సమైక్యాంధ్ర కోసం దేనికైనా సిద్ధం ‘ప్రజలంటే ప్రేమ, దయలేని కాంగ్రెస్, టీడీపీ నేతలకు ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేదు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు రాష్ట్రం విడిపోతుంటే వారు పదవులు పట్టుకుని వేలాడుతున్నారు. అందుకే ప్రజల్లోకి వస్తే కొడతారని వారికి భయం. ఢిల్లీని వదిలి వస్తే వారికి మన తడాఖా చూపిస్తాం. మనకు అండగా జగనన్న, విజయమ్మ, షర్మిల ఉన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం దేనికైనా సిద్ధంగా ఉండాలి. హైదరాబాద్ ఎవరి సొత్తూ కాదు. రాష్ట్ర విభజన జరిగితే ఎగువ ప్రాంతాలకు ఉప్పునీరే గతి. ఉద్యమిస్తున్న కోట్లాది ప్రజలు, ఉద్యోగులకు అండగా వైఎస్సార్ సీపీ ఉంటుంది. ’
- తెల్లం బాలరాజు, వైసీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే
చంద్రబాబు లేఖ వల్లే విభజన
‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్రాన్ని విభజించమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వడం వల్లే విభజన నిర్ణయం వెలువడింది. ఇప్పుడు అదే చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నాడు. ప్రతి కుటుంబం నుంచి ఓ వ్యక్తి హైదరాబాద్‌లో ఉన్నాడు. సీమాంధ్రులు భాగ్యనగరాన్ని గడచిన 50 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశారు. నేడు కాంగ్రెస్ అధిష్టానం ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోంది. మనమంతా ఐక్యంగా ఉండి సమైక్యరాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలి.’
- కొయ్యే మోషేన్‌రాజు, వైసీపీసీఈసీ సభ్యుడు
నిజమైన పోరాటం వైఎస్ కుటుంబానిదే
‘జగనన్న ఎప్పుడొస్తాడా? అని జనం ఎదురుచూస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలతో పులి లాంటి ఆయన్ను అన్యాయంగా బంధించారు. ఆ పులిని విడిచిపెట్టి చూ డండి. కాంగ్రెస్, టీడీపీలు పారిపోతాయ్. తెలుగువారిని విడగొట్టాలని చూస్తున్నారని తెలిసి ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు చేయని విధంగా వైఎస్ జగన్ తన పదవికి రాజీనామా చేశా రు. 60 ఏళ్ల వయసులో కూడా విజయమ్మ దీక్ష చేశారు. మూడు వేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల సమైక్యాంధ్ర కోసం బస్సు యాత్ర చేస్తున్నారు. ప్రజల పక్షాన, సమైక్యాంధ్ర కోసం పోరాడుతోంది ఒక్క వైఎస్ కుటుంబం మాత్రమే.’
- అశోక్ గౌడ్ ,దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త
రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు
‘మహానేత వైఎస్ చనిపోయిన నాటి నుంచి అధికార, ప్రతిపక్ష నేతలు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేశారు. నాలుగేళ్లలో ఉద్యోగాలు లేవు, అభివృద్ధి నిలిచిపోయింది. ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. పథకాలు అటకెక్కాయి. పరిశ్రమలు పక్కరాష్ట్రాలకు తరలిపోతున్నాయి. 50 ఏళ్లు కష్టపడి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నాం. మరో 50 ఏళ్లు ప్రయత్నించినా అలాంటి రాజధానిని తయారు చేసుకోలేం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరం పోరాడుదాం. మన హక్కుల్ని కాపాడుకుందాం.’
- కొఠారు రామచంద్రరావు, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త
తాగునీటికీ కష్టాలు తప్పవు
‘వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అన్యాయంగా జైలు పాలు చేశారు. ఆయన బయట ఉండి ఉంటే రాష్ట్రం ముక్కలయ్యేది కాదు. కాంగ్రెస్ అంత సాహసానికి దిగేది కాదు. రాష్ట్ర విభజన జరిగితే విద్యార్థులకు భవిష్యత్ ఉండదు. సీమాంధ్రులకు ఉద్యోగాలు రావు. సాగు నీటితో పాటు తాగునీటికీ కష్టాలు పడే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడకముందే వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. సమైక్యరాష్ట్రం కోసం తుదికంటా పోరాడుతాం. ఉద్యమంలో ప్రజలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది.’
- పీవీ రావు, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త
రాజన్న ఉండగా విభజన మాట లేదే?
‘వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం ఎవరూ రాష్ట్ర విభజన మాట ఎత్తే ధైర్యం చేయలేకపోయారు. ఆయన మరణం తర్వాత ప్రజలు సుఖసంతోషాలను మర్చిపోయారు. ఏకపక్షంగా విభజన నిర్ణయాన్ని ప్రకటించిన కేంద్రం 44 రోజులుగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంపై స్పందించకపోవడం దురదృష్టకరం. రెండు, మూడు నెలల్లో ఊడిపోయే పదవుల్ని పట్టుకుని వేలాడుతున్న మంత్రులు, ఎంపీలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. పదవులను వదిలి ఉద్యమంలోకి వస్తే ప్రజలు మళ్లీ పట్టం గడతారు.’
- గూడూరి ఉమాబాల, వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు
ఉద్యోగుల పెన్నిధి వైఎస్
‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉద్యోగుల పెన్నిది. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య శంఖారావం పూరించి షర్మిలను పంపించడాన్ని స్వాగతిస్తున్నాం. సమైక్యవాదానికి కట్టుబడిన రాజకీయ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉంటుందని, లేదంటే భవిష్యత్ ఉండదని ఉద్యోగులు ప్రకటిస్తే ముందుగా సమైక్య శంఖారావం పూరించింది వైసీపీ ఒక్కటే. మేమిచ్చిన మాట ప్రకా రం సమైక్యాంధ్రకు కట్టుబడిన ఆ పార్టీకి ఉద్యోగులందరూ మద్దతిస్తాం. ఢిల్లీ స్థాయి లో ఒత్తిడి తెచ్చి సమైక్యాంధ్ర సాధించేలా పాటు పడాలని షర్మిలను కోరుతున్నాం.’
- ఎల్.విద్యాసాగర్, ఏపీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు
వైసీపీకే మా మద్దతు
‘విభజనపై సీడబ్లూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జెండాలు, అజెండాలు పక్కన బెట్టి సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఆర్టీసీ ఉద్యోగులు గత నెల 12 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. వైసీపీ సమన్యాయం నినాదాన్ని సమైక్య నినాదంగా మార్చడంలో మా ఉద్యమం దోహదపడింది. ఆ పార్టీకి మా మద్దతు ఉంటుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ, షర్మిల కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వాలని కోరుతున్నాం.’
- ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాదరావు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక రాష్ర్ట కో-చైర్మన్
విభజిస్తే ఎడారే
Published Fri, Sep 13 2013 2:27 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement