ఎన్నాళ్లీ దారుణాలు! | Knife Attacks on Young Womens in Hyderabad | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ దారుణాలు!

Published Thu, Feb 7 2019 10:09 AM | Last Updated on Thu, Feb 7 2019 10:09 AM

Knife Attacks on Young Womens in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తెలిసీ తెలియని వయసులో...పరిపక్వత లేని ప్రేమలు విషాదంగా మారుతున్నాయి. కాచిగూడలో బుధవారం చోటు చేసుకున్న మధులిక ఉదంతం తీవ్ర కలకలం సృష్టించింది. మనిషికీ మనిషికీ మధ్య అనుబంధవారధిగా ఉండాల్సిన ప్రేమ ఇక్కడి ఆడపిల్లల జీవితాలను బలి తీసుకుంటుంది. ప్రేమ ముసుగులో మృగాళ్ల ఉన్మాదం రంకెలు వేస్తోంటే... అభంశుభం తెలియని ఎందరో అసువులు బాస్తున్నారు. ఓ జంట సహజీవనం చేయడానికి చట్టం ఎలాంటి అభ్యంతరం చెప్పదు. అయితే ఓ బాలికతో ఆమె ఇష్టపూర్వకంగానే శారీరకంగా కలిసినా... దాన్ని అత్యాచారంగానే పరిగణిస్తుంది. కామాంధుల చేతిలో పసి మొగ్గలు బలికాకుండా చూసేందుకు చేసిన కఠిన చట్టమిది. ప్రేమ పేరుతో రెచ్చిపోతున్న ఉన్మాదులు చేసే నేరాలపట్ల ఇదే తరహా స్పష్టమైన, కఠిన నిర్ణయాలు లేకపోవడంతో ఇవి నానాటికీ పెరిగిపోతున్నాయి. ఎందరో యువతులు, బాలికలు అకారణంగా బలవుతున్నారు.

ఎందుకిలా..?
పరిపక్వత లేని ప్రేమలే ఈ దారుణాలకు కారణం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జీవితం అంటే ఏమిటి? దాని విలువ ఏమిటి? అనేవి పూర్తిగా అవగతం కాని పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిల్లో పుట్టే ఆకర్షణే దారుణాలకు దారి తీస్తోంది. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణ–వ్యామోహంలో పడి దాన్నే ప్రేమగా భావిస్తున్నారు. ఆనక ఇద్దరిలో ఎవరో ఒకరు అసలు విషయాన్ని గుర్తించి జాగ్రత్తపడితే... రెండో వాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడమో... లేదంటే హత్యకు తెగబడటమో జరుగుతోంది. ఒక్కో సందర్భంలో బెదిరింపులు, బ్లాక్‌ మెయిల్, దాడులకు పాల్పడి కటకటాల్లోకీ చేరి జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. ఆడపిల్లలపై ప్రేమ పేరుతో ఉన్మాదులు కత్తులతోనే, యాసిడ్‌తోనే దాడులకు తెగబడినప్పుడల్లా... ‘నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తాం. ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తాం’ అంటూ గంభీరంగా ప్రకటించే అధికార యంత్రాంగం, పాలకుల హామీలు ‘అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తున్న’ చందంగానే మారిపోయాయి. నగరంలోనే కాదు... రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఈ తరహా ఉదంతం ఒక్కటి జరిగితే చాలు పోలీసులు ‘అత్యంత అప్రమత్తం’ అవుతారు. పోకిరీలు, ప్రేమోన్మాదులను కట్టడి చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామంటూ ఉదరగొడతారు. ఏదైనా ఉదంతం జరిగినప్పుడు కేసు నమోదు చేసినా... ఇది దర్యాప్తు పూర్తి చేసుకుని, న్యాయస్థానంలో విచారణ పూర్తయి, దోషులకు శిక్ష పడటం పెద్ద ప్రహసనంగా మారిపోయింది. ఈలోపు బాధిత కుటుంబాల్లో ‘పోరాడే’ (ఆ)శక్తి సన్నగిల్లిపోతోంది. ఇవన్నీ ఈ ఉన్మాదులు రెచ్చిపోవడానికి కారణాలుగా మారుతున్నాయి. మరోవైపు చట్టాల్లోని లోసుగులూ నిందితుల్లో భయం లేకుండా చేస్తున్నాయి. 

అటకెక్కిన యువజన విధానం...
సమాజంలో మహిళలకు గల సమున్నత స్థానం, వారి హక్కులను యువకులకు, ముఖ్యంగా ఇప్పుడిప్పుడే యవ్వనంలో అడుగిడుతున్న యువతకు క్షుణ్ణంగా బోధించాలన్న ఉద్దేశంతో రూపొందినదే జాతీయ యువజన వి«ధానం. మహిళలపట్ల యువజనులు గౌరవంగా మసలుకొనేలా వారికి అవసరమైన కౌన్సెలింగ్‌ ఇవ్వాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. యువజనులను 13–19, 20–35 ఏళ్ల మధ్య వయస్సు గల వారిగా రెండు గ్రూపులుగా యువజన విధానంలో విభజించారు. యవ్వన దశలో కీలకమైన 13–19 ఏళ్ల మ«ధ్య వయస్కులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని అందులో నిర్దేశించారు. ప్రేమోన్మాదులు, వారి బారినపడుతున్న వారిలో అత్యధికులు ఈ పాతికేళ్లలోపు వారే.  జాతీయ యువజన విధానంలో పొందుపరిచిన విధంగా ఇక్కడి సమాజంలో స్త్రీల స్థానం, వారికి గల హక్కులపై మగపిల్లలకు చక్కని అవగాహన కల్పించడంలో కానీ, మహిళల పట్ల గౌరవంగా మసలుకొనేలా కౌన్సెలింగ్‌ చేయడంలో కానీ ప్రభుత్వాలు ఎంతటి ‘చిత్తశుద్ధిని’ చూపిస్తున్నాయో తెలుస్తూనే ఉంది.  

ఇకనైనా పాలకులకు పట్టేనా?
అభంశుభం తెలియకుండానే మృత్యువుతో పోరాడుతున్న మధులిక ఉదంతమైనా యంత్రాంగాల కళ్లు తెరిపించాలి. దీన్ని ఓ గుణపాఠంగా తీసుకుని వీరి రక్షణకు నడుంబిగించాలి. జాతీయ యువజన విధానాన్ని అమలులో పెట్టడానికి అవసరమైన చర్యలు ప్రారంభించాలి. చట్టాలకు పదును పెట్టడంతో పాటు మహిళలు, బాలికలపై జరిగే అకృత్యాలు, ఉన్మాదుల దాడులను తీవ్రంగా పరిగణించాలి. బాధితులకు కోర్టుల చుట్టూ తిరిగే బాధలు తప్పిస్తూ... ఈ కేసులపై తక్షణ విచారణ చేపట్టాలి. దీని కోసం తక్షణం సంస్కరణలు అనివార్యం. జ్యోతిర్మయి కేసులో బర్మింగ్‌హామ్‌ పోలీసులు చూపించిన చొరవను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. దోషులకు వీలైనంత త్వరగా శిక్షలు పడేలా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలి. అప్పటికి కానీ నగరంలో మరో మధులిక ఉదంతం చోటు చేసుకోకుండా ఉంటుంది.  

పెద్దల పర్యవేక్షణ కీలకం
యుక్త వయస్సు వచ్చిన పిల్లల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్కసారిగా స్వేచ్ఛ వస్తుంది. ఆ సమయంలో వారిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం యాంత్రిక జీవితంలో కేవలం ఉన్నత కుటుంబాలకే కాదు... మధ్య తరగతి వారిలోనూ పిల్లలపై శ్రద్ధ తగ్గింది. ఫలితంగా పిల్లలకు ఎక్కడ లేని స్వేచ్ఛ వచ్చి పడుతోంది. దాంతో యుక్తవయస్సు రాగానే పెడదారులు పడుతున్నారు. ప్రేమ వ్యామోహంలో పడుతున్నారు. ఇవే సినిమా–టీవీల ప్రభావంతో ఒక్కోసారి హద్దులు దారుణాలకు దారి తీస్తున్నాయి. మరోపక్క విద్యాసంస్థలు, కాలేజీల యాజమాన్యాలకు విద్యార్థుల బాగోగులు పట్టించుకునే, వారికి జీవితం విలువ తెలియజెప్పే తీరిక లేకుండా పోయింది. అనునిత్యం వీరి దృష్టి అంతా పరీక్షలు, ర్యాంకుల పైనే. జీవిత ప్రస్థానంలో కీలకమైన యుక్తవయస్సులో యువతీయువకులపై పర్యవేక్షణకొరవడి దారితప్పుతున్నారు.  – రాజశేఖర్, మానసిక నిపుణులు

‘మచ్చ’తునకలు..
రాజేంద్రనగర్‌ పరిధిలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య చదివే అనురాధపై యాసిడ్‌ దాడికి పాల్పడింది ఆమెకు సీనియరే. ఈ ఉదంతం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.  
దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో భార్గవి యాదవ్‌ బలైంది. ప్రేమ పేరుతో ఆమెను అనునిత్యం వేధింపులకు గురిచేస్తున్న  సంతోష్‌ ఒకరోజు రెచ్చిపోయాడు. కళాశాల నుంచి తిరిగి వస్తున్న భార్గవిని సరూర్‌నగర్‌లోని ఆమె ఇంటి సమీపంలోనే అత్యంత దారుణంగా హతమార్చాడు.  
కార్వాన్‌ ప్రాంతంలో వివాహిత రాణి వెంటపడిన కామాంధుడు కన్నయ్య సింగ్‌ ప్రేమ పేరుతో తీవ్రంగా వేధించాడు. ఎప్పటికీ ఆమె మాట వినట్లేదని క„ý  కట్టి కత్తితో దాడి చేశాడు.  
స్వాతి అనే యువతిపై బంజారాహిల్స్‌ పరిధిలో ఓ ప్రేమోన్మాది విరుచుకుపడ్డాడు. ఆమె బంధువుతో సహా సజీవ దహనం చేయాలని ప్రయత్నించాడు.   
వర్థమాన నటి భార్గవిని ఉన్మాదిగా మారిన ప్రవీణ్‌కుమార్‌ హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.  
బాలానగర్‌ ప్రాంతంలో అరుణ అనే బాలికపై ఆమె సమీప బంధువు శివశంకర్‌రెడ్డి దాడి చేసి హత్య చేశాడు.  
మీర్‌పేటలో ఉన్న టీఆర్‌ఆర్‌ కాలేజీలో లావణ్య అనే విద్యార్థినిపై ఓ మృగాడు దాడి చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement