- బకాయిలపై స్పందించని అధికారులు
- నిబంధనలకు తిలోదకాలు
- భూనిర్వాసిత గ్రామాలపై శీతకన్ను
- కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ మరిచారు
- పత్తాలేని పర్యావరణ పరిరక్షణ
గణపురం: తెలంగాణ రాష్ట్రంలో సూపర్ పవర్ విద్యుత్ కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న కేటీపీపీ.. పన్నుల చెల్లింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బకాయిపడిన పన్నులను చెల్లించాలని కేటీపీపీకి చెల్పూరు గ్రామపంచాయతీ నోటీసులు పంపింది. చెల్పూరు శివారులో సుమారు వెయ్యి ఎకరాల్లో ఉన్న 500 మెగావాట్ల ప్లాంటుతో పాటు.
నిర్మాణంలో ఉన్న 600 మెగావాట్ల ప్లాంటు, ఇటీవల మంజూరైన 800 మెగావాట్ల ప్లాంట్‌లకు సంబంధించిన లేఅవుట్, పంచాయతీ అనుమతుల పన్నులు లక్షల్లో బకాయిలు ఉన్నాయి. వాటిని చెల్లించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ నోటీసులను జారీ చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా కేటీపీపీ అధికారులు ప్రవర్తించడంతో పాటు పంచాయతీ అందజేసిన నోటీసులకు కూడా సక్రమంగా స్పందించడం లేదని గ్రామ పంచాయతీ అధికారులు గుర్రుగా ఉన్నారు. ఇంతకు ముందు పాత పంచాయతీ పాలకవర్గాన్ని కూడా కేటీపీపీ అధికారులు ముప్పుతిప్పలు పెట్టారు.
ప్లాంట్‌లో నాలుగు వందల మంది ఇంజినీర్లు నివాసాలు ఉంటే భవనాలకు, నిర్మాణంలో ఉన్న భవనాలకు సంబంధించిన అనుమతులు గ్రామపంచాయతీ నుంచి తీసుకోలేదు. స్పెషల్ ఆఫీసర్ల పాలన సమయంలో కూడా డీఎల్‌పీఆర్‌ఓ, డీపీఓలు కూడా కేటీపీపీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. కేటీపీపీ నోటీసులను పట్టించుకోకపోతే కోర్టుకు పోవడానికి సిద్ధమని పంచాయతీ అధికారులు అంటున్నారు.
భూనిర్వాసిత గ్రామాలను పట్టించుకోని కేటీపీపీ
కేటీపీపీకి భూములు ఇచ్చిన బాధితులను, ఆ గ్రామాలను అధికారులు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ప్లాంట్‌కు అవసమైన మొత్తం భూమిలో 90 శాతం చెల్పూరు శివారులో ఉంది. 2005 డిసెంబర్ 16న చెల్పూరు ఉన్నత పాఠశాలలో జరిగిన పర్యావరణ పరిరక్షణ ప్రజావేదిక సదస్సులో అప్పటి జెన్‌కో సీఎండీ అజయ్‌జైన్ ప్రజలకు ఇచ్చిన హమీలను కేటీపీపీ అధికారులు బుట్టదాఖలు చేశారు.
బాధిత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టడానికి రూ.100కోట్లను ఖర్చు చేస్తామని ప్రకటించారు. కానీ మాటను నిలుపుకోవాలనే ప్రయత్నం అధికారులు చేయలేదు.ప్రాజెక్టు మూలంగా చెల్పూరు, దుబ్బపల్లి, కొంపల్లి ప్రజలు కాలుష్యం కాటుకు బలవుతునే ఉన్నారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ మాటేమిటి?
ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ అమ్మకం ద్వారా వచ్చిన లాభాలలో కొంత శాతాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ పేరిట ఖర్చు చేయవలసి ఉంది. గత సంవత్సరం రూ.2 కోట్ల రూపాయలను చెల్పూరు పరిధి గ్రామాలకు జెన్‌కో అధికారులు కేటాయించారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా తయారు చేశారు.
అప్పటి ప్రభుత్వ చీఫ్‌విప్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పలుమార్లు జెన్‌కో అధికారులతో మాట్లాడి నిధులను మంజూరు చేయించారు. ఆ నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. తెలంగాణ రాష్టానికి గుండెకాయ కాబోతున్న చెల్పూరుకు కనీసం గ్రామపంచాయతీ భవనం కూడా లేకపోవడం శోచనీయం.
నిధులు మంజూరు చేయాలని గత ఐదు సంవత్సరాల నుంచి కేటీపీపీ అధికారులని పంచాయతీ పాలకవర్గం వేడుకుంటూనే ఉంది. చెల్పూరు గ్రామానికి గోదావరి నదీజాలాలు అందిస్తామని, వైద్య, విద్య, రోడ్లు, పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పిస్తామని ఇచ్చిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి.
బకాయిలు చెల్లించాలి
కేటీపీపీ ప్రాజెక్ట్ నుంచి గ్రామపంచాయతీకి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. చెల్పూరుతోపాటు శివారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కార్పస్ సోషల్ రెస్పాన్స్ ఫండ్‌ను ఖర్చు చేయాలి. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్ల పెంపకం చేపట్టాలి. ప్లాంట్‌లో నిర్మించే భవనాలకు పంచాయతీ నుంచి అనుమతులు తీసుకోవాలి.
- కొత్త పద్మవెంకటేశ్వర్లు, చెల్పూరు సర్పంచ్
ఇంటి పన్ను చెల్లిస్తున్నాం
చెల్పూరు గ్రామ పంచాయతీకి కేటీపీపీలోని ఇంజినీర్ల కాల నీకి చెందిన ఇంటి పన్నును దాదాపు రూ.మూడు లక్షలను చెల్లిస్తున్నాం. కార్పస్ సోషల్ రెస్పాన్స్ ఫండ్‌పై జెన్‌కో ఉన్నతస్థాయి అధికారులు నిర్ణయం తీసుకుంటారు. నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే. ప్లాంటులో నిర్మించే భవనాలను పన్నులు చెల్లించాలంటే అవసరమైన అధారాలు కావాలి.
- వెంకటేశ్వర్‌రావు, కేటీపీపీ సీఈ