తల్లాడ చెక్‌పోస్టు వద్ద కారును తనిఖీ చేస్తున్న తహసీల్దార్ వెంకన్న, సిబ్బంది
సాక్షిప్రతినిధి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. లక్షలాది రూపాయలు పట్టుబడుతున్నాయి. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. నిరంతరం నిఘా పెట్టిన నేపథ్యంలో వాహనాల్లో తరలిస్తున్న నగదు అధికారులకు చిక్కుతోంది. నోటిఫికేషన్ రాకున్నా.. ఎన్నికల సమరం ఇంకా వేడెక్కకున్నా.. డబ్బులు దొరకడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తున్న జిల్లా అధికారులు చెక్‌పోస్టుల వద్ద ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ.. అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను క్షుణ్ణం గా పరిశీలిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా ఇప్పటివర కు రూ.1,79,07,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలులోకి తెచ్చింది. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా అ క్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులు తరలించకుండా జిల్లా సరిహద్దులతోపాటు జిల్లావ్యాప్తంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. వీటి వద్ద నిఘాను ముమ్మరం చేశారు. తనిఖీలను కట్టుదిట్టంగా చేపట్టేందుకు అధికారికంగా వీడియోగ్రాఫర్‌ను కూడా నియమించారు. తనిఖీ లు జరిగే చోట వీడియోగ్రాఫర్ దానిని చిత్రీకరిస్తారు.
15 చెక్‌పోస్టుల ఏర్పాటు..
జిల్లావ్యాప్తంగా మొత్తం 15 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల సరిహద్దుల్లో.. జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో వీటిని ఏర్పాటు చేశారు. దీంతోపాటు జిల్లాలోకి ప్రవేశించే వాహనాలను సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు చేయడంతోపాటు తాజాగా సరిహద్దు జిల్లా ల్లోని తహసీల్దార్లతో కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వాహనాల తనిఖీ విషయంలో ఏ మైనా అనుమానాలుంటే సమీపంలోని అధికారులకు, తమకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో 15 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఎన్నికల తనిఖీ కోసం కేటాయించారు. వీరు చెక్‌పోస్టులతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ చేస్తారు. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిలో డిప్యూటీ తహసీల్దార్, ఏఎస్సై, కానిస్టేబుల్ ఉంటారు.
అనుమానాస్పదంగా.. సరైన లెక్కలు లేని నగదు దొరికితే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన అనంతరం ట్రెజరీ కార్యాలయానికి నగదును తరలిస్తారు. తర్వాత ఆ రశీదును రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు. ఇక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరిస్తాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం పంపిణీ చేయకుండా అరికట్టడంలో ఈ బృందాలు కీలకపాత్ర వహించనున్నాయి. ప్రతిరోజు వారికి సంబంధించిన నివేదికను రిటర్నింగ్ అధికారులకు సమర్పిస్తాయి.
రూ.1.79కోట్లు స్వాధీనం
జిల్లాలో అక్రమంగా రవాణా అవుతున్న రూ.1.79కోట్ల నగదును ఇప్పటివరకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలకు మరికొంత సమయం ఉన్నప్పటికీ ఎన్నికల హడావుడి అప్పుడే ప్రారంభమైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే చెక్‌పోస్టులు, నియోజకవర్గాల సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10లక్షలను, మధిర నియోజకవర్గంలో రూ.2.40లక్షలు, వైరా నియోజకవర్గంలో రూ.14లక్షలతోపాటు ఆయా నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో తరలిస్తున్న రూ.52.67లక్షలను పట్టుకున్నారు. అయితే ఇందులో వైరా నియోజకవర్గంలో పట్టుకున్న రూ.కోటికి సరైన ఆధారాలు చూపించడంతో వాటిని తిరిగి అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment