kothapet market
-
అంత ధరైతే ఎట్టా! పచ్చడి పెట్టలేం.. పండ్లు తినలేం!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మధుర ఫలం పులుపెక్కింది. ఇటు పచ్చడి నిల్వ చేసుకోవాలనుకునే వారికి.. అటు పండ్ల రుచిని ఆస్వాదించాలనుకున్న వారికి నిరాశే మిగులుతోంది. కొత్తపేట పండ్ల మార్కెట్‌కు గతంలో రోజుకు 1000 టన్నుల మామిడి రాగా, ప్రస్తుతం బాటసింగారం మార్కెట్‌కు 600 టన్నులకు మించి రావడం లేదు. టన్ను ధర (కాయ సైజును బట్టి) రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు పలుకుతోంది. నాలుగు రోజుల క్రితం రికార్డుస్థాయిలో రూ.1.24 లక్షలు పలకడం విశేషం. డిమాండ్ మేర దిగుమతి లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. పండ్లరసాలు కిలో రూ.150–200 వరకు విక్రయిస్తుండగా, పచ్చడి కాయలు సైజును బట్టి ఒక్కోటి రూ.15–20 చొప్పున అమ్ముతుండటం గమనార్హం. (చదవండి: పిత్తాశయంలో రాళ్లెందుకు వస్తాయి? పరిష్కారాలేమిటి? ) మార్కెట్‌కు తగ్గిన సరఫరా బాటసింగారం మార్కెట్ నుంచి మామిడి సహా ఇతర పండ్లు సరఫరా అవుతుంటాయి. రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం సహా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర శివారు జిల్లాలకు చెందిన రైతులు తమ ఉత్పత్తులను ఇక్కడికే తెచ్చి అమ్ముతుంటారు. ప్రస్తుత సీజన్లో ఆయా జిల్లాల నుంచి రోజుకు సగటున వెయ్యి టన్నులకుపైగా మామిడి రావాల్సి ఉండగా, 500 టన్నుల లోపే వస్తోంది. పచ్చడిలో ఉపయోగించే పుల్లటి మామిడి కాయలే కాదు బంగినపల్లి, తోతాపురి, చెరుకురసం, సువర్ణ రేఖ, నీలం రకాల మామిడి పండ్లు కూడా రావడం లేదు. సాధారణంగా మార్చి చివరి నాటికి మార్కెట్లను ముంచెత్తాల్సిన ఫలరాజం ఏప్రిల్ రెండో వారంలోనూ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఇటు మామిడి.. అటు నిమ్మ వాతావరణ మార్పులతో మామిడి పూత, కాత తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలంగాణ రాష్ట్ర కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. చలికాలంలో భారీ వర్షాలు కురవడం.. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడం.. ఫిబ్రవరి నుంచి ఎండలు మండిపోవడం.. మార్చిలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పూత ఎండి పిందె రాలిపోయింది. గతంలో ఒక నిమ్మ చెట్టుకు ఐదు నుంచి ఆరు బస్తాల కాయలు వచ్చేవి. చీడపీడల కారణంగా ఈసారి ఒకటి రెండు బస్తాలకే పరిమితమైంది. వ్యవసాయ మార్కెట్లో బస్తా రూ.2,500 పైగా, సైజును బట్టి రిటైల్‌గా ఒక్కో కాయ రూ.10 పలుకుతోంది. ప్రస్తుతం పచ్చళ్ల సీజన్ మొదలైంది. సాధారణంగా ఈ సీజన్లో ప్రతి ఇంట్లో మామిడి, నిమ్మ పచ్చళ్లను తయారు చేసుకుని ఏడాదంతా నిల్వ చేసుకుంటారు. మామిడి, నిమ్మ కాయల ధరలకు తోడు వంటనూనెలు, మసాల దినుసులు, కారం పొడులు కూడా భారీగా పెరగడంతో పచ్చడి మొతుకుల కోసం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం తప్పడం లేదు. (చదవండి: అదృశ్యమైన సస్పెండెడ్ హోంగార్డ్ రామకృష్ణ మృతి.. పరువు హత్య?) -
టన్ను బత్తాయి ధర ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభ సమయంలో డిమాండ్ పెరగడంతో బత్తాయికి రికార్డు స్థాయిలో ధర లభించింది. హోల్‌సేల్ మార్కెట్లో టన్ను బత్తాయి ధర రూ.లక్ష పలుకుతోంది. సామాన్యులు మార్కెట్లో కొనుగోలు చేయాలంటే కిలో బత్తాయి రూ.100 కు విక్రయిస్తున్నారు. ఈ ధర గతంలో ఎప్పుడూ లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. విటమిన్–సి పుష్కలంగా ఉండడంతో డాక్టర్లు కోవిడ్ పేషెంట్లను బత్తాయి తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో చాలా మంది బత్తాయి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ కొత్తపేట్‌లో శుక్రవారం గతంలో ఎన్నడూలేని విధంగా టన్ను లక్ష రూపాయలు పలికింది. మరోవైపు రోజు మార్కెట్‌కు 800 టన్నుల బత్తాయి దిగుబడి రావాలి. కానీ గత నెల నుంచి డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక కూడా ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం కేవలం 300 టన్నుల బత్తాయి మాత్రమే మార్కెట్‌కు దిగుమతి అవుతోందని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. కరోనా కాలంలో కొత్తపేట పండ్ల మార్కెట్ నుంచి బత్తాయి ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధర టన్ను బత్తాయి ధర రూ.లక్ష పలకడం కొత్తపేట మార్కెట్ చరిత్రలోనే రికార్డు. కోవిడ్ నేపథ్యంలో బత్తాయి వినియోగం దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడి మార్కెట్ నుంచే ఎగుమతులు అవుతాయి. ఈ ఏడాది బత్తాయి పూత సమయంలో వర్షాలతో పూత రాలి దిగుబడి తగ్గింది. దీంతో కూడా డిమాండ్‌కు మేర సరుకు లేక ధర పెరిగింది. – సయ్యద్ అఫ్సర్, హోల్‌సేల్ వ్యాపారి, కొత్తపేట చదవండి: అమ్మ నా ‘బత్తాయో’..! ధర అంతేంటి? -
కొత్తపేట్ మార్కెట్‌కు తాళం
సాక్షి, హైదరాబాద్: కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్‌ను నేటి నుంచి మూసివేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించారు. కరోనా ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మార్కెట్‌కు పండ్లు తెచ్చే రైతులు, కొనుగోలుకు వచ్చే వ్యాపారులు కోహెడకు వెళ్లాలని సూచించారు. అయితే కోహెడలో సరైన వసతులు లేవని, తాత్కాలిక షెడ్లు మాత్రమే ఉన్నాయని, వ్యాపార లావాదేవీలు ఎలా చేపట్టాలని రైతులు, వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల క్రితం కూడా కోహెడ వెళ్లాలని అధికారులు సూచించారు. అయితే అక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయకపోవడంతో గాలివాన, భారీ వర్షానికి షెడ్లన్నీ కుప్పకూలిపోయాయి. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకుండా కోహెడ వెళ్లాలని అధికారులు ఆదేశిస్తున్నారని, ఇది సరికాదని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలమైనందున, అక్కడ ప్లాట్‌ఫారాలు లేకపోవడంతో పండ్లు నేల పాలవుతాయని ఆందోళ వ్యక్తం చేన్నారు. గతంలో షెడ్లు కొందరు రైతులు, వ్యాపారులు గాయపడ్డారని మళ్లీ కోహెడకు వెళ్లాలంటే భయమవుతోందంటున్నారు. అధికారులు కోర్టు ఆదేశాలును బేఖాతరు చేస్తున్నారు మూడు నెలల క్రితం ఫ్రూట్ మార్కెట్‌ను కోహెడకు తరలించారు. అయితే అక్కడ ఎలాంటి వసతులు లేకపోవడంతో రైతులు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో కమీషన్ ఏజెంట్లు హై కోర్టును ఆశ్రయించారు. పూర్తి స్థాయిలో పక్కాగా నిర్మాణాలు చేపట్టిన అనంతరమే మార్కెట్‌ను కోహెడకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకుండానే ఈ నెల 12వ తేదీ నుంచి మార్కెట్‌ను కోహెడకు తరలిస్తున్నారు. కోర్టు అదేశాలను లెక్క చేయకుండా మార్కెటింగ్ శాఖ వ్యవహరిస్తోందని, కోర్టు ధిక్కర చర్యగా పేర్కొంటూ మళ్లీ కోర్టును ఆశ్రయిస్తున్నట్లు కమీషన్ ఏజెంట్లు తెలిపారు. ఎక్కడైనా కరోనా ప్రబలుతుంది కొత్తపేట్ మార్కెట్‌ను మూసివేసి కోహెడకు తరలిస్తే కరోనా ప్రబలదా అని రైతులు, వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కొత్తపేట్ మార్కెట్లో శానిటైజేషన్ ఏర్పాట్లు చేయకుండా, వ్యాధి నిరోధక విధానాలు అవలంబించకుండా కోహెడకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని మార్కెట్ తరలించేందుకు ఇంత తొందరపాటు వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కోహెడ మార్కెట్ సమీపంలో ప్రజా ప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు, మార్కెటింగ్ శాఖ అధికారులు భూములు కొనుగోలు చేశారని, వీటి విలువ పెంచుకోవడానికి మార్కెట్‌ను తరలించేందుకు తొందరపెడుతున్నారని కమీషన్ ఏజెంట్లు అరోపిస్తున్నారు. -
నేటి నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్ మూత
సాక్షి, సిటీబ్యూరో: కొత్తపేట పండ్ల మార్కెట్‌ను నిరవధికంగా మూసివేశారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ మార్కెట్లో లావాదేవీలు కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇక్కడ కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు, రైతులు భౌతిక దూరం పాటించడం లేదు. మాస్క్‌లు ధరించడం లేదు. గుంపులు గుంపులుగా ఉంటూ పరిశుభత్రను తుంగలో తొక్కుతున్నారు. దీంతో బుధవారం నుంచి మార్కెట్‌ను నిరవధికంగా మూసివేస్తున్నట్లు గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకటేషం మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ నెల 13వ తేదీ బుధవారం నుంచి మార్కెట్ బంద్ చేస్తున్నామన్నారు. రైతులు, వ్యాపారులు మార్కెట్‌కు సరుకులు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. -
ఫ్రూట్ మార్కెట్ మూడు ముక్కలు!
సాక్షి సిటీబ్యూరో: కరోనా మహమ్మారి నుంచి జనాన్ని రక్షించడానికి మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌ను మూడు ప్రాంతాలకు తరలించారు. మామిడి సీజన్‌తో పాటు రంజాన్ నెల నేపథ్యంలో పండ్లు కొనుగోలు చేయడానికి మార్కెట్‌కు వేల సంఖ్యలో జనం వస్తున్నారు. ఇక్కడ రద్దీని తగ్గించడంతో పాటు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా కమీషన్ ఏజెంట్లు ఫ్రూట్స్‌ను మూడు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని అధికారులు చెప్పారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్... కొత్తపేట మార్కెట్ తెలంగాణలోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలు, ఆయా దేశాల నుంచి కూడా ఇక్కడికి పండ్లు రావడంతో గ్రేటర్ పరిధి నుంచే కాకుండా ఆయా జిల్లాలు, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలు వ్యాపారులు, రైతు లు ఈ మార్కెట్‌కు వస్తారు. దీంతో ఇక్కడ కరోనా వ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్తగా మార్కెట్‌ను మూడు ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో మామిడి బత్తాయి, సరూనగర్ రైతు బజార్ వెనుక వైపు టెలిఫోన్ కాలనీ వెళ్లే మార్గంలో ద్రాక్ష, ఆరెంజ్, సపోటా, ఉప్పల్ భగాయత్ మార్కెట్లో బప్పాయి, వాటర్ మిలన్‌తో పాటు ఇతర పండ్లు విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో దాదాపు వారం రోజులుగా మూడు ప్రాంతాల్లో మార్కెట్ కొనసాగుతోంది. ఈ విషయాన్ని పండ్ల వ్యాపారులు గ్రహించాలని అధికారులు తెలిపారు. అధిక పని భారం.. మార్కెట్ మూడు ప్రాంతాల్లో ఉండటంతో యార్డు ఇన్‌చార్జ్‌లకు కష్టమవుతోంది. గతంలో కొత్తపేటలోనే అన్ని పండ్ల విక్రయాలు జరిగేవి. మొత్తం మా ర్కెట్‌ను ఉన్నత అధికారులు మూడు భాగాలుగా విభజించి సూపర్వైజర్లకు డ్యూటీలు వేసేవా రు. ప్రస్తుతం ఒక్కో మార్కెట్‌కు ఇద్దరు సూపర్వైజర్లతో పాటు ఇతర సిబ్బంది నియమించాల్సి వస్తోంది. దీంతో అధికారులు, సిబ్బందిపై అధిక పనిభారం పడటంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అధికారులు అంటున్నారు. వైరస్ వ్యాప్తి అరికట్టేందుకే... కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకే మార్కెట్‌ను మూడు ప్రాంతాలకు అధికారులు తరలించారు. అయినా రద్దీ కాస్త ఎక్కువగానే ఉంది. ప్రత్యేకంగా కొత్తపేట మార్కెట్లో మామిడి దిగుమతులు ఎక్కువ ఉండటంతో జనం ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. మార్కెట్లో శానిటేషన్తో పాటు భౌతికదూరం పాటించాలనిజీహెచ్‌ఎంసీతో పాటు మార్కెట్ సిబ్బంది, పోలీసులు రైతులకు, వ్యాపారులకు అవగాహనకల్పిస్తున్నారు. మార్కెట్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశాం. మూడు మార్కెట్లను పర్యవేక్షిస్తున్నాం. – వెంకటేషం,గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి -
కొహెడలో మామిడి మార్కెట్
కొహెడ: మామిడికాయల మార్కెట్‌ను కొత్తపేట నుంచి తరలించి తాత్కాలికంగా కొహెడలోని మార్కెట్ స్థలంలో ఏర్పాటు చేయనున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తెలిపారు. కొహెడ మార్కెట్లోకి ప్రవేశించడానికి రోడ్డు సౌకర్యంపై దేవాదాయ శాఖ, హెచ్ఎండీఏ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఆయన సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ హరీష్‌తో కలిసి కొహెడలోని మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మామిడి సీజన్లో కొత్తపేటకు రోజుకు 400 నుంచి 600 వరకు లారీలు మామిడికాయల లోడ్‌తో వస్తాయని, రైతులు,కొనుగోలుదారులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారని అన్నారు. వారంతా ఒకేచోట గుమిగూడితే ఇబ్బందులు వస్తాయని మార్కెట్‌ను కొహెడకు తరలిస్తున్నామని చెప్పారు. వారం రోజుల్లో పనులు పూర్తిచేసి మామిడికాయల మార్కెట్‌ను కొహెడలో ప్రారంభిస్తామన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌ను పూర్తి స్థాయిలో కొహెడకు తరలిస్తామన్నారు. సుమారు 180 ఎకరాల్లో మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ వీరమళ్ల రాంనర్సింహగౌడ్,డైరెక్టర్లు, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు ధన్‌రాజ్, సిద్దాల్ల జ్యోతి, బాలరాజ్ పాల్గొన్నారు. -
‘పండు’ గగనమే..
సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి వైరస్‌నైనా ఎదుర్కోవాలంటే శరీరంలో రోగ నిరోధకశక్తి పుష్కలంగా ఉండాలి. కరోనా మహమ్మారిని సైతం సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు ఆ శక్తే ఎంతో కీలకమైనది. వైద్యులు, పోషకాహారనిపుణులే కాకుండా ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రోగనిరోధకశక్తిని పెంచుకొనేందుకు విటమిన్–సి ఉన్న పండ్లు తినాలని చెప్పారు. కానీ లాక్డౌన్ కారణంగా ఆ పండ్లు ఇప్పుడు ప్రజలకు దూరమయ్యాయి.కొత్తపేట పండ్ల మార్కెట్లో గుట్టలకొద్దీ బత్తాయిలు, సంత్రాలు, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్లు ఉన్నప్పటికీ రిటైల్ పండ్ల మార్కెట్లు స్తంభించిపోవడంతో సామాన్యులు పండ్లు కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. కొత్తపేట పండ్ల మార్కెట్లో ప్రస్తుతం 50 టన్నులకు పైగా బత్తాయి, సంత్రా, దానిమ్మ, తదితర పండ్లు ఉన్నట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ల నుంచి ప్రతి రోజు లారీల్లో బత్తాయిలు మార్కెట్‌కు చేరుతున్నాయి. అలాగే నాగ్‌పూర్ నుంచి సంత్రాలు వస్తున్నాయి. కానీ కొద్ది రోజులుగా రిటైల్ విక్రయాలు నిలిచిపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే పండ్ల దిగుమతులను కూడా తగ్గించారు. ఇప్పటికే టన్నుల కొద్దీ నిల్వ ఉండడం వల్ల కొత్తగా వచ్చే పండ్లను తగ్గించినట్లు పేర్కొన్నారు. కూరగాయల తరహాలో విక్రయించాలి... లాక్డౌన్ నేపథ్యంలో నగరంలో నిత్యావసర వస్తువులకు, కూరగాయలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుబజార్లు, ప్రధాన మార్కెట్ల నుంచి కాలనీలకు, అపార్ట్మెంట్లకు సరఫరా చేసేందుకు 150 సంచార రైతుబజార్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇదే తరహాలో విటమిన్– సి పుష్కలంగా లభించే బత్తాయి, సంత్రాలు, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లను కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తే వాటి వినియోగం పెరుగుతుంది. ప్రస్తుత కరోనా వ్యాప్తి దృష్ట్యా రోగనిరోధకశక్తిని పెంచుకొనేందుకు అవకాశం లభిస్తుంది. సంచార వాహనాల ద్వారా సమీప కాలనీల వద్దనే కూరగాయలు కొనుగోలు చేయగలుగుతున్నారు. అదేవిధంగా పండ్లను అందుబాటులోకి తీసుకురావడం మంచిదని పోషకాహార నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఆహారంలో పండ్లు భాగమవ్వాలి : నిమ్మజాతి ఫలాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఒక మనిషి రోజుకు ఒక బత్తాయి, సంత్రా, జామ పండ్లలో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకోవాలి, కనీసం 100 గ్రాముల ఫలాలు ఆహారంలో భాగంగా ఉండాలి. అంతకంటే ఎక్కువ తీసుకున్నా మంచిదే.కానీ తగ్గకూడదు. నిమ్మ, ఉసిరి వివిధ రూపాల్లో తీసుకోవడం మంచిది. అలాగే 30 గ్రాముల డ్రైఫ్రూట్స్ 100 గ్రాముల ఆకుకూరలు, 200 గ్రాముల కూరగాయలు, 80 గ్రాముల పప్పులు, భోజనంలో ఉండేలా చూసుకోవాలి. 300 గ్రాముల ఆహారం తీసుకోవాలి. వ్యాయామం, నడక సరే సరి. ఇలా చేయడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.-ప్రొఫెసర్ దమయంతి,రిటైర్డ్ సైంటిస్ట్ ,ఎన్ఐఎన్ -
తీపి కల తీరెన్
ఎల్బీనగర్: దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంత వాసులకుతీపి కబురు. ఇక్కడి పండ్ల మార్కెట్ తరలింపు ఎప్పుడెప్పుడా అనే ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పడింది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2011 నుంచి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చేస్తున్న సుదీర్ఘ పోరాటం ఫలించినట్లయ్యింది. సుమారు 9 ఏళ్లుగా మార్కెట్ తరలింపు విషయంలో మంత్రులతో పాటు అధికారులతో పలు దఫాలుగా ఆయన చర్చలు జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తరలింపునకు పునాది పడినా జీఓలు జారీ చేయకపోవడంతోపాటు స్థల సేకరణ విషయంలో జాప్యం ఏర్పడింది. ఇన్నేళ్ల తర్వాత ఓ కొలిక్కి రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక తరలింపే ఆలస్యం.. కోహెడలో 178 ఎకరాల ప్రభుత్వ భూమిలో మార్కెట్ ఏర్పాటుకు వ్యవసాయ మార్కెట్ శాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ జనార్దన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కొన్నేళ్లుగా మామిడి సీజన్ రాగానే మార్కెట్ తరలింపు ఇదిగో అదిగో అంటూ అధికారులు తర్జనభర్జన పడేవారు. 1986లో కొత్తపేటలో 22 ఎకరాల స్థలంలో అప్పటి ప్రభుత్వం పండ్ల మార్కెట్‌ను తరలించేందుకు నిర్ణయించారు. శివారు ప్రాంతం కావడంతో అనువుగా ఉందని నగరంలోని మార్కెట్‌ను ఇక్కడికి తరలించారు. జనాభా పెరగడం, కాలనీలు విస్తరించడం, వాహనాల సంఖ్య పెరగడంతో కాలుష్యంతో పాటు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా తలెత్తింది. దీంతో సుధీర్‌రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే పండ్ల మార్కెట్ తరలింపునకు ప్రణాళికలు వేశారు. అప్పట్లో జీఓ వస్తుందనే సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మరుగున పడింది. 2014 ఎన్నికల్లో సుధీర్‌రెడ్డి ఓటమి చెందారు. దీంతో మార్కెట్ తరలింపు విషయం పూర్తిగా ఆగిపోయింది. ఆయన తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మార్కెట్ తరలింపుపై పలు పట్టుబట్టారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో పలుమార్లు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే గడ్డిఅన్నారం మార్కెట్‌ను కోహెడకు తరలించేందుకు జీఓ విడుదలైంది. మొత్తానికి మార్కెట్ తరలింపు విషయంలో సుధీర్‌రెడ్డి కల నిజమైందని చెప్పవచ్చు. కాగా.. కోహెడకు మార్కెట్ తరలింపే ఇక ఆలస్యమని సమాచారం. ఈసారి మామిడి సీజన్ ఎక్కడ..? ఈసారి మామిడి సీజన్ ఎక్కడ నిర్వçహించాలనే విషయమై పాలక మండలి, అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మామిడి సీజన్లో రోజుకు సుమారు 400 నుంచి 600 లారీలు వస్తుంటాయి. దీంతో ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండడడంతో గత సంవత్సరమే కోహెడలో నిర్వహించాలనుకున్నా అది కుదరలేదు. ఈసారి కూడా సాధ్యం కాకపోవచ్చనే తెలుస్తోంది. తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేయాలన్న సమయం లేకపోవడంతో ఈసారి ఇక్కడే మామిడి సీజన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మామిడి సీజన్ వచ్చే నెల నుంచే ప్రారంభం కానుండటంతో అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వారంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా.. ఈ దఫా మామిడి సీజన్‌ను గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లోనే నిర్వహించాలనే విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చైర్మన్ వీరమల్ల రాంనర్సింహ గౌడ్ అన్నారు. ఈ విషయంపై వారం రోజుల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. -
కొత్తపేట టు కోహెడ’ ఎప్పుడో?
సాక్షి, సిటీబ్యూరో: కొత్తపేట పండ్ల మార్కెట్ కోహెడకు తరలించే పనుల్లో జాప్యం నెలకొంటోంది. దీంతోఈ ఏడాది మామిడి సీజన్‌కు ముందే మార్కెట్నుతరలించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా లేదు. 2015లోనే ఈ మార్కెట్ తరలించాలని నిర్ణయించినప్పటికీ అనివార్యకారణాల వల్ల వాయిదాపడుతూవచ్చింది. తాజాగా మార్కెట్‌ను యుద్ధప్రాతిపదికన తరలించాలని ప్రభుత్వం ఆదేశించడంతో మార్కెటింగ్ అధికారుల్లో అలజడిమొదలైంది. అయితే, ఈ మామిడి సీజన్‌కు ముందే మార్కెట్‌ను తరలించాలనుకున్నా కోహెడలో పూర్తిస్థాయిలో పనులు పూర్తికాకపోవడంతో మరోమూడు నెలలు పట్టేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొత్తపేట నుంచి కోహెడకు పండ్ల మార్కెట్‌ను తరలించడం ద్వారా నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడంతో పాటు విజయవాడ మార్గంలో వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొహెడలో 178.09 ఎకరాల్లో భూమి చదును చేశామని అంటున్నారు. అయితే మార్కెట్ షెడ్లు నిర్మాణాలు ఇంకా ప్రారంభించలేదు. వాహనాల పార్కింగ్ కోసం అంతర్గత రోడ్లు, పార్కింగ్ యార్డుల కోసం స్థలాలు కూడా కేటాయించాల్సి ఉంది. వీటిన్నిటిని గమనిస్తే మార్కెట్ తరలింపులో ఆలస్యం తప్పదనిపిస్తోంది. ఐదేళ్ల నుంచే డిమాండ్.. మామిడి సీజన్లో విజయవాడ రూట్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో కొత్తపేట్‌లోని ఫ్రూట్ మార్కెట్‌ను అదే దారిలోని నగర శివారు ప్రాంతానికి తరలించాలని 2015లోనే ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం విజయవాడ హైవే రూట్లో కొత్తపేట్ మార్కెట్ నుంచి 23 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోహెడ గ్రామంలో 178.09 ఎకరాల భూమిని కేటాయించారు. 2018 నుంచి మార్కెట్ తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో 178.09 ఎకరాల భూమిని చదును చేశారు. దీంతో పాటు మార్కెట్ స్థలంలో బోర్లు వేశామని మార్కెట్ అధికారులు చెప్పారు. గతంలో నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఎదురవడంతో 1986లో మొజంజాహీ మార్కెట్లో కొనసాగుతున్న ఫ్రూట్ మార్కెట్‌ను కొత్తపేటకి మార్చారు. ఇప్పుడు కొత్తపేట ప్రూట్ మార్కెట్ వద్ద కూడా మొజంజాహీలో ఉన్నప్పటి పరిస్థితులు ఎదురవడంతో కోహెడకు మార్చాలని ప్రభుత్వంనిర్ణయించింది. స్పీడ్ పెంచాల్సిందే... గత ఐదేళ్లుగా ప్రతి ఏటా మామిడి సీజన్లో (అంటే మార్చి నుంచి జూన్) విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభిస్తోంది. తెలంగాణ జిల్లాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి మామిడి ఎగుమతి, దిగుమతులు ఎక్కువగా ఉంటాయి. దీంతో కిలో మీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. వీటిని దృష్టిలోపెట్టుకుని ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనైనా మార్కెట్‌ను కోహెడకు తరలించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. కానీ మామిడి సీజన్‌కు 20 రోజులే సమయం ఉన్నా..పనులు పూర్తి కాలేదు. పనుల స్పీడ్ పెరిగితే ఏదైనా ఛాన్స్ ఉంటుంది. ప్రసుత్తం మార్కెట్లో 340 మంది లైసెన్స్డ్ కమిషన్ ఏజెంట్లు ఉన్నారు. వీరికి కోహెడలో షెడ్లు నిర్మించి షాపులు కేటాయించాల్సి ఉంది. ఈ దిశలో ఇంకా వేగం పెరగాలి. దీనిపై వ్యాపారులు కూడా ఆందోళనగా ఉన్నారు. పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించకుండా మార్కెట్‌ను ఎలా తరలిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కోహెడలో నిర్మాణాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే మూడు నెలల్లో పూర్తవుతుందని, అయినా ఆ దిశగా వారు పట్టించుకోవడం లేదని కొందరు వ్యాపారులు చెబుతుండడం కొసమెరుపు. -
బొప్పాయి కోసం గొడవ.. పండ్ల మార్కెట్లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : డెంగ్యూ ఫీవర్ విజృంభిస్తుండటంతో దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఇక డెంగీ అటాక్‌తో తలెత్తే ప్లేట్లెట్ల సమస్యను సమర్థంగా ఎదుర్కొంటే ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. బొప్పాయి, దానిమ్మ పండ్లను ఆహారంగా తీసుకుంటే ప్లేట్లెట్ల వృద్ధికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బొప్పాయికి భారీ గిరాకీ ఏర్పడింది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.100 పైగా పలుకుతోంది. మరో వైపు బొప్పాయి పంట తగినంత అందుబాటులో లేకపోవడంతో పండ్ల వ్యాపారులు దాని కోసం పోటీపడుతున్నారు. ఈ క్రమంలో కొత్తపేట పండ్ల మార్కెట్లో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. చెమటోడ్చి పండించిన పంటకు దళారులు తక్కువ మొత్తంలో చెల్లించి.. బయట భారీ మొత్తానికి అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపించారు. దళారుల రేట్లు నచ్చక నేరుగా విక్రయాలు జరిపారు. దీంతో బొప్పాయి పండ్లు తమకే అమ్మాలని రైతులపై దళారులు దాడి చేశారు. పరస్పరం దాడులతో పండ్ల మార్కెట్ దద్దరిల్లింది. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు. -
కొత్తపేట మార్కెట్లో దాడులు
హైదరాబాద్. కొత్తపేట చేపల మార్కెట్లో తూనికలు-కొలతలు, పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. తూనికలు కొలతలు శాఖ అధికారి కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దుకాణాలపై దాడులు చేసి ప్రభుత్వ ముద్రలు లేని తక్కెడలు, బాట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా షాపుల వారికి జరిమానాలు విధించారు. అయితే జరిమానా ఎంత అనేది అధికారులు ఇంకా వెల్లడించలేదు.