‘కృష్ణా’పై కేంద్రం వైఖరేమిటో?
10న సుప్రీంకోర్టులో తన వైఖరిని చెప్పనున్న కేంద్రం
ట్రిబ్యునల్ సభ్యుడి ఎంపికపైనా స్పష్టత వచ్చే అవకాశం
హైదరాబాద్: కృష్ణా నదీ జల వివాదంలో నీటి పంపకాలకు సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు 4 రాష్ట్రాల వాదనలు వినాలా? లేక తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకే వాదనలను పరిమితం చేయాలన్న దానిపై కేంద్రం చెప్పే వైఖరిపై ఆసక్తి నెలకొంది. ఈ నెల 10న సుప్రీంకోర్టులో జరగనున్న విచారణలో కేంద్రం ఏం చెబుతుందన్న దానిపై నాలుగు రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ మాత్రం మరోమారు నాలుగు రాష్ట్రాల వాదనలు విని పునఃకేటాయింపులపై నిర్ణయం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పనుంది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును యథావిధిగా అమలుచేస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగే దృష్ట్యా, దాన్ని కొట్టేసి, కొత్తగా తీర్పునిచ్చేలా ఆదేశాలివ్వాలని రాష్ట్రం సుప్రీంను అభ్యర్థించింది.
దీనిపై గత నెలలో విచారణ జరిపిన సుప్రీం.. తెలంగాణ వినతిపై వైఖరిని చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. గతంలోనే ఒకమారు వైఖరిని చెప్పాలని సుప్రీం సూచించినా కేంద్రం ఏమీ చెప్పలేదు. ప్రస్తుతం విచారణ తుది దశలో ఉన్నందున త్వరగా వైఖరిని చెప్పాలని సుప్రీం గట్టిగానే చెప్పడంతో ఈ నెల 10న జరగబోయే విచారణలో ఏదో ఒక వైఖరిని వెల్లడించే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటే బ్రిజేశ్ ట్రిబ్యునల్ సభ్యుడు డీకే సేథ్ మరణంతో ఖాళీ అయిన స్థానంలో మరో సభ్యుడి నియామకంలో చేపట్టిన చర్యలపైనా కేంద్రం స్పష్టతనిచ్చే అవకాశముంది.