాఫీ పత్రం, ఫొటో జత చేసి ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్‌కార్డు జీరాక్స్‌ను బ్యాంకు లో సమర్పిస్తేనే తిరిగి పంటరుణాలను ఇవ్వాలని మెలికపెట్టడం రైతుల పాలిట శాపంగా మారింది. కొన్ని ప్రాంతాలలో రైతుల భూముల వివరాలను కంప్యూటరీకరణ చేయకపోవడంతో మీసేవ కేంద్రాలలో పహాణీ కాపీలు రావడం లేదు. పహాణీని రాసి ఇవ్వాలని రైతులు కోరినా సాధ్యం కాదని రెవెన్యూ సిబ్బం ది ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీటి కోసం మీసేవ కేంద్రాలలో పెద్ద సంఖ్యలో క్యూలో ఉన్నప్పటికీ తీసుకోవడం సాధ్యం కాక చాలామంది రైతులు వెనుదిరిగి వెళ్తున్నారు. అదే విధంగా రుణమాఫీపత్రం, ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత గ్రామాల వీఆర్‌ఓలు సర్టిఫై చేస్తే మండల తహసీల్దార్ సంతకంతో ఇవ్వాల్సి ఉంది.
ఇబ్బందులకు గురిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది
రైతులు సంబంధిత సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి రెవెన్యూ కార్యాలయాలకు తిరిగిపోతున్నప్పటికీ సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. ఉన్నా సర్టిఫికెట్లను ధ్రువీకరించడానికి నానా కొర్రీలు పెడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. వీఆర్‌ఓల సంతకాల కోసమే రెండుమూడు రోజులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని, తీసుకున్న వాటిని బ్యాంకులో ఇవ్వడానికి కనీసం వారం రోజులు పడుతుందని పేర్కొం టున్నారు. అధికారుల పనితీరు ఇలా ఉంటే ప్రభుత్వ లక్ష్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నిస్తున్నారు.
ఖరీఫ్ పంటరుణ లక్ష్యం పూర్తికి రెండు రోజులే గడువు
ఖరీఫ్‌లో రైతులకు రూ.1226 కోట్ల పంటరుణాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. బ్యాంకుల అనాసక్తి, రెవెన్యూ సిబ్బంది సకాలంలో సర్టిఫికెట్లను ఇవ్వకపోవడం కారణంగా నేటివరకు రూ.812 కోట్ల మేర పంట రుణాలను 2లక్షల 2 వేల 822 మంది రైతులకు అందజేశారు. ఈ నెల 30వ తేదీ వరకు నిర్దేశించిన పంటరుణాలను పంపిణీ చేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇన్ని కొర్రీలు పెడుతూ ఉంటే రెండు రోజులలో ఇంకా రూ. 414 కోట్ల పంట రుణాలను పంపిణీ చేయడం ఎలా సాధ్యమో అధికారులకే తెలియాలి.
కొర్రీలను తొలగించాలి
పంటరుణాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొర్రీలను వెంటనే తొలగించడంతోపాటు గడువును పెంచి అందరికీ పంట రుణాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. ఖరీఫ్ కాలం పూర్తయ్యే వరకు కూడా పంట రుణాల కోసం బ్యాంకులు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగడానికి సరిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటరుణ లక్ష్యం చేరేనా?
Published Wed, Oct 29 2014 4:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement