పట్టణాభివృద్ధికి రూ.55 వేల కోట్లు | KTR Issued Fund For Urban Development In Telangana | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 26 2018 1:26 AM | Last Updated on Thu, Jul 26 2018 1:26 AM

KTR Issued Fund For Urban Development In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పురపాలికల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.55 వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని, ఆ మేరకు మూడేళ్ల ప్రణాళికలతో పనులు చేపడతామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పురపాలక శాఖ 2017–18లో సాధించిన పురోగతిపై నివేదికతో పాటు ఈ ఏడాది చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికలను బుధవారం మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెచ్‌ఎండీఏ పరిధిలో 13 శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్‌ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ వాటర్‌ రింగ్‌ మెయిన్‌ (నీటి పైపులైను) నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రహదారుల నిర్వహణను మూడేళ్ల పాటు కాంట్రాక్టర్లే చూసేలా త్వరలో కొత్త విధానం తీసుకొస్తున్నామని చెప్పారు. మెట్రో రైలు, మిషన్‌ భగీరథ, ఎస్సార్డీపీ, కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థల కోసం పనులన్నీ ఏకకాలంలో జరుగుతుండటంతో రోడ్ల విషయంలో కాస్త ఇబ్బంది ఉందని, ఈ పనులు పూర్తయితే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. రహదారులను తవ్విన సంస్థలే 
వాటిని పునరుద్ధరించాల్సి ఉన్నా, అనుకున్న రీతిలో జరగట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2023 నాటికి పట్టణ జనాభా 50 శాతం దాటుతుందని పేర్కొన్నారు. ఉపాధి, విద్య, మెరుగైన జీవన ప్రమాణాల కోసం జరిగే వలసలతో పట్టణీకరణ పెరుగుతోందని, ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించడం సవాలుగా మారిందన్నారు. 

ఒక్క రోజులో సాధ్యం కాదు.. 
‘విశ్వనగరం ఒక్క రోజులో కాదు.. రోమ్‌ నగరాన్ని కూడా ఒక్క రోజులో నిర్మించలేదు’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. దశల వారీగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇతర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే పురపాలక శాఖ కృతజ్ఞత లభించని (థ్యాంక్‌లెస్‌) పనులు చేస్తోందని, విపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. సరిగ్గా పనులు చేస్తే ప్రశంసలు రావని, ఏవైనా ఇబ్బందులు కలిగితే మాత్రం వెంటనే విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 74 పురపాలికలుండగా, వచ్చే నెల నుంచి మరో కొత్త 68 మున్సిపాలిటీలు మనుగడలోకి వస్తాయని చెప్పారు. దీంతో రాష్ట్రంలో పురపాలికల సంఖ్య 142కు పెరుగుతుందన్నారు. 

పురపాలక శాఖ నివేదికలోని ముఖ్యాంశాలు 
ఈ ఏడాది చివర్లోగా మెట్రో రెండో విడత ప్రాజెక్టు డీపీఆర్‌. 
మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు త్వరలో తుది రూపం. 
44 పురపాలికల్లో రూ.460 కోట్లతో టీయూఎఫ్‌ఐడీసీ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయల కల్పన. 
టీయూఎఫ్‌ఐడీసీ ఆధ్వర్యంలో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు మరో రూ.1,460 కోట్ల పనులకు అనుమతులు. 
పలు పట్టణాల్లో 52 ఆధునిక శ్మశాన వాటికల నిర్మాణం. 
రూ.150 కోట్లతో 3 వేల ఖాళీ స్థలాల్లో పార్కుల నిర్మాణం. 
పట్టణాల్లో 203 మాంసాహార, శాఖాహార మార్కెట్‌ల నిర్మాణం. 
2013–14లో జీహెచ్‌ఎంసీ ఆదాయం రూ.747 కోట్లు కాగా ప్రస్తుతం రూ.1450 కోట్లకు చేరింది. 
మున్సిపల్‌ బాండ్ల విషయంలో జీహెచ్‌ఎంసీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 
హైదరాబాద్‌లో ఏప్రిల్‌లోగా లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి. 
కొల్లూరు వద్ద 15,600 ఇళ్లతో అతిపెద్ద టౌన్‌షిప్‌ నిర్మాణం జరుగుతోంది. ఒక్కో ఇంటికి రూ.9 లక్షల వ్యయం. 
హైదరాబాద్‌లో 500 బస్తీ దవాఖాల ఏర్పాటు. ప్రతి 5 వేల జనాభాకు ఒక దవాఖానా.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement