రిజిస్ట్రేషన్లన్నీ వీడియో రికార్డింగ్‌ | Land Registrations to be Video Recorded | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్లన్నీ వీడియో రికార్డింగ్‌

Published Fri, Sep 15 2017 1:32 AM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM

రిజిస్ట్రేషన్లన్నీ వీడియో రికార్డింగ్‌ - Sakshi

రిజిస్ట్రేషన్లన్నీ వీడియో రికార్డింగ్‌

- నవంబర్‌ 1 నుంచి కొత్త విధానం
- బలవంతపు రిజిస్ట్రేషన్లు, పోలీసు కేసులు, బోగస్‌ వ్యక్తులకు చెక్‌
- సీసీ కెమెరాలతో క్రయ, విక్రయ లావాదేవీలన్నీ రికార్డు
- ప్రక్రియ పూర్తయ్యాక కొనుగోలుదారులకు సీడీ రూపంలో అందజేత
- భవిష్యత్తులో ఏదైనా సమస్య తలెత్తితే సాక్ష్యంగా వినియోగం


సాక్షి, హైదరాబాద్‌: మల్లిక్‌ అనే వ్యక్తి తారక్‌ నుంచి రెండు ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. వారి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు మొత్తం డబ్బు చెల్లించాడు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మల్లిక్‌ పేరిట భూమి రిజిస్ట్రేషన్‌ కూడా అయింది. కానీ నాలుగు నెలల తర్వాత పోలీస్‌స్టేషన్‌ నుంచి మల్లిక్‌కు పిలుపు వచ్చింది. మల్లిక్‌ తనను బెదిరించి తన రెండెకరాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడని, తన భూమి తనకు ఇప్పించాలని తారక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది తెలుసుకున్న మల్లిక్‌.. ఇంటికి వెళ్లి ఒప్పందం పత్రాలు తెచ్చాడు. కానీ పోలీసులు వాటిని నమ్మలేదు. ‘అలాంటి కాగితాలు ఎన్నయినా సృష్టించొచ్చు కదా.. బెదిరించి ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నావ్‌’ అని ప్రశ్నించడంతో మల్లిక్‌ తెల్లబోయాడు.

భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవహారాల్లో ఎదురవుతున్న ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డబుల్‌ రిజిస్ట్రేషన్లు, బోగస్‌ వ్యక్తులు, బలవంతపు రిజిస్ట్రేషన్ల పేరిట తలెత్తుతున్న సమస్యలకు దీనితో పరిష్కారం లభిస్తుందని భావిస్తోంది. దీనిని వచ్చే నవంబర్‌ ఒకటో తేదీ నుంచే అమలు చేయాలని.. కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌ భరోసా కల్పించేందుకు ఆ వీడియోలను సీడీ రూపంలో అందజేయాలని నిర్ణయించింది.

అంతా పక్కాగా..
రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఇప్పటివరకు విక్రేతలు, కొనుగోలుదారులు, సాక్షులు కేవలం సంతకాలు పెట్టడం, వేలిముద్రలు వేయడానికే పరిమితమవుతున్నారు. కానీ కొత్త విధానం అమల్లోకి వచ్చాక విక్రయించేవారు తాను ఫలానా భూమి లేదా ఆస్తిని కొనుగోలుదారుడికి ఇష్టపూర్వకంగానే అమ్ముతున్నానని.. అందుకు సంబంధించిన సొమ్ము కూడా తనకు అందిందని చెప్పాల్సి ఉంటుంది. ఇలా చెప్పే సమయంలో కొనుగోలుదారులు, సాక్షులు, రిజిస్ట్రేషన్‌ శాఖ సిబ్బంది అక్కడే ఉంటారు. ఈ మొత్తం దృశ్యాన్ని సీసీ కెమెరాలో రికార్డు చేస్తారు.

అందులోనే తేదీ, సమయం కూడా నమోదవుతాయి. మొత్తం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక ఆ వీడియో దృశ్యాలను సీడీలోకి నింపి కొనుగోలుదారులకు అందజేస్తారు. ఇందుకోసం ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒకటి కార్యాలయంలో, మరోటి రికార్డుల కోసం వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా.. ఇప్పటికే 30 కార్యాలయాలకు సీసీ కెమెరాలు అందాయి. మిగతా వాటికి అక్టోబర్‌ 15 లోగా పంపుతామని, నవంబర్‌ 1 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తేస్తామని ఆ శాఖ అధికారులు వెల్లడించారు.

పారదర్శకంగా ఉండేలా చర్యలు
సీసీ కెమెరాల ద్వారా క్రయ, విక్రయాలు జరిపేవారితోపాటు రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది వ్యవహారశైలి కూడా రికార్డవుతుందని.. తద్వారా సిబ్బంది పనితీరు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో విక్రేతలు స్వచ్ఛందంగానే అమ్ముతున్నారా లేక బలవంతంగా వ్యవహరిస్తున్నాడా అన్న అంశాలను వారి వ్యవహార శైలిని బట్టి తెలుసుకోవచ్చని పేర్కొంటున్నారు. కొనుగోలుదారులకు భరోసాతోపాటు సాక్ష్యంగా ఉపయోగించుకునే ఆలోచనతో కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్టు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వి.శ్రీనివాసులు తెలిపారు. ఇందుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను పూర్తిచేస్తున్నామని, నవంబర్‌ 1 నుంచి అమలు చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement