హత్యా ? ఆత్మహత్యా ?
ఎటూ తేల్చని పోలీసులు
ఇప్పటికి ఆరుగురు నిందితుల అరెస్టు
కొనసాగుతున్న విచారణ
సూత్రధారి తప్పించుకున్నట్లు ప్రచారం ?
పరకాల : తల్లి లేని బిడ్డను బలి తీసుకున్న దుర్మార్గులు ఎవరనేది నేటికి స్పష్టం కావడం లేదు. పొట్టకూటి కోసం వచ్చి కామాంధుల చేతిలో బలైన బాలిక కృష్ణవేణి మరణం వెనుక ఉన్న మిస్టరీ వీడడం లేదు. సంచలనం కలిగించిన కృష్ణవేణిది హత్యానా లేక ఆత్మహత్యానా అనేది నిర్ధారణ కావడం లేదు.
నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ కోతులాపురం గ్రామానికి చెందిన ఇరుగుదిండ్ల వెంకటేష్, అతడి కుమార్తె కృష్ణవేణి(17) 13 నెలల క్రితం మండలంలోని నర్సక్కపల్లి గ్రామానికి జీవనోపాధి కోసం వలస వచ్చారు. గ్రామంలో క్రేన్‌సాయంతో బావుల్లో పూడికతీత పనులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కృష్ణవేణి జనవరి 27న డీజిల్ మంటల్లో కాలిపోయింది. ఈ ఘటన జరిగి పక్షం రోజులు దాటినా ఎలా జరిగిందనే విషయం మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేముల రాజును జనవరి 29న, పంప్ ఆపరేటర్ బాషబోయిన కుమారస్వామి, బండి మహేందర్‌ను ఈ నెల 1న, కందికొండ కార్తీక్, బండి శ్రావణ్, గట్టు సాయిలును 4న అరెస్టు చేశారు.
కీలకవ్యక్తి తప్పించుకున్నట్లు ప్రచారం ?
ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు వేముల రాజు, కుమారస్వామితోపాటు వారితోపాటు ఉన్న నలుగురిని జైలుకు తరలించారు. అయితే వీరు మాత్రమేగాక కృష్ణవేణి మరణం వెనుక ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. అరెస్టయిన ఆరుగురిలో కీలకవ్యక్తి తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు వేముల రాజుకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా రాజును దెబ్బతీయాలని ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి కృష్ణవేణి అంశాన్ని అనుకూలంగా మార్చుకుని కుట్ర చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజు కృష్ణవేణి కలిసి ఉన్న విషయాన్ని మద్యం మత్తులో ఉన్న పంప్ ఆపరేటర్ భాషబోయిన కుమారస్వామి సదరు వ్యక్తికి ఫోన్ చేసి చెప్పడంతో ఆ వ్యక్తి అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. కుమారస్వామి, తన స్నేహితుడు మహేందర్‌తోపాటు ఫోన్‌కాల్‌తో వచ్చిన వ్యక్తి కలిసి కృష్ణవేణిని మానసికంగా వేధించి శారీరకంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించారని భావిస్తున్నారు.
తాము వ్యవహరించిన తీరు బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం పాశవికంగా హత్య చేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాము ఏం చేసినా ఆమె ప్రియుడు రాజుపైనే పోతుందని దురాలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. ముందు కృష్ణవేణి కేసులో సాక్షులుగా ఉన్న పంప్ ఆపరేటర్ కుమారస్వామి, మహేందర్ కేసును పక్కదారి పట్టించబోయి చివరికి నిందితులుగా మారి అరెస్టయ్యారు. జరిగింది హత్యానా లేక ఆత్మహత్యానా అనే అంశం ఇప్పుడు పోస్టుమార్టం నివేదికపై ఆధారపడి ఉండడంతో దాని కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.
కృష్ణవేణి మృతిపై వీడని మిస్టరీ
Published Thu, Feb 11 2016 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM
Advertisement
Advertisement