కొహెడ: మామిడికాయల మార్కెట్‌ను కొత్తపేట నుంచి తరలించి తాత్కాలికంగా కొహెడలోని మార్కెట్ స్థలంలో ఏర్పాటు చేయనున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తెలిపారు. కొహెడ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి రోడ్డు సౌకర్యంపై దేవాదాయ శాఖ, హెచ్‌ఎండీఏ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఆయన సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ హరీష్‌తో కలిసి కొహెడలోని మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మామిడి సీజన్‌లో కొత్తపేటకు రోజుకు 400 నుంచి 600 వరకు లారీలు మామిడికాయల లోడ్‌తో వస్తాయని, రైతులు,కొనుగోలుదారులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారని అన్నారు. వారంతా ఒకేచోట గుమిగూడితే ఇబ్బందులు వస్తాయని మార్కెట్‌ను కొహెడకు తరలిస్తున్నామని చెప్పారు.
వారం రోజుల్లో పనులు పూర్తిచేసి మామిడికాయల మార్కెట్‌ను కొహెడలో ప్రారంభిస్తామన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌ను పూర్తి స్థాయిలో కొహెడకు తరలిస్తామన్నారు. సుమారు 180 ఎకరాల్లో మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ వీరమళ్ల రాంనర్సింహగౌడ్,డైరెక్టర్లు, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు ధన్‌రాజ్, సిద్దాల్ల జ్యోతి, బాలరాజ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment