నక్కలగండి (డిండి) ఎత్తిపోతల పథకానికి కీలక అడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.6500కోట్లతో తెలంగాణ ప్రభుత్వం
దేవరకొండ : నక్కలగండి (డిండి) ఎత్తిపోతల పథకానికి కీలక అడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.6500కోట్లతో తెలంగాణ ప్రభుత్వం సోమవారం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇక..టెండర్లు పిలిచి పనులు చేపట్టడమే తరువాయి. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలోని మిడ్‌డిండి ప్రాజెక్టు వద్ద రిజర్వాయర్ నుంచి నీటిని జిల్లాలోని డిండి ప్రాజెక్టుకు లిఫ్ట్ ద్వారా ఎత్తిపోస్తారు. ఈ మేరకు డిండి ప్రాజెక్టు ఎత్తును మూడు అడుగుల మేర పెంచనున్నారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తం నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టు సాగులోకి వస్తుంది. నల్లగొండ జిల్లాలోని డిండి, చందంపేట, దేవరకొండ, మునుగోడు, రామన్నపేట తదతర మండలాల పరిధిలోని 90వేల ఎకరాలకు సాగునీరందుతుంది. అదే విధంగా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు కృష్ణా జలాలు అందనున్నాయి.
పరిపాలన ఆమోదంపట్ల ఎమ్మెల్యే హర్షం
నక్కలగండి ఎత్తిపోతల పథకానికి రూ.6500 కోట్లతోతెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతినివ్వడం పట్ల సీపీఐ శాసనసభాపక్షనేత, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ హర్షం ప్రకటించారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ జిల్లా ప్రజల ఆకాంక్షను, ఇక్కడి ప్రజల డిమాండ్లను గౌరవించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, భారీసాగునీటిపారుదలశాఖామంత్రి హరీష్‌రావులు నక్కలగండి ఎత్తిపోతల పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. గతంలో సీపీఐ పోరాటాల ఫలితంగా ప్రజల ఆకాంక్షల ఫలితంగానే నక్కలగండి ఎత్తిపోతల పథకం సాధ్యమైందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చినందున వెంటనే టెండర్లు పిలిచి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆయన కోరారు.