ఎయిర్‌పోర్టు ఆశలకు రెక్కలు..!  | Land Survey in Mahabubnagar District for Mini Airport | Sakshi
Sakshi News home page

గుడిబండ వద్ద  విమానాశ్రయం ఏర్పాటయ్యే  అవకాశం?

Published Sun, Jul 21 2019 8:39 AM | Last Updated on Sun, Jul 21 2019 8:40 AM

Land Survey in Mahabubnagar District for Mini Airport - Sakshi

రెండేళ్ల కిందట గుడిబండ వద్ద స్థలాన్ని పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు(ఫైల్‌)

అడ్డాకుల: జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎయిర్‌పోర్టు ఆశలకు మరోసారి రెక్కలు తొడుగుతున్నారు. రెండేళ్లక్రితం గుడిబండ వద్ద మినీ విమానాశ్రయం ఏర్పాటుకు ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ శాఖల అధికారులు స్థలాన్ని పరిశీలించారు. అయితే విమానయాన శాఖ అధికారులు కూడా వస్తారని ప్రచారం జరిగినా వారు రాలేదు. దీంతో విమానాశ్రయం ఆశలపై అప్పట్లో నీళ్లు చల్లినట్లయింది. తాజాగా మరోసారి విమానాశ్రయం ఏర్పాటుకుస్థలాన్ని పరిశీలించేందుకు అధికారులు రానున్నట్లు రోడ్లు, భవనాల శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో మళ్లీ ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఆశలకు రెక్కలు తొడిగినట్లవుతోంది.

 సీఎం కేసీఆర్‌ ప్రకటనతో.. 
రెండేళ్ల కిందట జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ అడ్డాకుల మండలంలో మినీ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు. ఆ వెంటనే రెవెన్యూ, రోడ్లు, భవనాల శాఖ అధికారులు అడ్డాకుల మండలం గుడిబండ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. గుడిబండ గ్రామం పక్కనే ఉన్న సర్వే నంబర్‌ 118లో ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు పలుమార్లు పరిశీలిచారు. ఆర్‌అండ్‌బీ అధికారులు కూడా పరిశీలించి వెళ్లారు. ఆ తర్వాత మూసాపేట మండలంలోని తుంకినీపూర్, దాసర్‌పల్లి, వేముల, భూత్పూర్‌ మండలంలోని రావులపల్లి గ్రామాల వద్ద ఉన్న ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు పరిశీలన చేశారు. మూడు మండలాల్లో తిరిగిన రెవెన్యూ అధికారులు భూముల వివరాలు, మ్యాపులను ఉన్నతాధికారులకు పంపించారు. ఇక అంతటితోనే విమానాశ్రయం ఏర్పాటుకు స్థలాల పరిశీలన చేయడం ముగిసింది. అయితే అప్పట్లోనే రాష్ట్రంలో వేర్వేరు చోట్ల మూడు మినీ విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో పాలమూరుకు విమానాశ్రయం మంజూరు కాలేదు.

 వైమానిక అధికారుల ఆరా  
గుడిబండ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాలపై ఇటీవల వైమానిక శాఖ అధికారులు రోడ్లు, భవనాల శాఖ అధికారులతో ఆరా తీశారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ స్థలం, దాని చుట్టూ ఉన్న ప్రైవేటు భూముల వివరాలను సేకరించడంతో పాటు ఈనెల 6న ఆర్‌అండ్‌బీ అధికారిణి సంధ్య, సర్వేయర్‌ బాల్యానాయక్‌ సర్వే నంబర్‌ 118లోని స్థలాన్ని పరిశీలించారు. వైమానిక శాఖ అధికారులు కూడా ఇక్కడి స్థలాన్ని పరిశీలించడానికి త్వరలో రానుండటంతో మళ్లీ విమానాశ్రయ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. విమానాశ్రయం కోసం దాదాపు 500ఎకరాలు భూమి అవసరమైన నేపథ్యంలో సర్వే నంబర్‌ 118లో 70ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అయితే ఆ భూమిని కొందరు రైతులకు ప్రభుత్వం కేటాయించినా ఇప్పటి అవసరం దృష్ట్యా దాన్ని తిరిగి తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం రైతులకు ఇచ్చిన భూమికి కూడా సర్కారు ధర ప్రకారం రెండింతల పరిహారం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎయిర్‌పోర్టుకు ఈ స్థలం అనుకూలంగా ఉన్నట్లు అధికారులు భావిస్తే చుట్టుపక్కల రైతుల ప్రైవేట్‌ భూములను సేకరించే అవకాశం ఉంటుంది.

 తేదీ ఖరారు కాలేదు..! 
వైమానిక అధికారులు గుడిబండ వద్ద విమానాశ్రయ ఏర్పాటుకు స్థలాలను పరిశీలిస్తామని చెప్పారు. వారు వచ్చేలోపే మేము ఈనెల 6న గుడిబండకు వచ్చి స్థలాన్ని పరిశీలించాం. ఇదివరకే అధికారులు రావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు వస్తారన్న తేదీ ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే స్థలం పరిశీలించే అవకాశం ఉంది.  – సంధ్య, డిప్యూటీ ఈఈ ఆర్‌అండ్‌బీ, మహబూబ్‌నగర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement