
సాక్షి, కొడిమ్యాల(చొప్పదండి): ఆపద్దర్మ మంత్రులు వచ్చారు.. పరామర్శించి, ఎక్స్‌గ్రేషియా ప్రకటించి వెళ్లారు. అధికారులు వచ్చారు.. సహాయక చర్యలు పరిశీలించి వెళ్లారు. వైద్య సిబ్బంది గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. కానీ మృతి చెందినవారిని అందరూ గాలికొదిలేశారు. మృతి చెందిన వారి బంధువులెవరు.. వారి ఆర్థిక, కుటుంబ పరిస్థితులేంటని పట్టించుకున్న నాదుడే లేడు. అయినవారి కడసారి చూపు కోసం ఫ్రీజర్ బాక్స్(ఐస్ బాక్స్)లో పెట్టే ఆర్థిక స్థోమత లేక మృతదేహాలను మంచు గడ్డలతో కప్పి పెట్టారు. ఈ హృదయవిదారక దృశ్యాన్ని చూసి కొడిమ్యాల మండల ప్రజలు చలించపోతున్నారు.
కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొడిమ్యాల మండలంలో విషాదాన్ని నింపింది. ఈ మండలానికి చెందిన వారే సుమారు 49 మందికి పైగా మృత్యువాతపడ్డారు. దీంతో ఈ మండలంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఉపాధి కోసం పరాయి దేశానికి వలస వెళ్లారు. కొండగట్టు ఘాట్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ వారు మరణించిన విషయం తెలుసుకొని కడసారి చూపుకోసం హుటాహుటిని స్వస్థలానికి బయలుదేరారు. వారు వచ్చే వరకు మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్‌లు అందుబాటులో లేక.. ఉన్నా వాటికి అద్దె కట్టే ఆర్థిక స్థోమత లేక.. అధికారులు పట్టించుకోకపోవడంతో మంచు గడ్డలతో మృతదేహాలని కప్పిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment