19న హైకోర్టుకు సెలవు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19వ తేదీన సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టుకు ఆ రోజున సెలవు ప్రకటించారు. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. సర్వే సందర్భంగా తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించారని, అందరూ ఇందులో పాల్గొనాలని ప్రభుత్వం సూచించినందున హైకోర్టుకు సెలవు ఇవ్వాలని న్యాయవాదుల సంఘం ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది. దీన్ని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి 19న హైకోర్టుకు సెలవు ప్రకటించారు.
ఓయూ, జేఎన్‌టీయూ పరీక్షలు వాయిదా
హైదరాబాద్: సర్వే నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 18, 19, 20 తేదీలలో జరిగే వివిధ కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. తిరిగి ఈ పరీక్షలను నిర్వహించే తేదీలను త్వరలో వెల్లడిస్తామన్నారు. అదే విధంగా ఈనెల 18, 19వ తేదీల్లో జేఎన్టీయూహెచ్ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం డెరైక్టర్ ఈశ్వరప్రసాద్ గురువారం తెలిపారు. 20వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలన్నీ షెడ్యూలు ప్రకారం జరుగుతాయని, వాయిదా పడిన పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.