రాష్ట్రంలోని 83 లక్షల ఖాతాల్లో ఇప్పటివరకు జమ అయింది రూ.1,568 కోట్లే
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీ మొత్తంలో నల్లధనం జన్‌ధన్ ఖాతాల్లోకి మళ్లిందన్న వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనప్పటికీ వాస్తవానికి ఈ ఖాతాల్లో జమ అయిన మొత్తం నగదు నామమాత్రమేనని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 14 వరకు జన్«ధన్ ఖాతాల్లో జమ అయిన డిపాజిట్లు రూ. 74,123.13 కోట్లు అని ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అధికారిక వెబ్‌సైట్ వెల్లడించింది.
అలాగే రాష్ట్రంలో 83.78 లక్షల జన్‌ధన్ ఖాతాలుండగా వాటిలో ఇప్పటివరకు జమ అయిన మొత్తం రూ.1,568.03 కోట్లుగానే నమోదైంది. పైగా మొత్తం ఖాతాల్లో నాలుగో వంతుకుపైగా ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా నిల్వలేదు. 23.40 లక్షల ఖాతాలు జీరో బ్యాలెన్స్‌లో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటిని పక్కన పెడితే సగటున ఒక్కో జన్‌ధన్ ఖాతాలో ఉన్నది రూ.2,597.32 మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 8 మర్నాటి నుంచి ఇప్పటివరకు జమ అయిన డిపాజిట్లతో పోలిస్తే ఇది నామమాత్రమేనని స్పష్టమవుతోంది. ఆర్‌బీఐ అధికారులు రాష్ట్ర ఆర్థిక శాఖకు ఇచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణలోని అన్ని బ్యాంకుల్లో శనివారం వరకు జమ అయిన మొత్తం రూ.57,479 కోట్లు. దీంతో పోలిస్తే జన్‌ధన్ ఖాతాల్లో ఉన్న డబ్బు కేవలం 2.72 శాతం మాత్రమే. కాగా, ఏపీలో రూ.1,654.12 కోట్లు జన్‌ధన్ ఖాతాల్లో జమ అయ్యాయి. జన్‌ధన్ ఖాతాల్లోకి వచ్చిన నగదు నామమాత్రంగా ఉండటంతో బడా బాబులు మరిన్ని అడ్డదారుల్లో నల్లధనాన్ని మార్చుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘జన్‌ధన్’లో డిపాజిట్లు నామమాత్రమే
Published Sun, Dec 18 2016 4:54 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM