సొంతంగా ఎదుగుదాం..
బీజేపీ కార్యవర్గం ముగింపు సమావేశంలో డాక్టర్ లక్ష్మణ్
సాక్షి, సంగారెడ్డి: ‘సొంతంగా ఎదుగుదాం.. సొంతంగా ముందుకు వెళదాం’(గో ఎలోన్ – గ్రోఎ లోన్) నినాదంతో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల చివరి రోజైన గురువారం లక్ష్మణ్ అధ్యక్షోపన్యాసం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రైతులకు ఒరగబెట్టిందేమీలేదన్నారు.
బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఉస్మానియా వర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడకుండా మౌనం వహించడంపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సమావేశంలో కేంద్రమంత్రి బం డారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కృష్ణదాస్, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, నాయకులు నాగం జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.