సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారితో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో మంత్రులు ఆయనతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్ సంస్థాగత వ్యవహారాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అయితే పార్టీ కమిటీల నియామకంలో భాగంగా కూడా సమావేశం జరిగి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి జిల్లాకు టీఆర్‌ఎస్ అధ్యక్షుని ఎంపిక జటిలంగా మారింది.
తన తనయుడు ప్రశాంత్‌కు అవకాశమివ్వాలని స్పీకర్ కోరుతుండగా.. ప్రశాంత్ నియామకాన్ని ఒక వర్గం వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ వర్గాలు సమాచారం. మంత్రి చందూలాల్ తనయుడికి ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కడంతో తన తన యునికి పార్టీ పదవి కట్టబెట్టేందుకు టీఆర్‌ఎస్ హైకమాండ్‌పై స్పీకర్ ఒత్తిడి పెంచారంటున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌కు నచ్చజెప్పేందుకు కేసీఆర్ సూచన మేరకు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ఎంపీ వినోద్‌లు స్పీకర్‌తో భేటీ అయినట్లు భావిస్తున్నారు.