సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ కోసమే నిరాహార దీక్ష చేశానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం నిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితి అధికార మత్తులో ఉంది. నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది. అన్యాయాలపై నిలదీసిన నేతలను అరెస్టు చేస్తోంది. శాంతియుత పద్ధతిలో నిరాహార దీక్ష చేస్తున్న వారిని నిర్బంధించడం ఏ మేరకు సమంజసమో ప్రభుత్వం చెప్పాలి’ అని నిలదీశారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జాతీయస్థాయిలో ఉద్యమించనున్నట్లు ప్రకటించారు.
విద్యార్థులకు జరిగిన అన్యాయంపై త్వరలో ఆందోళనలు నిర్వహిస్తామని, బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలుస్తామని తెలిపారు. ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. అదే ఉద్యమాలను అణచివేస్తుందని ఆరోపించారు. పిల్లల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోకుండా, వారి చర్యలను వెనుకేసుకొస్తుండటం సిగ్గుచేటని లక్ష్మణ్ విమర్శించారు. ఆయన వెంట మల్కాజ్‌గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రాంచందర్‌రావు తదితర నేతలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment