చర్చలేకుండానే ఆమోదం
భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఓకే
- రైతు సమస్యలపై చర్చకు కాంగ్రెస్ డిమాండ్
- సభ్యుల ఆందోళనతో అట్టుడికిన సభ
- వెల్‌లోకి ప్రవేశించేందుకు యత్నం.. అడ్డుకున్న మార్షల్స్
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలు–మార్షల్స్ మధ్య తోపులాట.. ఉద్రిక్తత
- చర్చ లేకుండానే బిల్లు ఆమోదానికి మహమూద్ అలీ ప్రతిపాదన
- ఆ వెంటనే బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించిన స్పీకర్
- సభ నిరవధిక వాయిదా.. మండలిలో 5 నిమిషాల్లోనే ఆమోదం
- ప్లకార్డులు ప్రదర్శించిన కాంగ్రెస్ సభ్యులు
- బిల్లును ఆమోదించాలని చైర్మన్‌ను కోరిన మంత్రి హరీశ్
- ఆమోదం పొందినట్లు చైర్మన్ ప్రకటన.. సభ నిరవధిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: చర్చ లేకుండానే భూసేకరణ చట్ట సవరణకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనల మధ్య పట్టుమని పది నిమిషాల్లోనే బిల్లును పాస్ చేసింది. అటు శాసనమండలిలోనూ చర్చ లేకుండానే బిల్లును ఆమోదించారు. శాసనసభ గతంలో ఆమోదించిన భూసేకరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు సూచించటంతో ప్రభుత్వం ఆదివారం ప్రత్యేకంగా అసెంబ్లీ, మండలి సమావేశం నిర్వహించింది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవగానే ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. రైతు సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం మొదలైంది.
నల్ల కండువాలు ధరించి హాజరైన కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టారు. సీఎల్పీ నేత జానారెడ్డి మినహా కాంగ్రెస్ సభ్యులందరూ తమ స్థానాల నుంచి లేచి నిలబడి నినాదాలు చేయటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు భూసేకరణ చట్ట సవరణల బిల్లుపై మాత్రమే మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని స్పీకర్ మధుసూదనాచారి కాంగ్రెస్ సభ్యులకు పలుమార్లు స్పష్టం చేశారు. తనకు మాట్లాడే అవకాశమివ్వాలని జానారెడ్డి కోరగా... కాంగ్రెస్ సభ్యులంతా ఎవరి స్థానాల్లో వారు వెళ్లి కూర్చుంటే అవకాశం కల్పిస్తామని స్పీకర్ బదులిచ్చారు. అయినా కాంగ్రెస్ సభ్యులు పట్టు వీడకుండా ఆందోళన కొనసాగించారు.
దీంతో సవరణ బిల్లుపై మాట్లాడేందుకు కాంగ్రెస్‌కు బదులుగా ఎంఐఎం పార్టీకి స్పీకర్ మొదటి అవకాశమిచ్చారు. వెంటనే కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పొడియం వైపు దూసుకు వెళ్లగా మార్షల్స్ అడ్డుకున్నారు. కాంగ్రెస్ సభ్యులు, మార్షల్స్ మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. బిల్లుపై ఎంఐఎం సభ్యుడు అహ్మద్ పాషా ఖాద్రీ చర్చను ప్రారంభించడంతో కాంగ్రెస్ సభ్యులు తమ ఆందోళనను తీవ్రం చేశారు. ‘రైతులు చనిపోతుంటే ఎక్కడి బిల్... రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి..’ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు చించి స్పీకర్ పోడియం వైపు విసిరేశారు. ఒకదశలో స్పీకర్ పొడియం ముందు కాంగ్రెస్ సభ్యులు, మార్షల్స్ మధ్య తోపులాట కొనసాగింది. కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ ఆగ్రహంతో మార్షల్స్‌ను తోసేందుకు ప్రయత్నించగా, మార్షల్స్ ఆయన్ను వెనక్కి నెట్టేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం మార్షల్స్‌ను తోసివేసేందుకు ప్రయత్నించారు.
మహిళా కాంగ్రెస్ సభ్యులు డీకే అరుణతోపాటు పద్మావతిరెడ్డి పోడియం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా మహిళా మార్షల్స్ అడ్డుకున్నారు. ఇదే సమయంలో.. చర్చ లేకుండానే భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రతిపాదించారు. బిల్లులో ప్రతిపాదించిన మూడు సవరణలకు విడివిడిగా స్పీకర్ మూజువాణి ఓటింగ్ నిర్వహించారు. అధికార పార్టీ, ఎంఐఎం మద్దతు తెలపడంతో భూసేకరణ చట్ట సవరణల బిల్లును సభ ఆమోదించిందని స్పీకర్ ప్రకటించారు. ఆ వెంటనే టీఆర్‌ఎస్ సభ్యులు బల్లలు చరిచి సంబరాలు చేసుకున్నారు. ఆ మరుక్షణమే స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.