సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఒకప్పుడు ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల ఖిల్లా..అనే స్థాయి నుంచి నేడు ఆయా పార్టీలు రాజకీయంగా తమ ఉనికిని చాటుకోవాల్సిన కష్టకాలంలో కొనసాగుతున్నాయి. ఉద్యమాల గుమ్మంగా పేరొందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అనుసరించే వ్యూహంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఖమ్మంజిల్లా కమ్యూనిస్టు పార్టీలకు పెట్టని కోటగా ఒకప్పుడు ఉన్నా.. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో సంభవించిన పరిణామాల నేపథ్యంలో జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు ఏటికి ఎదురీదాల్సిన గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో ఉభయ కమ్యూనిస్టుల సహకారం లేకుండా ఏ రాజకీయ పార్టీ గెలిచే పరిస్థితి లేదన్న నానుడి ఉండేది.
గత కొద్ది సంవత్సరాలుగా జరిగిన ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలు విడివిడిగా పోటీ చేయడం, గత ఎన్నికల సమయంలో రెండు పార్టీ్టలు వేర్వేరు రాజకీయ పక్షాలకు మద్దతుగా నిలవడంతో ఈసారి అనుసరించనున్న వ్యూహం ఏమిటన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సీపీఐ, సీపీఎంలు గతంలో బలంగా ఉండడమే గాక.. రెండు, మూడు నియోజకవర్గాల్లో తమ పట్టును నిరూపించుకోవడంతో పాటు రాజకీయంగా మైత్రి కొనసాగించిన టీడీపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు వెన్నుదన్నుగా నిలిచాయి. ఆయా నియోజకవర్గాల్లో గెలుపొందేందుకు కీలకంగా వ్యవహరించాయన్న గుర్తింపు, పేరు ఉండేది.
ప్రాబల్యం ఇలా పడిపోయే..
2009, 2014లో జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికల నుంచి కమ్యూనిస్టుల ప్రాబల్యం క్రమేణా తగ్గుతూ వచ్చింది. 2009 శాసనసభ ఎన్నికల్లో ఖమ్మంజిల్లాలోని పది నియోజకవర్గాల్లో టీడీపీ, టీఆర్‌ఎస్‌లతో కలిసి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల మైత్రి కొనసాగించాయి. జిల్లాలో సీపీఎం ఒక్క స్థానం కూడా గెలుపొందకపోగా, సీపీఐ కొత్తగూడెం, వైరా నియోజకవర్గాల్లో, ఇల్లెందు, ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాలతోపాటు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉభయ కమ్యూనిస్టుల మద్దతుతో టీడీపీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ భద్రాచలం, మధిర, పాలేరు, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో విజయం సాధించింది.
2009లో టీఆర్‌ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేసినా, ఆ తర్వాత టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు దూరంగా ఉంటూ, 2014 ఎన్నికల నాటికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఖమ్మం జిల్లాలో విడివిడిగా పోటీ చేశాయి.సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో 2014 ఎన్నికల్లో జత కట్టగా, సీపీఐ కాంగ్రెస్‌పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకుం ది. దీంతో ఈ ఎన్నికల్లో సీపీఐ కొత్తగూడెం, పినపాక, వైరా నియోజకవర్గాల్లో పోటీ చేయగా, కాంగ్రెస్ మధిర, పాలేరు, ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేటలో పోటీ చేసింది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సీపీఎం ఎన్నికల పొత్తు పెట్టుకుని మధిర, పాలేరు, భద్రాచలం నియోజకవర్గాల్లో పోటీ చేయగా, మిగిలిన నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరచింది.
పినపాక, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలతోపాటు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీపీఎం మద్దతుతో గెలుచుకుంది. సీపీఎం మాత్రం గత శాసనసభ ఎన్నికల్లో కేవలం భద్రాచలం శాసనసభ నియోజకవర్గంలో మాత్రమే విజయం సా ధించింది. సీపీఐ..కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన వైరా, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఓటమి పొందడంతో గత శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఆపార్టీకి ప్రాతిని«ధ్యం లేకుండా పోయింది. 2009 ఎన్నికల్లో జిల్లాలో సీపీఎంకు స్థానం లేకపోగా..2014 ఎన్నికల్లో సీపీఐ జిల్లాలో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది.
మారని రాజకీయ పంథా..
2014 ఎన్నికల అనంతరం జిల్లాలో సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సమస్యల ప్రా తిపదికన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఐక్య పోరా టాలు చేస్తున్నప్పటికీ రాజకీయ పం«థా మాత్రం ఎవరికి వారు అనుసరిస్తున్నారు. సీపీఎం రాష్ట్రవ్యాప్తంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో ప్రజాసంఘాలు, కొన్ని పార్టీలతో కలిసి ఫ్రంట్‌గా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తం అవుతోంది. సీపీఎం వచ్చే ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వదని, స్వతంత్రంగానే ఫ్రంట్ పేరుతో పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా..ఎన్నికల నాటికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఇప్పుడే చెప్పలేమంటూ మరికొందరు సీపీఎం నాయకులు అభిప్రాయపడుతున్నారు. సీపీఐ జిల్లాలో 2009 లో గెలిచిన రెండు స్థానాలతోపాటు 2014లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేసిన పినపాక నియోజకవర్గంలో తమ ప్రాబల్యాన్ని చాటేందుకు వ్యూహప్రతివ్యూహాలను రూపొందిస్తోంది. సీపీ ఎం 2014లో గెలుచుకున్న భద్రాచలంతోపాటు గతంలో గెలుపొందిన మధిర, పాలేరు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి విజయం కోసం వ్యూహాలను రచిస్తోంది.
పొత్తులపై ఏం జరిగేనో..?
సీపీఐ..కాంగ్రెస్ పార్టీతో మళ్లీ ఎన్నికల పొత్తు ఉంటుందా..? ఒంటరిగానే పోటీ చేస్తుందా..? అన్న అంశం కాంగ్రెస్, సీపీఐ వర్గాల్లో ఉత్కంఠతను రేపుతోంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత వైరా నియోజకవర్గంలో ఒకసారి సీపీఐ, మరోసారి వైఎస్సార్‌సీపీ విజయం సాధించాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు గత ఎన్నికల్లో చెరొక రాజకీయ పార్టీకి మద్దతునివ్వడం, ఈసారి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల పొత్తు పెట్టుకుంటాయా..? తమతో కలిసి వచ్చే రాజకీయ పక్షాలకు వేర్వేరుగా మద్దతునిస్తాయా..? అన్న అంశం చర్చనీయాంశంగా మారి ంది.
జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పార్టీలు బలం గా ఉండగా..ఆయా పార్టీలకు దీటుగా కమ్యూనిస్టు పార్టీలు సైతం ప్రజా సమస్యల పరిష్కారం పేరుతో నిరంతరం వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కమ్యూనిస్టులు ఐక్యంగా ఉన్నప్పుడు జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకోగా, ఇప్పుడు విడివిడిగా పోటీ చేస్తే ఆయా పార్టీలకు పునర్వైభవం లభించడం ఎంతమేరకు సాధ్యమవుతుందన్న అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు సమయం ఉన్నందున ప్రజా ఉద్యమాలు నిర్వహించడం తప్ప ఎన్నికల పొత్తుపై ఇప్పటినుంచే ఊహాగానాలు చేయడం సమంజసం కాదని అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment