సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి (ట్రెసా–జేఏసీ) జరిపిన చర్చలు సఫలమైనట్లు ఆ సంఘం తెలిపింది. ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సోమేశ్ కుమార్, అడిషనల్ డీజీపీ జితేందర్ రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో పలు దఫాలుగా జరిపిన చర్చల్లో సానుకూల స్పందన లభించిందని పేర్కొంది. ఈ మేరకు అధ్యక్ష, కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం(ఎగ్జిక్యూటీవ్ బ్రాంచ్) అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమోహన్, మధు తదితరులు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దారుణహత్యకు గురైన తహసీల్దార్ విజయారెడ్డి, డ్రైవర్ గురునాథం కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. బుధవారం నుంచి ఉద్యోగులందరూ విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment