పాల్వంచరూరల్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై పౌరులు ఎన్నికల్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. సీ విజిల్ యాప్, ఈసీ వెబ్‌సైట్, ఈ మెయిల్ ద్వారా అతిక్రమణలను ఎన్నికల సంఘం దృష్టికి తెస్తున్నారు. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా యాప్‌తో పాటు ఈసీ వెబ్‌సైట్, సీఈఓ మెయిల్స్ ద్వారా.. అధికారులకు 129 ఫిర్యాదులు అందాయి. వాటిలో 110 పరిష్కారం చేశారు. 15 తప్పుడు ఫిర్యాదులుగా గుర్తించారు. 3 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక ఫిర్యాదుపై ఇల్లెందులో కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేశారు.
ముందే అవగాహన కల్పించారు
ఎన్నికల నియమావళి ఉల్లంఘ«నపై సీ విజిల్, వెబ్‌సైట్, ఈ మెయిల్ ద్వారా ద్వారా ఫిర్యాదు చేసే విధానంపై ప్రజలకు జిల్లా అధికార యంత్రాంగం ముందే అవగాహన కల్పించింది. ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారుల ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చైతన్యం కల్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టడం, మద్యం, డబ్బులు, దుస్తులు, వస్తువులు పంపిణీ చేయడం, ప్రజల, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం, కుల, మత ద్వేషాలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగాలు చేయడం, అసత్య వార్తాలు ప్రసారం చేయడం, ఓటర్లను బెదిరించడం వంటివి ఎన్నికల ఉల్లం«ఘన కిందకు వస్తాయి. ఈ ఎన్నికల నియమావళిని ఉల్లంఘనకు పాల్పడిన వారిపై ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే
జిల్లాలోని ఐదు నియోజకవర్గాలను పరిశీలిస్తే జిల్లా కేంద్రమైన కొత్తగూడెం సెగ్మెంట్ నుంచే అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. పినపాక నియోజకవర్గం నుంచి 16 ఫిర్యాదులు అందాయి. ఇల్లెందు నుంచి 22 ఫిర్యాదులు రాగా 19 పరిష్కారమయ్యాయి. 3 పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి 65 ఫిర్యాదులు అందగా, అన్నింటిని పరిష్కరించారు. అశ్వారావుపేట నుంచి 20 ఫిర్యాదులు అందగా, అన్నింటిని పరిష్కరించారు. భద్రాచలం నియోజకవర్గంలో 5 ఫిర్యాదులు, పొరుగు జిల్లా నుంచి ఒక ఫిర్యాదు అందాయి.
వంద నిమిషాల్లోనే పరిష్కారం
సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేసిన గంట 40 నిమిషాల్లో సమస్యను పరిష్కారం చేసేందుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉన్నారు. యాప్ ద్వారా ఫిర్యాదులు ఎవరు, ఏ ప్రాంతం నుంచి పంపారో వెంటనే తెలుస్తుంది. దీంతో సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తున్నారు. సీ విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిశీలించి.. వాస్తమైతే కేసు నమోదు చేస్తున్నారు. ఫిర్యాదులదారుల పేర్లను వెల్లడించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా 129 ఫిర్యాదులు
గత నెల 20వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ప్రజలనుంచి 129 ఫిర్యాదులు వచ్చాయి. ఇల్లెందులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వస్తువులను పంపిణీ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు. కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేశారు. 15 ఫిర్యాదులు మాత్రం ఆకతాయిలు చేసినట్లు గుర్తించారు.
కుల సంఘాలతో రహస్య మంతనాలు!
కరకగూడెం: ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమైంది. ఇందుకోసం రాజకీయ పార్టీల నాయకులు ప్రతీ ఓటరును ఆకర్షించుకునేలా ఎత్తుగడలు వేస్తుంటారు. ఎన్నికల సమయంలో కుల సంఘాల నాయకులతో చర్చలు, బేరసారాలు జరుపుతుంటారు. అయితే కుల సంఘాలతో సమావేశం కూడా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు రోజుల క్రితం పేర్కొంది. దీంతో రాజకీయ పార్టీల నాయకుల్లో ఒకింత గుబులు పట్టింది. జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు కుల సంఘాలతో సమావేశాలను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయా కుల సంఘాల అగ్ర నాయకులతో రాత్రిపూట చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ‘మీకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం, మీ క్షేమాన్ని మేము కోరుకుంటున్నాం మీ ఓట్లు మాకే వేయాలని ప్రసన్నం చేసుకుంటు’న్నట్లు గ్రామాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వెంటనే చర్యలు తీసుకుంటున్నాం
సీ విజిల్ ద్వారా పౌరుల ద్వారా వస్తున్న ఫిర్యాదులను పరిశీలించిన వెంటనే వంద నిమిషాల్లో సమస్యను పరిష్కరిస్తున్నాం. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 129 ఫిర్యాదులు అందాయి. ఇందులో ఈసీ వైబ్ సైట్ ద్వారా 84, సీఈఓ ఈమెయిల్స్ ద్వారా 3, సీ విజిల్ ద్వారా 40, రాతపూర్వ కంగా 2 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో మూడింటిని వి చారణ కోసం పెడింగ్‌లో పెట్టాం. మిగతావి అన్ని పరిష్కరించాం. –ఎస్. రాంబాబు, ఎన్నికల నియమావళి జిల్లా అధికారి.
Comments
Please login to add a commentAdd a comment