
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాన్ని లైఫ్ సైన్సెస్ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామా రావు పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్ రంగాభివృద్ధి కోసం విజన్ 2030 పేరుతో త్వరలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నామని తెలిపారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ అడ్వైజరీ కమిటీతో మంగళవారం ఆయన ఇక్కడ సమావేశమయ్యారు. రాష్ట్రానికి లైఫ్ సైన్సెస్ రంగంలో ఉన్న అవకాశాలను కమిటీ సభ్యులు కేటీఆర్‌కు వివరించారు.
అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడున్న మౌలిక వసతులు లైఫ్ సైన్సెస్ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటు అందించనున్నాయని తెలిపారు. ఈ రంగ అభివృద్ధికి అమలు చేయాల్సిన విజన్‌పై మంత్రితో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా రంగాన్ని ఒక ప్రాధాన్య రం గంగా ఎంచుకుని, పరిశ్రమ అభివృద్ధికి అనేక ప్రణాళికలు రూపొందిస్తోందని కేటీఆర్ తెలిపారు. ఈ రంగంలో హైదరాబాద్ ఫార్మాసిటీ ఓ మైలు రాయిగా నిలుస్తుందన్నారు.
ఇటీవలి బయోఏసియా సదస్సులో రాష్ట్ర లైఫ్ సైన్సెస్ రంగ అభివృద్ధిపై జరిపిన చర్చలు, వచ్చిన సలహాల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. రానున్న ఏళ్లలో రాష్ట్ర లైఫ్ సైన్సెస్ రంగం తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు అంతర్జాతీయ కంపెనీలను ఇక్కడికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రంగంలో వస్తున్న డిజిటల్ మెడిసిన్, ఫార్మా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం రంగ ప్రవేశం చేస్తే కొత్తగా పుట్టుకొచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
పరిశోధనల కోసం ఇంక్యుబేటర్
హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టమ్‌ను అభివృద్ధి పరుస్తామని కేటీఆర్ తెలిపారు. ఇందుకు అవసరమైన పరిశోధన, శిక్షణకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తుందన్నారు. లైఫ్ సెన్సెస్ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు టీ–హబ్ వంటి ఇంక్యుబేటర్‌ను జీనోమ్ వ్యాలీ లో ఏర్పాటు చేస్తామన్నారు. ఐదు వ్యాధులను ఎంపిక చేసి, వాటి కట్టడికి అవసరమైన పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తామన్నారు.
ఫార్మా కంపెనీలు, విద్యా సంస్థలు, సీసీఎంబీ వంటి పరిశోధన సంస్థలను సమన్వయ పరిచేందుకు రిచ్ సంస్థ ప్రయత్నిస్తుందన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధనలు చేసే స్టార్టప్‌లు, హై రిస్క్ రీసెర్చ్‌కు ప్రోత్సా హం అందించేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. లైఫ్ సైన్సెస్ రంగం పరిశ్రమల భాగస్వామ్యంతో పాఠశాల స్థాయి నుంచే కెరీర్ కౌన్సెలింగ్ కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు.
నూతన పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించడంతోపాటు ఇక్కడి పరిశ్రమల విస్తరణపై దృష్టి సారిస్తామన్నారు. ఈ మేరకు త్వరలోనే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేసి పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. ఫార్మా రంగంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం ఒక ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బాడీని ఏర్పాటు చేస్తుందన్నారు.