
ముగిసిన కృష్ణా పుష్కరాలు
బీచుపల్లి : తెలంగాణలో కృష్ణా పుష్కరాలు వైభవంగా ముగిశాయి. బీచుపల్లి ఘాట్ లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు లు కృష్ణమ్మకు ముగింపు హారతినిచ్చారు. ఈ హారతి కార్యక్రమంతో కృష్ణా పుష్కరాలు ముగిశాయి.
పన్నెండు రోజుల పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 2 కోట్ల 50 లక్షల మంది పుష్కర స్నానమాచరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో కోటి 80 లక్షలు, నల్లగొండ జిల్లాలో 70 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. పుష్కరాల్లో భక్తులకు విశిష్ట సేవలందించిన అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందిని మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ ఛైర్మన్ బండారు భాస్కర్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.