త్వరలో  రైలు కూత | TRS Campaigning At Medak | Sakshi
Sakshi News home page

త్వరలో  రైలు కూత

Published Thu, Nov 22 2018 10:37 AM | Last Updated on Thu, Nov 22 2018 10:37 AM

TRS Campaigning At Medak - Sakshi

మెదక్‌ మున్సిపాలిటీ:  వలస వాద పార్టీలతో పొత్తు పెట్టుకున్న లైన్‌లైని కూటమి ప్రజలకేం చేస్తుందని, ప్రజలకోసం పనిచేస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. బుధవారం మెదక్‌ పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పద్మాదేవేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ సహకారంతో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారన్నారు.

ఇందిరాగాంధీ మొదలుకొని ఎందరో హామీలిచ్చినా మెదక్‌ జిల్లా కేంద్రంగా ఏర్పడలేదన్నారు.  సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో జిల్లా ఏర్పాటు కలను నెరవేర్చుకున్నామన్నారు.  జిల్లా కేంద్రం ఏర్పాటుతో ఆగిపోలేదని, పద్మాదేవేందర్‌రెడ్డి నాయత్వంలో జిల్లాకు రైల్వేలైన్‌ కూడా పూర్తి కానుందన్నారు. రెండు, మూడు నెలల్లో మెదక్‌కు రైలు కూత వినిపించబోతుందన్నారు. అలాగే మెదక్‌కు ఇటీవలే రింగురోడ్డు మంజూరైందని, చేగుంట నుంచి మెదక్‌కు వచ్చే పూర్తిగా గుంతలమయంగా ఉండేదని, ప్రస్తుతం ఆ రోడ్డుపై వస్తుంటే ఏయిర్‌పోర్టులో రన్‌వే మీద వెళ్తున్నట్లుందన్నారు.  కాంగ్రెస్‌ హయాంలో ఒక చెక్‌డ్యాం కూడా నిర్మించలేదని, 21వేల ఎకరాలకు నీరందించాల్సిన ఘనపురం ఆనకట్ట కాంగ్రెస్‌ హయాంలో 10వేలకు పడిపోయిందన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద కోట్లతో ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు, కాల్వల మరమ్మతులు చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్, టీడీపీల హయాంలో ఘనపురం ఆనకట్ట నీళ్లు కావాలంటే పాపన్నపేట రైతులు పత్రాలు పట్టుకొని  హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. కాని టీఆర్‌ఎస్‌ హయాంలో పద్మాదేవేందర్‌రెడ్డి ఒక ఫోన్‌చేస్తే సీఎం కేసీఆర్‌ స్పందించి రెండు పంటలకు నీటి విడుదల చేయించారన్నారు.

రూ.2కోట్లతో మెదక్‌లో రైతు బజార్, స్థానిక పిట్లం చెరువులో రూ.9కోట్లతో మినీ ట్యాంకుబండ్‌ నిర్మించడం జరుగుతుందన్నారు. పాపన్నపేట రైతులు మాకు మార్కెట్‌ యార్డు కావాలి...జోగిపేట, మెదక్‌కు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని పద్మాదేవేందర్‌రెడ్డి కోరగానే రూ.3కోట్లతో మార్కెట్‌ యార్డు గోదాములు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆరవై యేళ్ల పాలనలో ఏడుపాయల దుర్గమ్మకు కేవలం పట్టు వస్త్రాలను మొక్కుబడిగా సమర్పించారే తప్ప రాష్ట్రప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక  ఏడుపాయల అభివృద్ధికి ప్రతియేడు కోటి రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 50శాతం పనులు పూర్తయ్యాయన్నారు. పద్మాదేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు రామాయంపేటను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతోపాటు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.

 మెదక్‌కు మహిళా డిగ్రీ కళాశాల సా«ధించిన పద్మాదేవేందర్‌రెడ్డిదేనన్నారు.  చరిత్రలో ఎన్నడులేని విధంగా మెజార్టీతో పద్మాదేవేందర్‌రెడ్డి గెలుస్తుందన్నారు. మహా కూటమి మాయ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డినే గెలిపించాలని ప్రజలను కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement