60 ఏళ్ల దరిద్రాన్ని వదిలిస్తున్నాం
60 ఏళ్ల దరిద్రాన్ని వదిలిస్తున్నాం
Published Fri, Jun 16 2017 6:33 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
►తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్: గత పాలకులు విడిచి వెళ్లిన 60 ఏళ్లనాటి దరిద్రాన్ని వదిలిస్తున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నేరేడ్‌మెట్ (సైనిక్‌పురి)లోని జలమండలి కార్యాలయంలో రూ.338 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకాలను రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డితో కలిసి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 45 ఏళ్లు ఒక పార్టీ, 17 ఏళ్లు మరో పార్టీ రాష్ట్రాన్ని ఏలినా ఒరగబెట్టింది శూన్యమని కాంగ్రెస్, టీడీపీల పాలనను దుయ్యబట్టారు.
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రతిపక్షాలు విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 2001లో ప్రత్యేక రాష్ట్రాలుగా అవతరించిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌లు ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నాయి..కానీ మూడేళ్ల క్రితం పుట్టిన తెలంగాణ ఎన్నో అడ్డంకులను అధిగమించి దేశంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా గుర్తింపు పొందిన్నారు. దీనిపై ఎవరూ మాట్లాడరని ప్రతిపక్షాలకు చురకలంటించారు. ఈజీ ఆఫ్ బిజినెస్(వేగంగా ఆదాయం పెరుగుదల), ఉపాధి హామీ, మిషన్ ఇంద్ర ధనుష్ తదితర రంగాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్ర నంబర్-1గా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన నివేదికలు, సర్టిఫికెట్‌లే రుజువులని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలకు సోయి లేదంటూ ఇది సోయి ఉన్న ప్రభుత్వమన్నారు. రాష్ట్ర ఆవిర్భావంనాటికి కరెంటు, నీరు వంటి వారసత్వ కష్టాలు కనిపించినా భయపడకుండా ఒక్కొక్కటీ దాటుకుంటూ మూడేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. సురక్షిత నీరు ప్రతి మనిషి ప్రాథమిక హక్కుగా గుర్తించిన ఏకైక సీఎం కేసీఆర్ అని కేటీఆర్ అభివర్ణించారు. మిషన్ భగీరథతో ఇంటింటీకి తాగునీరు అందించడానికి ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు.
Advertisement