మినీ ట్యాంక్‌బండ్‌గా కిసాన్‌సాగర్ | kisan sagar as mini tankbund | Sakshi
Sakshi News home page

మినీ ట్యాంక్‌బండ్‌గా కిసాన్‌సాగర్

Published Thu, May 7 2015 12:17 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

kisan sagar as mini tankbund

కంది గ్రామంలోని కిసాన్‌సాగర్ చెరువును మినీట్యాంక్‌బండ్‌గా మారుస్తామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.  బుధవారం ఎస్పీ నేతృత్వంలో పోలీసులు దత్తత తీసుకున్న ఈ చెరువు పనులను మంత్రి ప్రారంభించారు.  
 
సంగారెడ్డి రూరల్ :  ప్రభుత్వం చేపట్టిన మిషన్‌కాకతీయ పనులు ప్రజల భాగస్వామ్యంతోనే కొనసాగుతున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎస్పీ సుమతి నేతృత్వంలో జిల్లా పోలీసులు దత్తత తీసుకున్న సంగారెడ్డి మండలం కంది గ్రామంలోని కిసాన్‌సాగర్ చెరువు పునరుద్ధరణ పనులను మంత్రి హరీశ్‌రావు బుధవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన పనులకు రైతులు, ప్రజలు, అధికారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు.  

గత ప్రభుత్వాల పాలనలో ఏళ్ల తరబడి వారసత్వ సంపదగా ఉన్న చెరువులు నిర్లక్ష్యానికి గురైనట్లు చెప్పారు. మిషన్ కాకతీయలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణలో ప్రజలు భాగస్వాములవుతున్నట్లు తెలిపారు.  పోలీసులు ప్రజల రక్షణ బాధ్యతతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం అభినందనీయమన్నారు.  హైవేలపై సీసీ కెమెరాలను అమర్చిన తొలి జిల్లా మెదక్ అవుతుందన్నారు. ఓవైపు ఐఐటీ మరోవైపు జాతీయ రహదారి పక్కన ఉన్న కిసాన్‌సాగర్ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు.

భవిష్యత్తులో కిసాన్‌సాగర్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు మిషన్ కాకతీయ పనుల కోసం వివిధ వర్గాల నుంచి రూ.43.16 కోట్లు విరాళంగా అందినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన ఒకరోజు వేతన మొత్తం రూ.32.12 కోట్లు వచ్చినట్లు తెలిపారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ పోలీసులు చెరువులను దత్తత తీసుకోవటం అభినందనీయమన్నారు. కిసాన్‌సాగర్‌ను భవిష్యత్తులో మంచి పర్యాటక ప్రదేశంగా అభివృద్ది చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.  

రైతులకు మేలు చేసేలా చేపడుతున్న పనరుద్ధరణ పనులకు అన్నివర్గాల వారు అండగా నిలవాలని కోరారు.  కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ చెరువుల పనులు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. చెరువు శిఖంలో నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఎస్పీ సుమతి మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించటంతోపాటు అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్న సంకల్పంతో కిసాన్‌సాగర్ చెరువును దత్తత తీసుకున్నామన్నారు.

కిసాన్‌సాగర్‌ను మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రి, కలెక్టర్‌ను కోరారు. దీనిపై మంత్రి హరీష్‌రావు స్పందిస్తూ వెంటనే రూ.50 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించటంతో ఎస్పీ సుమతి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, ఓఎస్‌డీ జ్యోతిప్రకాశ్, డీఎస్పీలు తిరుపతన్న, కిషన్‌రావు, సీఐలు వెంకటేష్, ఆంజనేయులు, రఘు, శ్రీనివాస్‌నాయుడు, ఎస్‌ఐలు రాజశేఖర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్.సత్యనారాయణ, సర్పంచ్ ఉమారాణిశంకర్‌గౌడ్, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, ఎంపీటీసీ క్రిష్ణాగౌడ, టీఆర్‌ఎస్ నాయకులు విజయేందర్‌రెడ్డి, అశోక్, బాబా, లక్ష్మీ, చెర్యాల ప్రభాకర్, శ్రీనివాస్‌చారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement