క్యా సీన్ హై... | Kya Scene Hai ...Talasani srinivas yadav political mark | Sakshi
Sakshi News home page

క్యా సీన్ హై...

Published Mon, Apr 7 2014 9:01 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

క్యా సీన్ హై... - Sakshi

క్యా సీన్ హై...

          *తలసాని హైడ్రామా..
         *చెప్పిందొకటి.. చేసిందొకటి
         *అయోమయానికి గురైన క్యాడర్

ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నేతలు ఊసరవెల్లులే అవాక్కయ్యే రీతితో సన్ని‘వేషాలు’ సృష్టిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా క్షణాల్లో రూటు మార్చేసి.. మాట తప్పేసి క్యాడర్‌నే అయోమయంలో పడేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ శని, ఆదివారాల్లో నడిపిన రాజకీయమే ఇందుకు నిదర్శనం.    
 
 సీన్ తారుమారైందిలా..

 నిజానికి శనివారం నాటి ఎజెండాతో సమావేశం జరిగి ఉంటే సీన్ మరోలా ఉండేది. నాటి ఆవేశకావేశాలు ఏ నాయకుల్లోనూ కనపడలేదు. కొందరు నేతలు రప్పించిన మనుషులు కొద్దిసేపు ఆయా నేతలకు అనుకూలంగా నినదించారు. మధ్యలో కిరోసిన్ పోసుకోవడాలు, ఫ్లకార్డుల డ్రామాలు రక్తి కట్టించాయి. గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నేతలూ సమావేశానికి వస్తారన్నారు. అయితే, కనీసం హైదరాబాద్ జిల్లా పరిధిలోని వారూ రాలేదు.  

ముఖ్య నేతలూ హాజరు కాలేదు. పొత్తులో భాగంగా పోతుందని తెలిసిన ముషీరాబాద్ నేతలతో పాటు నియోజకవర్గాల ఇన్‌చార్జులైన కె.విజయరామారావు, సాయన్న, ముజఫర్ అలీ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షాబాజ్‌అహ్మద్‌ఖాన్ తదితరులు ముఖం చాటేశారు. ఏ అంశంపైనైతే  అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారో.. దాన్ని చక్కగా పక్కదారి పట్టించారు. సర్దుకుపొమ్మన్నారు.
 
తలసాని మార్కు రాజకీయం!
 
తలసాని శ్రీనివాస్‌యాదవ్.. టీడీపీలో ఆయన స్టైలే వేరు. అనుకున్నది ఏదోలా దక్కించుకోవడం ఆయన నైజం. తొలిసారిగా ఎమ్మెల్యే టిక్కెట్ ద క్కించుకోవడంనుంచి.. నేటి అత్యవసర సమావేశం దాకా అదే తీరు. వాస్తవానికి శనివారం వరకు త లసాని పోటీ చేయాలని భావించిన సనత్‌నగర్ నియోజకవర్గం టీడీపీకి వస్తుందో.. బీజేపీకి వెళ్తుందో తెలియని పరిస్థితి. బీజేపీ ఆ స్థానం కోసం గట్టి పట్టుదలతో ఉంది. ఆ సీటు చేజారిపోతుందనే సందేహంతో.. అప్పటికప్పుడు భేటీ కావాలని అధ్యక్షుని హోదాలో జిల్లా పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించారు. పొత్తుకు ఒప్పుకుంటే జిల్లాలో పార్టీకి మనుగడే ఉండదనే ప్రకటనలు ఇప్పించారు.

అందుకు తగ్గట్టే టెంట్లు, పులిహోర వంటి వాటితో హడావుడి చేశారు. తీరా శనివారం రాత్రి పొద్దుపోయాక  ‘సనత్‌నగర్’పై హామీ లభించింది. ఇంకేముంది.. ఆందోళన కోసం ఏర్పాటు చేసిన సమావేశాన్ని అనువుగా మార్చేసుకున్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల పేరుతో ముగించేశారు. శ్రేణుల్లో ఎమోషన్స్ పెరిగితే పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించి త్వరితంగా ముగించేశారు. ఈ లోగుట్టంతా తెలియని కొందరు నేతలు, శ్రేణులు ఇప్పటికీ ఎందుకిలా జరిగిందో అర్థం కాక అయోమయంలోనే ఉన్నారు.
 
శనివారం సాయంత్రం..
 
పార్టీ నేతలు, శ్రేణుల అభిప్రాయానికి వ్యతిరేకంగా గ్రేటర్‌లో ఎక్కువ స్థానాలు బీజేపీకివ్వాలనే అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్ టీడీపీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తలసాని తమ వెంటే ఉన్నారని, జిల్లా కార్యవర్గమంతా రాజీనామా చేస్తుందని ప్రకటించారు. ‘బీజేపీ హటావో.. టీడీపీ బచావో’ అనే నినాదాన్ని సృష్టించి హోరెత్తించారు.
 
ఆదివారం ఉదయం..
 
జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో భారీ టెంట్లు.. పార్టీతో సంబంధం లేనివారూ పోగయ్యారు. పులిహోర పొట్లాలు పంచారు. ఒకరిద్దరు నేతలు మాట్లాడుతూ- ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులకు ఒప్పుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. 2009 లోనూ పొత్తు వల్లే చంద్రబాబు సీఎం కాలేకపోయారన్నారు. మన నాయకుడు తలసాని నాయకత్వం లో మన దారిలో మనం వెళ్దామంటూ ప్రసంగించా రు. అంతలో తలసాని కల్పించుకున్నారు. ‘మీ ఆవేదన నాకు తెలుసు.

కానీ, మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగానే ముందుకు సాగాలి. ‘దేశం’ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అందుకిప్పుడు మనకొక అండ అవసరం. అందుకే బీజేపీతో పొత్తు.. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీకు అండగా నేనుంటా. క్రమశిక్షణగా ఉండండి’ అంటూ ముగించారు. శనివారం నాటి హాట్ హాట్ పరిణామాలకు కొనసాగింపుగా ఆదివారం నాటి సమావేశం ఆందోళనలలో అట్టుడికిపోతుందనుకుంటే, గాలి తీసేసిన సైకిల్ చక్రంలా సీన్ మారిపోవడంతో క్యాడర్ అయోమయానికి గురైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement