హరీశ్‌రావును టార్గెట్‌ చేస్తున్న ప్రతిపక్షాలు  | Congress And BJP Focus On Harish Rao In Dubbaka Election Campaign | Sakshi
Sakshi News home page

దుబ్బాక: ఎన్నికల ప్రచారం రసవత్తరం

Oct 11 2020 12:58 PM | Updated on Oct 11 2020 1:04 PM

Congress And BJP Focus On Harish Rao In Dubbaka Election Campaign - Sakshi

సాక్షి, సిద్దిపేట:  దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి హరీశ్‌రావు అభ్యర్థి గెలుపుకోసం అన్నితానై ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు సుజాతను నేరుగా ఢీ కొనడం కంటే హరీశ్‌రావును ఢీ కొంటే ఉపయోగం ఉంటుందని హరీశ్‌రావును టార్గెట్‌ చేస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు.    దుబ్బాక ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థి సోలిపేట సుజాతను విమర్ఙంచడం కన్నా ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు హరీశ్‌రావును టార్గెట్‌ చేసి విమర్శిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే నియోజకవర్గానికి ప్రచార నిమిత్తం వచ్చిన టీపీసీసీ చీప్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క హరీశ్‌రావును విమర్శించడం, టీఆర్‌ఎస్‌ పార్టీలో ప్రాధాన్యత గురించి మాట్లాడడం, ఇతర విమర్శలు చేస్తున్నారు.  

హరీశ్‌ లక్ష్యంగా ప్రచారం.. 
రాష్ట్రంలో 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉన్న నియోజకవర్గాల్లో హరీశ్‌రావు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే కొడంగల్‌లో రేవంత్‌రెడ్డితోపాటు హేమాహేమీలైన కాంగ్రెస్‌ పార్టీలు ఓటమి పాలయ్యారని ప్రచారం జరిగింది. అదే విధంగా హుజుర్‌నగర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ లోని కీలక నాయకులు ప్రచారం చేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ఓడించారు. ఆ సంఘటనను దృష్టిలో పెట్టుకుని దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని ఓడించాలంటే హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకుని మాట్లాడాలని ఆలోచనతో కాంగ్రెస్‌ పార్టీ ఉందని కనిపిస్తోంది. అదే విధంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా హరీశ్‌రావును టార్గెట్‌ చేసి వాఖ్యలు చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని గతంలో హరీశ్‌రావు ఏమి చేశాడని రఘునందన్‌రావు విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఒకే ఒక్కడిగా హరీశ్‌రావు.. 
విపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్‌ దుబ్బాక ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర కీలక నాయకులంతా దుబ్బాక నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. బీజేపీ నుంచి కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి జిల్లాలో ప్రచారం చేస్తుండగా కేంద్ర, రాష్ట్ర నాయకులు రఘునందన్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు దుబ్బాక దారి పడుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మంత్రి హరీశ్‌రావు మాత్రం తనదైన శైలిలో వ్యూహ రచన చేస్తున్నారు. స్థానిక ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లా నాయకులను కలుపుకొని ప్రచారం పరుగులు పెట్టిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ ఆశించిన మనోహర్‌రావు, వెంకటనర్సింహారెడ్డి, చిందం రాజుకుమార్‌లను టీఆర్‌ఎస్‌లో చేర్పించుకుని కాంగ్రెస్‌ క్యాడర్‌ను దెబ్బతీస్తున్నారు. మరోవైపు యువజన సంఘాలతో సమావేశాలు, సమీక్షలు, బైక్‌ ర్యాలీలు నిర్వహించి టీఆర్‌ఎస్‌ వైపు ఆకర్షింపచేస్తున్నారు. అదే విధంగా తాగునీటి ఇబ్బందులు పడ్డ దుబ్బాక ప్రాంతానికి మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు ఇవ్వడం, బీడీ కార్మికుల పెన్షన్‌లు, చేనేత కార్మికులకు చేయూత, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్‌లు, కల్యాణలక్ష్మీ ఇచ్చిన పథకాల గురించి పూసగుచ్చినట్లు ప్రజలకు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజల ఇబ్బందులు, బీజేపీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను చెబుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చురకలు అంటిస్తున్నారు. ఇలా టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని, మరో వైపు కాంగ్రెస్, బీజేపీ లను చిత్తుగా ఓడించాలని ప్రచారం చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement