సాక్షి,మెదక్ : ఒకప్పుడు పల్లెకో, పట్టణానికో నాయకుడు వస్తే జనం స్వచ్ఛందంగా కదలివచ్చేవారు. ర్యాలీల్లో నేతలతో కలిసి పాదం పాదం కలిపేందుకు, సభల్లో వారి ప్రసంగాలు వినేందుకు పోటీపడేవారు. కానీ ప్రస్తుత రాజకీయాలు మారిపోయాయి. ముఖ్య కార్యకర్తలు తప్ప పని వదిలి ప్రచారానికి తరలి వచ్చేవారు.. నేతల మాటలు వినడానికి కదిలే వారు కరువయ్యారు. దీంతో అభ్యర్థులు, ఆశావాహులు సభల కోసం, ప్రచారాల కోసం కూలీలను ఆశ్రయిస్తున్నారు.
ఇవాళ ఇక్కడ..రేపు అక్కడ..
కూలీలు సైతం ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు వారికే ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ఒక పార్టీకి జై కొడితే రేపు మరో పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. పలుచోట్ల చేరికల సందర్భంగానూ ఇలాంటి వింతలే జరుగుతున్నాయి. ఆయా గ్రామాల్లో తమ పార్టీలోకి ఎక్కువ చేరికలు జరిగాయని చెప్పుకునేందుకు కూలీలకు సైతం కండువాలు కప్పుతున్న నేతలకు లేక్కేలేదు. ఈ వ్యవహారాన్ని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎన్నికల పుణ్యమాని కూలి దొరుకుతుంది..
‘రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. ఒక్కొమారు కూలీ పనులు దొరక్క పస్తులుండాల్సిన పరిస్తితి. కానీ ఎన్నికల పుణ్యాన మాకు గత 15 రోజులుగా రోజూ కూలి దొరుకుతోంది. ప్రచారానికి పోతే సాయంత్రానికి పైసలు పక్కాగా వస్తున్నాయయి. కడుపు నిండా అన్నం పెట్టి పంపుతున్నారు.’ అంటూ కొందరు ఎన్నికల కూలీలు సాక్షి ఎదుట సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment