అమీర్‌పేట: కుటుంబ తగాదాల నేపథ్యంలో భర్త నుంచి విడిపోయి వేరు గా ఉంటున్న తనను వేధిస్తున్న యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి పదేళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు రావ టంతో భర్త నుంచి విడిపోయి చెన్నైలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తాను చెన్నైలో, పిల్లలు మరోచోట ఉంటుండటంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి నగరానికి వచ్చి ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో పెయిడ్ గెస్ట్‌గా ఉంటోంది. ఈ నేపథ్యంలో సుశాంక్ అనే దూరపు బంధువుతో పరిచయం ఏర్పడింది.
దీనిని ఆసరాగా చేసుకున్న సుశాంక్ తనను పెళ్లి చేసుకోవాలని నిత్యం వేధిస్తున్నాడు. ఈ నెల 24న మాట్లాకుందామంటూ ఎస్‌ఆర్‌నగర్ సుప్రభాత్ హోటల్ వద్దకు ఆమెను పిలిపించాడు. మరోసారి పెళ్లి ప్రస్తావన తేవడంతో అందుకు నిరాకరించింది. దీంతో రెచ్చిపోయిన సుశాంక్ వెంట తెచ్చుకున్న ఎలక్ట్రికల్ పరికరంతో ఆమెపై దాడి చేశాడు. భయంతో పోలీసులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కుని పగులగొట్టాడు. మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే యాసిడ్ పోసి చంపుతానని బెదిరించాడు. వేధింపులు అధికం కావడంతో బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సుశాంక్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment