కాక్‌టియన్‌తో చర్చిస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానంతో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అనేక సంస్థలు పెట్టుబడులతో రాష్ట్రానికి తరలివచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఐదేళ్లలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్‌టియన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం కేటీఆర్‌తో భేటీ అయింది. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని కేటీఆర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, సింగపూర్ నడుమ మరింత బలమైన వ్యాపార, వాణిజ్య సంబంధాలు నెలకొల్పేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు.
హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక విదేశీ కంపెనీలు ముందుకొస్తున్నాయని సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్‌టియన్‌కు కేటీఆర్ వివరించారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని, స్థానికంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించేం దుకు సింగపూర్ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కోరారు. ఐటీ, పరిశ్రమల మంత్రితో జరిగిన భేటీ ద్వారా తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలపై మరింత స్పష్టత వచ్చిందని సింగపూర్ కాన్సుల్ జనరల్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనువైన వాతావరణంపై తమ దేశంలోని పారిశ్రామికవర్గాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తామని హామీనిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment