
సైబర్ నేరాలను అరికట్టే పరిశోధన కేంద్రాన్ని పరిశీలిస్తున్న కిషన్‌రెడ్డి
రామంతాపూర్: అత్యాధునిక పరిశోధన, శిక్షణతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే సైబర్ నేరాలను అదుపుచేయవచ్చునని ఇందుకు పోలీసు అధికారులు ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సైబర్ నేరాలను అరికట్టడానికి కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం రామంతాపూర్‌లోని కేంద్ర గూఢచార (డిటెక్టివ్) శిక్షణ సంస్థలో ‘నేషనల్ సైబర్ రీసెర్చ్ ఇన్నోవేషన్ కెపాసిటీ బిల్డింగ్’సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే ప్రసిద్ధి పొందిన ఈ శిక్షణ కేంద్రంలో సైబర్ ఇన్నోవేషన్‌ను ప్రారంభించడం సంతోషకరమన్నారు.
పెరుగుతున్న సైబర్ నేరాల అదుపునకు, సామాజిక భద్రతల కోసం ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ శిక్షణ కేంద్రం ద్వారా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ద్వారా ప్రచారమయ్యే సైబర్ నేరాల విషయంలో పరిశోధనతో పాటు ఈ నేరాలను వేగంగా పరిష్కరించడానికి దోహదపడుతుందన్నారు. పోలీస్ విభాగం న్యాయపరిరక్షణ సంస్థలకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కిషన్‌రెడ్డి సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సావనీర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం పోలీస్ పరిశోధన అభివృద్ధి మండలి డైరెక్టర్ జనరల్ వీఎన్‌కే.కౌముది మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం పోలీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ నేరాల నివారణలో సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీగా గుర్తింపు పొందిందన్నారు. కేంద్ర డిటెక్టివ్ ట్రైనింగ్ శిక్షణ సంస్థ డైరెక్టర్ ఆర్.ఎస్.జయ్‌కుమార్ సంస్థ సాధించిన విజయాలు, కార్యకలాపాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.
దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమే ఆ దాడి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారు పోలీసులపై రాళ్లు విసిరి శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాళ్ల దాడిలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారన్నారని, ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశ పర్యటనలో ఉన్న సమయంలో ఒకేసారి ఆందోళన, దాడులకు పాల్పడ్డారన్నారు. ఇది అతిపెద్ద తప్పిదమని, భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది కుట్రపూరిత చర్య అని పేర్కొన్నారు. రాళ్ల దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఈ ఘటనలు మంచివి కావని, వాటికి బాధ్యతను రాహుల్ గాంధీ తీసుకుంటారా? అసదుద్దీన్ తీసుకుంటారా చెప్పాలని డిమాండ్ చేశారు.