హన్మకొండ అర్బన్ : ‘‘జిల్లాలో ఇటీవల నిర్వహించిన గోదావరి పుష్కరాల్లో జిల్లా యంత్రాంగం చక్కగా పనిచేసింది.. అదేవిధంగా అందరం కలిసి టీం వర్క్ చేద్దాం.. మేడారం జాతరను కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేద్దాం.. జాతరకు కోటిమంది భక్తులు వస్తారు.. అభివృద్ధి పనుల కోసం రూ.100 కోట్లు ప్రభుత్వం ఇస్తుంది. నాణ్యతతో కూడిన పనులు సకాలంలో చేయడమే మనలక్ష్యం’’ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్ల మరమ్మతు, విస్తరణ కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి సకాలంలో పూర్తి చేయాలన్నారు. మరమ్మతు, కొత్తగా వేయాల్సిన రోడ్ల వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. జాతరలో చేపట్టే శాశ్వత పనులు జాతర అనంతరం గ్రామస్తులకు ఉపయోగపడేలా చూడాలని అన్నారు.
35 రోజుల్లో బ్రిడ్జి కట్టాం..
పస్రా నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న 27 కిలో మీటర్ల రోడ్డు విస్తరణ పనుల్లో జాతర నాటికి పస్రా నుంచి తాడ్వాయి వరకు పూర్తి చేస్తామని ఎన్‌హెచ్ ఈఈ అబ్దుల్ చెప్పడంతో శ్రీహరి అభ్యంతరం తెలిపారు. జాతరకు ఐదునెలల సమయం ఉందని.. ఈలోగా సాంకేతిక సమస్యలు పరిష్కరించుకుని ఏటూరునాగారం వరకు పూర్తిగా విస్తరణ పనులు చేయాలన్నారు. మేడారంలో 14 ఏళ్ల క్రితం 35 రోజుల్లో బ్రిడ్జి కట్టామని అలాంటిది ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరిగినందున రోడ్డు పనులు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. అలాగే గతంలో వాడిన మోటారు సామగ్రి వివరాలు, నిధుల ఖర్చు ల లెక్కలు చూపాలని శ్రీహరి అన్నారు.
గతంలో వేసిన రోడ్లు ఎంతకాలం ఉన్నాయో తెలపాలని.. కొత్త రోడ్ల కోసం ఇస్తున్న ప్రతిపాదనల్లో పాత రోడ్లు కూడా ఎక్కడైనా ఉన్నాయా ముందే చెప్పమని అధికారులను ఆదేశించారు. జాతరలో రద్దీ ఉండే ప్రాం తాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. మేడారం జాతర ప్రభుత్వానికి ప్రాధాన్యతాంశమని అందువల్ల ముఖ్యమంత్రి సమక్షంలో సెప్టెంబర్ నెలలో ఉన్నత స్థారుులో సమీక్ష సమావేశం ఉంటుందని అన్నారు.
జాతర ఏర్పాట్లు చేయూలి..
సమ్మక్క జాతర గిరిజన జాతర కాబట్టి గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాలు, వారి మనోభావాలు దెబ్బతినకుండా ఏర్పాట్లు చేయాలని ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. కలెక్టర్ కరుణ మాట్లాడుతూ ఈ సారి ప్రయోగత్మాకంగా అల్యూమినియం రేకులతో ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నామని తెలి పారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా యంత్రాంగం అన్ని పనులు ముందుగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు జాతరలో చేపట్టాల్సిన పనుల కోసం రూ.145 కోట్లతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారని తెలిపారు.
మమ్మల్ని పిలవలేదు..
మేడారం జాతరకు సంబంధించి సమావేశం విషయంలో ఎమ్మెల్యేలకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు. ఒక్క మేడారం జాతరపైనే చర్చపెడుతున్నారని.. 20 లక్షల మంది వచ్చే ఆగ్రంపాడ్ జాతరను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నరని అన్నారు. దీనిపై కూడా సమీక్ష నిర్వహించాలని అన్నారు. దీంతో ఉప ముఖ్యమంత్రి సర్దిచెప్పారు.
ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ మేడారం పనుల్లో నాణ్యత ఉండటంలేదని ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, జేసీ ప్రశాంత్ పాటిల్, రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, డీఆర్వో శోభ, ఐటీడీఏ పీవో అమయ్‌కుమార్, డీపీవో నాయక్, డీఎంఅండ్ హెచ్‌వో సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు.
మేడారం జాతరను సక్సెస్ చేద్దాం
Published Sun, Aug 23 2015 3:44 AM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM
Advertisement
Advertisement