వైరస్‌పై సమీక్షలో మంత్రులు కేటీఆర్, ఈటల
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు కె.తారక రామారావు, ఈటల రాజేందర్ ఆదేశించారు. బేగంపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఈటలతో కలసి కేటీఆర్ మంగళవారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని కంటైన్మెంట్ ప్రాంతాల ఏర్పాటు, నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగించారని, కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు లాక్‌డౌన్‌ను పాటించడం ఒక్కటే మార్గమని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కంటై న్మెంట్ జోన్లలో 100% లాక్‌డౌన్ అమలు కావా లని, వీటికి సంబంధించిన అన్ని మార్గాలను మూసివేయాలని, పోలీసుల పహారాలో ఒకే మార్గం తెరిచి ఉంచాలన్నారు. కంటైన్మెంట్ జోన్ల నుంచి ఏ ఒక్కరూ బయటికి రావొద్దని, వారికి కావలసిన నిత్యావసర వస్తువులు ఇంటికే పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు.
సభలు, సమావేశాలు, సామూహిక పంపిణీ కార్య క్రమాలను ఈ ప్రాంతాల్లో చేపట్టరాదన్నారు. ఎవరైనా ఈ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అనుకుంటే పోలీస్ లేదా మున్సిపల్ అధికారులను సంప్రదించాలని కోరారు. కంటైన్మెంట్ జోన్ల పరిధిలో నివాస ముండే ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిగతులను రోజూ అడిగి తెలుసుకుని, వ్యాధి అనుమానితులను ఆస్పత్రులకు తరలించి వైద్య పరీక్షలు చేయించాలన్నారు. కోవిడ్–19 వ్యాధి సోకినట్టు నివేదిక వస్తే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించడంతో పాటు ట్రావెల్ హిస్టరీ, కాంటాక్ట్ వివరాలను వెంటనే సేకరించి ఆ మేరకు వారితో కాంటాక్ట్‌లో వచ్చిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీస్, జీహెచ్‌ఎంసీ, వైద్య అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
10 రోజులు కీలకం...
రాబోయే 10 రోజులు చాలా ముఖ్యమని, ఎవరూ అనవసరంగా రోడ్లపైకి రావొద్దని మంత్రి ఈటల ప్రజలకు సూచించారు. హైదరాబాద్ లోని కంటైన్మెంట్ జోన్లలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశిం చారు. అవసరమైన అంబులెన్స్‌లను అందు బాటులో ఉంచుకోవాలని, ఏమాత్రం అను మానం వచ్చినా, వెంటనే వ్యాధి అనుమాని తులను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించాలన్నారు. 24 గంటల్లో వైద్య నివేదికలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, ఆరోగ్య శాఖ కార్యదర్శి శాంతికుమారి, నగర, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, వైద్యశాఖ సంచాలకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment