నేటి నుంచే భూరికార్డుల ‘ప్రక్షాళన’
సర్వం సిద్ధం చేసిన రెవెన్యూ యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం నేటి నుంచే ప్రారంభం కానుంది. ఇందుకుగానూ రెవెన్యూ శాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల నుంచి వీఆర్‌ఏల వరకు పాల్గొనే ఈ ప్రక్షాళన కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు అంటే 100 రోజులపాటు జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 1,343 బృందాలు పనిచేయనున్నాయి. ప్రతి మండలంలో ఉన్న మొత్తం గ్రామాల్లో 3 గ్రామాలను తొలుత ఎంచుకుని అక్కడే 10 రోజులపాటు ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించనున్నారు.
తొలిరోజు, చివరిరోజు గ్రామసభలు నిర్వహించి కార్యక్రమ ఉద్దేశాలను, కార్యక్రమ ఫలితాన్ని అధికారులు వివరించనున్నారు. తొలిరోజు గ్రామసభ అయిన తర్వాత రెవెన్యూ సిబ్బంది రైతులకు ఆన్‌లైన్–1బీ ప్రతులను ఇచ్చి వారి సంతకాలు తీసుకోవడంతో పాటు మార్పుచేర్పులు చేయాల్సిన పత్రాన్ని కూడా ఇంటికి తీసుకెళ్లి ఇస్తారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన రికార్డులతో రైతు ఏకీభవిస్తే ఎలాంటి సమస్యా ఉండదు. విభేదిస్తే మాత్రం రెవెన్యూ సిబ్బంది ఇచ్చిన మార్పుచేర్పుల పత్రంలో ఆ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడు రెవెన్యూ సిబ్బంది దానిని పరిశీలించి అవసరమైతే మార్పుచేర్పులు చేసి ఆ మార్పుచేర్పులు చేసిన పత్రాన్ని కూడా రైతులకు ఇవ్వనున్నారు.
ఇదే పత్రాన్ని గ్రామసభలో కూడా ప్రదర్శించనున్నారు. అయితే, భూరికార్డుల ప్రక్షాళన ఏ గ్రామంలోనైనా 10 రోజులపాటే ఉంటుంది కాబట్టి ఆ 10 రోజుల్లోనే రికార్డులను సవరించుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి చేయించుకునే దానికన్నా రెవెన్యూ సిబ్బందే ఇంటి వద్దకు వచ్చినప్పుడు చేయించుకోవడం మేలని, రైతులంతా తమ రికార్డులను సవరించుకునే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. మరో, ముఖ్య విషయమేమిటంటే.. భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా ఎలాంటి సర్వేలు చేయబోరు. కేవలం రికార్డులను మాత్రమే సరిచేయనున్నారు.
ప్రక్షాళనలో రెవెన్యూ సిబ్బంది రైతులకు ఇచ్చేవి
1) ఆన్‌లైన్–1బీ ప్రతి, 2) రశీదు, 3) మార్పుచేర్పుల ప్రతిపాదన పత్రం
రెవెన్యూ సిబ్బంది వచ్చినప్పుడు రైతు వద్ద ఉండాల్సినవి
1) పట్టాదారు పాసుపుస్తకం లేదంటే భూమికి సంబంధించిన రికార్డు ఏదైనా