'లాక్‌డౌన్ పెడితే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి' | KTR Ingurates Telemedicine Centre In Prathima Medical College In Karimnagar | Sakshi
Sakshi News home page

'లాక్‌డౌన్ పెడితే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి'

Published Wed, Jul 8 2020 6:02 PM | Last Updated on Wed, Jul 8 2020 8:41 PM

KTR Ingurates Telemedicine Centre In Prathima Medical College In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్యా లాక్‌డౌన్‌ పెడితే ఆర్థిక పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతిమ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆరోగ్య రథం,టెలీ మెడిసిన్‌ను మంత్రి కేటీఆర్  బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'ఎవరూ నాకు కరోనా రాదు... అనే అపోహతో ఉండొద్దు... ఇందుకు ఉదాహరణే డిప్యూటీ స్పీకర్ పద్మారావు. నేను ఓ కార్యక్రమానికి ఆయనతో కలిసి హాజరయినప్పుడు మాస్కు పెట్టుకోమంటే నాకు కరోనా రాదు అన్నారు.. కానీ మరుసటి రోజే కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని రాజకీయ విమర్శలు చేయడం దుర్మార్గపు చర్య. ఆ విమర్శలు వారి పైశాచిక ఆనందం కోసం మాత్రమే. ఇలా విమర్శలు చేయడం వల్ల మన కరోనా వారియర్స్ ను నిరుత్సాహ పరిచినట్లే. మేము కూడా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చు. కానీ ఇది సరైన సందర్భం కాదని విమర్శలు చేయడం లేదు. కరోనా నుంచి కోలుకొని రికవరీ అయిన వారి గురించి ఎవరు మాట్లాడరు. రాష్ట్రంలో కరోనా టెస్టులు సరిగా చేయడం లేదు... ఫలితాలు దాస్తున్నారు అనడం సరికాదు.(తెలంగాణలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు)

ప్రతిపక్షాలు అర్ధరహిత విమర్శలు మానుకోవాలని నా విజ్ఞప్తి. రాజకీయాలు చేయాలని అనుకుంటే ఇది అసలు సందర్భం కాదు. ఇలాంటి సమయంలో విమర్శలు చేయడం వల్ల ప్రజలు అయోమయంకు గురయ్యే అవకాశం ఉంది. దయచేసి కరోనా పై పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులను నిరుత్సాహపరిచే విధంగా విమర్శలు చేయడం మానుకోవాలి. కోవిడ్-19 కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు లాక్డౌన్ పెడితే ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఫలితంగా కరోనా మరణాల కంటే లాక్ డౌన్ వల్ల సంభవించే మరణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకొని నియంత్రణ చేసుకోవాలి. 

దేశంలో తెలంగాణ రాష్ట్రం ఫార్మా రంగంలో ముందంజలో ఉంది. కరోనా వ్యాక్సిన్ తొందరలోనే రావాలని కోరుకుంటున్నా.ప్రతిమ ఫౌండేషన్ సేవలను నా చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం రావడం సంతోషం. 200 ఆరోగ్య ప్రతిమ కేంద్రాలు ఏర్పాటు చేసి మారుమూల గ్రామాలకు వైద్యం అందించడం గొప్ప విషయం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిమ ఫౌండేషన్ కోటి మాస్కులు పంపిణీ చేయడం గర్వించదగ్గ విషయం' అని కేటీఆర్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement