అందుబాటులోకి విజ్ఞాన గని | Knowledge available to the mine | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి విజ్ఞాన గని

Published Thu, Sep 4 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM

అందుబాటులోకి విజ్ఞాన గని

అందుబాటులోకి విజ్ఞాన గని

  • సైన్స్‌సెంటర్, ఇండోర్ స్టేడియూన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
  • రాష్ర్టంలోనే ఏకైక సైన్‌‌స సెంటర్ ఇదే..
  • పూర్తయిన నిర్మాణ పనులు
  • శిల్పారామం, మ్యూజియంపైనా దృష్టి
  • ప్లానెటోరియం పునరుద్ధరణపై చర్చ
  • ఆ మూడూ పూర్తయితే సాంస్కృతిక వైభవం వచ్చినట్టే..
  • సాక్షి, హన్మకొండ : నగరానికి మణిపూసలుగా పేర్కొనదగిన ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసేందుకు ఈ నెల 9న వరంగల్ నగరానికి వస్తున్నారు. దీంతో పాటు హంటర్‌రోడ్డులో ఉన్న స్టేట్ సైన్స్ సెంటర్, కార్పొరేషన్ ఆవరణలో ఉన్న ఇండోర్ స్టేడియంను ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ రెండు ప్రాంతాల్లో హడావుడిగా పనులు చేపట్టారు. అంతేకాకుండా.. ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న శిల్పారామం, పురావస్తుశాఖ మ్యూజియం నిర్మాణంతో పాటు మూడేళ్లుగా మూతపడి ఉన్న ప్లానెటోరియం స్థితిగతులపై సైతం సీఎం దృష్టి సారించే అవకాశం ఉండటంతో వాటికి సంబంధించి కూడా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
     
    ఏకైక సైన్స్ సెంటర్..

    ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1986లో ఏకకాలంలో తిరుపతి, విజయవాడ, వరంగల్‌లో మూ డు రీజినల్ సైన్స్‌సెంటర్లను మంజూరు చేశారు. అయితే 1999 వరకు ఎవరూ ఈ సెంటర్ గురించి పట్టించుకోలేదు. ఎట్టకేలకు 1999లో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు శిలాఫలం వేశారు తప్పితే నిధులు కేటాయించలేదు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో 2008లో ఈ సెంట ర్ నిర్మాణం కోసం రూ.5.87 కోట్లు కేటాయించారు. ఆయన అకాల మరణం తర్వాత మళ్లీ వేగం మందగించింది. నెమ్మది నెమ్మదిగా పనులు జరుగుతూ 2012లో భవనం నిర్మాణం పూర్తుంది.

    ఆ ఏడాదిలోనే కోటి రూపాయల వ్యయం చేసే సైన్సు ఎగ్జిబిట్లు అమర్చారు. ఆ తర్వాత ఏడాది పాటు పనుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. సైన్స్ సెంటర్ ప్రారంభోత్సవంలో జరుగుతున్న జాప్యంపై ‘సాక్షి’ వరుసగా కథనాలు ప్రచురించింది. అయితే ఇటీవల పనులు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే లిఫ్టును బిగించడం పూర్తికాగా వాహనాల పార్కింగ్, లాన్, ల్యాండ్‌స్కేప్, టాయిలెట్స్, ఆర్చ్, సెక్యూరిటీ సెల్ వంటి పనులు పూర్తికావొచ్చాయి. ప్రస్తుతం ఈ సైన్స్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.

    మూడు అంతస్తుల భవనం గల గల సైన్స్ సెంటర్ ప్రాంగణంలో పార్కింగ్ మొదలు భవనంలో ప్రతీ అంతస్తులో వివిధ శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన ఎగ్జిబిట్లు బిగించారు. ఏడు విశాలమైన హాళ్లలో కూడి ప్రధాన భవనంలో మొదటి రెండు హాళ్లలో ఫిజికల్ సైన్స్ ఎగ్జిబిషన్లు ఉన్నాయి. మిగతా వాటిలో వరుసగా స్పేస్‌సైన్స్, సోలార్ పవర్, 5డి థియేటర్, ఎన్విరాన్‌మెంటల్ పొల్యుషన్‌లతో పాటు మానవ శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన నమూనాలు ఉన్నాయి. చివరగా ఎడ్యుకేషన్ త్రూ సాటిలైట్ హాల్ కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక సైన్స్ సెంటర్ ఇదే.
     
    ఇక ఆడుకోవచ్చు..

     
    వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో రూ.3.5 కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియాన్ని నిర్మించేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 2010 సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం పూర్తరుు ఏడాదిన్నర గడుస్తున్నా ఇంత వరకు స్టేడియాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తేలేదు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ భవనం నేటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఈ భవనం నిర్మాణం పూర్తరున కొత్తలో నగరంలో సేకరించిన పొడి చెత్తను నిల్వ చేసేందుకు వినియోగించారు.

    ఈ అంశంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడటంతో చెత్తను తొలిగించారు. ఆ వెంటనే కోటి రూపాయల వ్యయంతో మలేషియా నుంచి తెప్పించిన ఉడెన్‌తో మల్టిపర్పర్స్ గేమ్స్ ఆడుకునేలా ఫ్లోరింగ్ రూపొందించారు. ఈ ఇండోర్ స్టేడియంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్, షటిల్, బ్యాడ్మింటన్ కోర్టులు అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబరు 9న ముఖ్యమంత్రి కేసీఆర్ నగరానికి వస్తున్న నేపథ్యంలో ఈ స్టేడియం ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
     
    శిల్పారామం... శిలాఫలకం
     
    దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2008లో విజయవాడ, వరంగల్, నెల్లూరుతో పాటు అనంతపురంలో కొత్త శిల్పారామాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరగాల్సి ఉంది. కానీ ఆరేళ్ల్ల నుంచి ఈ ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైంది. అదే సమయంలో విజయవాడ, నెల్లూరు శిల్పారామాల ప్రారంభమయ్యాయి.

    పాలకుల వివక్ష, స్థానిక నాయకుల నిర్లక్ష్యం వల్ల వరంగల్ శిల్పారామం నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోపాలపురంలో రూ.5 కోట్లతో ఈ శిల్పారామం నిర్మించాలని నిర్ణయించారు. సర్వేనంబరు 89లో ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటికే శిల్పారామం నిర్మాణం కోసం కేటాయించారు. మొదట ఈ శిల్పారామాన్ని ఖిలావరంగల్‌లో నిర్మించాలనుకున్నప్పటికీ పురవాస్తుశాఖ నుంచి అభ్యంతరం వ్యక్తం చేయడంతో బాలసముద్రాన్ని ఎంపిక చేశారు.

    అయితే ఇక్కడ అనువైన స్థలం లభించకపోవడంతో అక్కడి నుంచి హసన్‌పర్తికి మార్చారు. కానీ చివరికి యూనివర్సిటీ సమీపంలో ఉన్న గోపాలపురాన్ని ఎంపిక చేశారు. హస్తకళలను, కళాకృతులను ప్రదర్శించేందుకు ఇరవైకి పైగా స్టాళ్లు, ఆడిటోరియంలతో పాటు ఓపెన్‌ఎయిర్ థియేటర్‌తో ఈ శిల్పారామం ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్రంలోనే పేరెన్నికగల హస్తకళాకారులు జిల్లాలో ఉన్నప్పటికీ వారి కళలను ప్రదర్శించేందుకు ఇంత కాలం అనువైన వేదిక కరువైంది. ఈ శిల్పారామం పూర్తయితే పెంబర్తి కళాకారులకు మంచి ఊతం లభిస్తుంది.
     
    మూడుసార్లు వాయిదా..
     
    ఖిలావరంగల్‌లో రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాల్సిన పురావస్తు మ్యూజియం ఏర్పాటు అంశం ఏళ్ల తరబడి ఫైళ్లలోనే మగ్గుతోంది. చింతల్ నుంచి కీర్తితోరణాలకు వచ్చే దారిలో రాతికోట దాటిన తర్వాత ఎకరం స్థలంలో నిర్మిస్తామంటూ 2012లో శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇదిగో.. అదిగో నిర్మాణం అంటూ అధికారులు మాటలు చెప్పడం తప్పితే ఇంత వరకు అడుగులు వేయడం లేదు. స్థల వివాదం సాకుగా చూపుతూ ఏళ్లు గడిపేస్తున్నారు.

    అదేవిధంగా 90 సీట్ల సామర్థ్యమున్న ప్రతాపరుద్ర నక్షత్ర శాలలో ప్రొజెక్టర్ పనిచేయకపోవడంతో మూడేళ్లుగా మూతపడి ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో కొత్త ప్రొజెక్టర్ ధర రూ.50 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు ఉంది. గత ప్రభుత్వం ఈ ప్రదర్శన నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించడంతో క్రమంగా ఈ ప్లానెటోరియం ఉన్నదన్న సంగతే అంతా మర్చిపోయారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తే సత్వర పరిష్కారం లభిస్తుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతతం వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఈ ప్లానెటోరియం నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement