‘బంధు’ బాగోతం | 'Kin' bagotam | Sakshi
Sakshi News home page

‘బంధు’ బాగోతం

Published Sun, Feb 1 2015 6:21 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM

'Kin' bagotam

సాక్షి, ఖమ్మం:మెప్మా లింకేజి రుణాన్ని కార్పొరేషన్..ఆ సంస్థ సిబ్బంది కుమ్మక్కై స్వాహా చేసినట్లు సమాచారం. ఈ సంస్థల్లోని కొంతమంది సిబ్బంది బంధుగణం పేరుతో బినామీ గ్రూపులను సృష్టించి గుట్టుచప్పుడు కాకుండా లింకేజి రుణాన్ని అందినకాడికి దండుకున్నారు. ఒక్క ఏపీజీవీబీలోనే 18 గ్రూపులను డిఫాల్టర్‌గా గుర్తించారు. ఈ గ్రూపులు రూ.52 లక్షలకు పైగా రుణం చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులకు అనుమానం రావడంతో ఈ స్వాహా బండా రం బయటపడింది.

ఈ విషయమై కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి మెప్మా అధికారులను ఆరా తీశారు. పూర్తి వివరాలు నివేదికగా అందజేయాలని పీడీని ఆదేశించారు. కార్పొరేషన్ ఆవరణలోని ఏపీజీవీబీలో 10 గ్రూపులు రూ.36 లక్షల వరకు రుణం తీసుకున్నాయి. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లించగా మిగతా రూ.34 లక్షలు బకాయిగా ఉంది. ఇందులో కొన్ని రుణాలు 2012 నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. రుణాలు పొందిన వారికి పలుమార్లు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

వీరు ఎంతకు చెల్లించకపోవడంతో డిఫాల్టర్‌గా ప్రకటించారు. వీరు రుణం ఎందుకు చెల్లించడం లేదు, రికవరీ చేయాలంటూ మెప్మా అధికారులకు ఈ గ్రూపుల జాబితాను అందజేశారు. చర్చికాంపౌండ్‌లో ఈ బ్యాంకు బ్రాంచ్‌లో కూడా ఇదే రీతిలో 8 గ్రూపుల పేరుతో రూ.18 లక్షల వరకు రుణం తీసుకున్నారు. ఈ గ్రూపులు కూడా చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు డిఫాల్టర్స్‌గా ప్రకటించి మెప్మాకు సమాచారం అందజేశారు.

బినామీ గ్రూపులు

ప్రతి నెల రుణం చెల్లిస్తున్న ఒక్కో గ్రూపు నుంచి ఇద్దరి చొప్పున సభ్యులతో మొత్తం ఇలా పది మందితో ఒక్కో బినామీ గ్రూపును ఏర్పాటు చేశారు. కార్పొరేషన్, మెప్మాలోని కొంతమంది సిబ్బంది తమ బంధువులతో ఇలా గ్రూపులను ఏర్పాటు చేసి రుణం పొందారు. ఈ తతంగంలో మెప్మాలో పనిచేస్తున్న ఓ రిసోర్సు పర్సన్‌తో పాటు మరో కమ్యూనిటీ ఆర్గనైజర్ ప్రధాన పాత్ర వహించినట్లు తెలుస్తోంది. ఇలా ఏపీజీవీబీలోని రెండు బ్రాంచ్‌ల్లో కలిపి రుణం స్వాహా చేసినట్లుగా అధికారులు గుర్తించారు.

ఈ వ్యవహారంపై మూ డు రోజులుగా నగరంలోని గాంధీనగర్, దానవాయిగూడెం, రామన్నపేటకాలనీ, రేవతిసెంటర్ ప్రాంతాల్లో 20 మంది రిసోర్సు పర్సన్లతో మెప్మా ఉన్నతాధికారులు రహస్య విచారణ చేయిస్తున్నారు. విచారణలో గ్రూపుల వారీగా వివరాలు తీస్తే ఒక వ్యక్తి రెండుకు మించి గ్రూపుల్లో రుణం పొందినట్లు వెల్లడైంది. దీని వెనక కొంతమంది నాయకులు, ఉద్యోగుల ఉన్నట్లు సమాచారం.
 
బ్యాంకు క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర

బ్యాంకులో ఒక గ్రూపునకు రుణం మంజూరు చేయాలంటే రిసోర్సుపర్సన్‌తో పాటు కమ్యూనిటీ ఆర్గనైజర్ తప్పనిసరి అన్ని పత్రాలను తనిఖీ చే యాలి. సరిగా ఉంటేనే సంతకం చేయాలి. దీన్ని బ్యాంకు అధికారులకు ఇవ్వాలి. వాటిని బ్యాంకు క్షేత్ర స్థాయి సిబ్బంది.. గ్రూపులో ఉన్న ప్రతి సభ్యురాలి అర్హతను పరిశీలించిన మీదటే రుణం మంజూరు అవుతుంది.

ఇలా రుణం మంజూరైన తర్వాత ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. వీధిగా నెలకు ఒకసారి ఆయా బ్యాంకులు ఏయే గ్రూపులకు ఎంత రుణం మంజూరు చేశామో మెప్మా కార్యాలయానికి పంపాలి. కానీ ఇక్కడ అదేమి జరగలేదు. రుణం మంజూరైన గ్రూపుల వివరాలు ఇటు బ్యాంకులో కానీ అటు మెప్మా కార్యాలయంలోనూ ఆన్‌లైన్ చేయలేదు. బ్యాంకు, మెప్మా సిబ్బంది కుమ్మక్కు కావడం వల్లే ఇప్పటి వరకు ఈ వ్యవహారం బయటకు పొక్కలేదు. ఇటీవల బ్యాంకు సిబ్బంది మారడంతో డిఫాల్టర్ గ్రూప్స్ అవినీతి వ్యవహారం బయటకు వచ్చింది.
 
కొనసాగుతున్న విచారణ


బినామీ గ్రూపుల వ్యవహారంపై మెప్మా ఉన్నతాధికారులు 20 మంది రిసోర్సుపర్సన్ల బందాన్ని ఏర్పాటు చేశారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన డిఫాల్ట్ గ్రూపు జాబితాల వారీగా ఒక్కో దాంట్లో నమోదైన సభ్యులు ఉన్నారా..? ఎంత రుణం తీసుకున్నారు..? తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఓవైపు విచారణ జరుగుతుండగానే మరో వైపు రుణాలు స్వాహా చేసిన కొంత మంది సిబ్బంది ఆయా సభ్యులతో మాట్లాడుతున్నారు.

‘రుణాలు తామే చెల్లిస్తామని, ఎవరూ బాధ పడాల్సిన పని లేదు’అని నమ్మబలుకుతున్నారు. రామన్నపేటలో 6 గ్రూపులు డిఫాల్టర్స్ అని తేలడంతో రెండు రోజుల నుంచి ఇక్కడ విచారణ చేస్తున్నారు. ఇక్కడి గ్రూపు బాధ్యులు, మెప్మా అధికారులకు.. తామే ఈ రుణం చెల్లిస్తామని ఈ స్వాహాపర్వంలో భాగస్వామ్యం ఉన్న రిసోర్సు పర్సన్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ప్రాంసరీ నోటీసు ఇచ్చినట్లు సమాచారం. అసలు రూ.కోట్లలో స్వాహా జరిగినట్లు ప్రచారం జరుగుతున్నా మెప్మా ఉన్నతాధికారులు తమకేం సంబంధం లేదని చెబుతుండటం గమనార్హం.

ఇంత జరిగినా మెప్మా అధికారులు బ్యాంకర్లతో సమావేశం జరపడానికి ఎందుకు వెనకాడుతున్నారది అనుమానాలకు తావిస్తోంది. నగరంలో బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి డిఫాల్టర్ల జాబితా తీసుకొని విచారణ చేయిస్తే అసలు ఎంత రుణం స్వాహా చేశారో పూర్తి స్థాయిలో బయటపడనుంది. కలెక్టర్ ఆదేశాలతోనైనా అధికారులు స్పంది స్తారా..? అన్నది వేచిచూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement