సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి వైరస్‌నైనా ఎదుర్కోవాలంటే శరీరంలో రోగ నిరోధకశక్తి పుష్కలంగా ఉండాలి. కరోనా మహమ్మారిని సైతం సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు ఆ శక్తే ఎంతో కీలకమైనది. వైద్యులు, పోషకాహారనిపుణులే కాకుండా ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రోగనిరోధకశక్తిని పెంచుకొనేందుకు విటమిన్–సి ఉన్న పండ్లు తినాలని చెప్పారు. కానీ లాక్‌డౌన్ కారణంగా ఆ పండ్లు ఇప్పుడు ప్రజలకు దూరమయ్యాయి.కొత్తపేట పండ్ల మార్కెట్‌లో గుట్టలకొద్దీ బత్తాయిలు, సంత్రాలు, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్లు ఉన్నప్పటికీ రిటైల్ పండ్ల మార్కెట్‌లు స్తంభించిపోవడంతో సామాన్యులు పండ్లు కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. కొత్తపేట పండ్ల మార్కెట్‌లో ప్రస్తుతం 50 టన్నులకు పైగా బత్తాయి, సంత్రా, దానిమ్మ, తదితర పండ్లు ఉన్నట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ల నుంచి ప్రతి రోజు లారీల్లో బత్తాయిలు మార్కెట్‌కు చేరుతున్నాయి. అలాగే నాగ్‌పూర్ నుంచి సంత్రాలు వస్తున్నాయి. కానీ కొద్ది రోజులుగా రిటైల్ విక్రయాలు నిలిచిపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే పండ్ల దిగుమతులను కూడా తగ్గించారు. ఇప్పటికే టన్నుల కొద్దీ నిల్వ ఉండడం వల్ల కొత్తగా వచ్చే పండ్లను తగ్గించినట్లు పేర్కొన్నారు.
కూరగాయల తరహాలో విక్రయించాలి...
లాక్‌డౌన్ నేపథ్యంలో నగరంలో నిత్యావసర వస్తువులకు, కూరగాయలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుబజార్‌లు, ప్రధాన మార్కెట్‌ల నుంచి కాలనీలకు, అపార్ట్‌మెంట్‌లకు సరఫరా చేసేందుకు 150 సంచార రైతుబజార్‌లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇదే తరహాలో విటమిన్– సి పుష్కలంగా లభించే బత్తాయి, సంత్రాలు, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లను కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తే వాటి వినియోగం పెరుగుతుంది. ప్రస్తుత కరోనా వ్యాప్తి దృష్ట్యా రోగనిరోధకశక్తిని పెంచుకొనేందుకు అవకాశం లభిస్తుంది. సంచార వాహనాల ద్వారా సమీప కాలనీల వద్దనే కూరగాయలు కొనుగోలు చేయగలుగుతున్నారు. అదేవిధంగా పండ్లను అందుబాటులోకి తీసుకురావడం మంచిదని పోషకాహార నిపుణులు సైతం సూచిస్తున్నారు.
ఆహారంలో పండ్లు భాగమవ్వాలి : నిమ్మజాతి ఫలాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఒక మనిషి రోజుకు ఒక బత్తాయి, సంత్రా, జామ పండ్లలో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకోవాలి, కనీసం 100 గ్రాముల ఫలాలు ఆహారంలో భాగంగా ఉండాలి. అంతకంటే ఎక్కువ తీసుకున్నా మంచిదే.కానీ తగ్గకూడదు. నిమ్మ, ఉసిరి వివిధ రూపాల్లో తీసుకోవడం మంచిది. అలాగే 30 గ్రాముల డ్రైఫ్రూట్స్ 100 గ్రాముల ఆకుకూరలు, 200 గ్రాముల కూరగాయలు, 80 గ్రాముల పప్పులు, భోజనంలో ఉండేలా చూసుకోవాలి. 300 గ్రాముల ఆహారం తీసుకోవాలి. వ్యాయామం, నడక సరే సరి. ఇలా చేయడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.-ప్రొఫెసర్ దమయంతి,రిటైర్డ్ సైంటిస్ట్ ,ఎన్‌ఐఎన్
Comments
Please login to add a commentAdd a comment