సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో బ్యాంకు లింకేజీ రుణం కావాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి తోడు.. ఏదైనా పూచీకత్తు పెట్టుకుని బ్యాంకులు ఇచ్చే రుణం తీసుకుని స్వయం ఉపాధి చేపడదామని భావించే వారికి ఆ రుణం అందని ద్రాక్షగానే మారుతోంది. ఆరుగాలం శ్రమించే అన్నదాతల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న చేనేత కార్మికులకు రుణం తీసుకోవడం గగన ంగా మారిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అసలు లక్ష్యంగా పెట్టుకున్న దానికి, మంజూరుచ్చిన, గ్రౌండింగ్ చేసిన దానికి, సబ్సిడీ లబ్ధిదారుడి ఖాతాలో జమ చేసేదానికి పొంతన లేకుండా పోతోంది.
వేల సంఖ్యలో లబ్ధిదారులను లక్ష్యంగా పెట్టుకుంటుంటే లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో నగదు జమయ్యే వారి సంఖ్య పదులు దాటడం లేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువకులకు ఇచ్చే రుణ సదుపాయం 2013-14 సంవత్సరంలో జిల్లా మొత్తం మీద కేవలం ఒక్కరికంటే ఒక్కరికే వచ్చిందంటేనే రుణ పరపతి ప్రక్రియ జిల్లాలో ఎంత అధ్వానంగా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు అనేక కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా రాష్ట్రస్థాయిలో ఖరారు కావాల్సిన మార్గదర్శకాలు (యాక్షన్‌ప్లాన్) ఆలస్యంగా రావడం, వచ్చిన తర్వాత వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ముఖ్యంగా బ్యాంకర్లు రుణం మంజూరు చేయడంలో విధిస్తున్న కొర్రీలు లబ్ధిదారులకు కష్టాలనే మిగులుస్తున్నాయి.
రైతులకే రుణాలివ్వలేదు
ముఖ్యంగా జిల్లాలో బ్యాంకుల ద్వారా రైతులకివ్వాల్సిన రుణాలు కూడా సక్రమంగా అందలేదు. జిల్లా రుణకమిటీ (డీసీసీ) లెక్కల ప్రకారం 2014-2015 ఖరీఫ్‌లో రైతులకు అందిన రుణాలు కేవలం 66 శాతమే. అంటే జిల్లాలో రుణాలు అవసరమున్న 100 రూపాయల్లో బ్యాంకులు రుణాలిచ్చింది 64 రూపాయలే. మిగిలిన 36 రూపాయల కోసం రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చిందన్న మాట. గత ఖరీఫ్‌లో మొత్తం రూ.1226 కోట్ల రుణాలను రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇచ్చింది మాత్రం 816 కోట్లే. ఇక, రబీలో లక్ష్యంగా పెట్టుకున్న దానికన్నా 2రెట్లు అధికంగా రుణాలిచ్చామని లెక్కల్లో చూపిస్తున్నా... అందులో సగం రెన్యువల్ రుణాలేనని అధికారులే అంటున్నారు. ఇక, వ్యవసాయ టెర్మ్ రుణాలయితే 41.55 శాతమే రైతులకు చేరాయి.
ఈ ఏడాది మొత్తం 460 కోట్ల రూపాయలను రుణలక్ష్యంగా పెట్టకోగా, అందులో రుణాలిచ్చింది 191 కోట్లే. వ్యవసాయ అనుబంధ రుణాలు కూడా 50శాతం తక్కువగానే లక్ష్యాన్ని చేరాయి. మొత్తం 123 కోట్ల రూపాయలను వ్యవసాయ అనుబంధ రంగాల రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో ఇచ్చి రూ.60 కోట్లలోపే. చిన్నతరహా పరిశ్రమల కోసం ఇచ్చే రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాలు కూడా ఈ ఏడాది 70శాతం మించలేదని లెక్కలు చెపుతున్నాయి. బ్యాంకర్లు చూపించే లెక్కల్లో ఒక్క విద్యా రుణాలను మాత్రమే లక్ష్యం కంటే ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో 46 కోట్ల రూపాయలను విద్యార్థుల చదువుల నిమిత్తం రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. రూ.58 కోట్లు ఇచ్చారు. అదొక్కటి మినహా ఏ రంగంలోనూ లక్ష్యానికి దరిదాపుల్లో కూడా రుణాలివ్వకపోవడం గమనార్హం.
స్వయం ఉపాధి.. సట్టుబండలేనా?
ఇక, స్వయం ఉపాధి విషయానికి వస్తే... జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రుణ సౌకర్యం అందించే ప్రక్రియ అభాసుపాలవుతోందనే చెప్పాలి. లబ్ధిదారుల ఎంపిక నుంచి రుణం మంజూరు వరకు అడుగడుగునా నిర్లక్ష్యం, ఉదాసీనత కనిపిస్తున్నాయి. అసలు ఇంతవరకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ ఏడాది బీసీ నిరుద్యోగులకు ఇచ్చే రుణాల లక్ష్యాన్ని కూడా నిర్ధారించుకోలేదంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక, గత ఏడాది అయితే మొత్తం 556 మందికి రూ.20 కోట్ల వరకు రుణాలివ్వాల్సి ఉండగా, కేవలం ఒక్కరంటే ఒక్కరికి మాత్రం రూ.3.75లక్షల రుణం మంజూరు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ ఏడాది 1701 మందికి రూ.17 కోట్ల రుణం ఇవ్వాలి ఉండగా, అందులో కేవలం 958 మందికి రూ.9కోట్లు సబ్సిడీ జమ చేశారు. ఇక, గిరిజనుల విషయానికి వస్తే మొత్తం 2,225 మందికి 27.43 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరికి కూడా రుణాలివ్వలేదు. గత ఏడాది గ్రౌండింగ్ చేసి, గ్రామసభల ద్వారా ఎంపిక చేసిన వారికీ మొండిచేయే చూపించారు. ఇందులో చాలా మంది గిరిజన నిరుద్యోగులు తమ వాటా మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేసి రుణం కోసం ఇప్పటికీ బ్యాంకులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుండడం గమనార్హం.
చేనేతకేదీ చేయూత!
జిల్లాలోని చేనేత కార్మికుల రుణ మంజూరైతే, ప్రతి యేటా నిరాదరణకు గురవుతోంది. మా ర్కెట్ సదుపాయాలు లేక అర్ధాకలితో అలమటిస్తున్న జిల్లాలోని చేనేతలను ఆదుకోవడంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు జిల్లా యం త్రాంగం కూడా విఫలమవుతోందనే చెప్పాలి. ఈ ఏడాది జిల్లాలోని 4400 చేనేత యూనిట్లకు క్రెడిట్ కార్డు పథకం ద్వారా రూ.22 కోట్ల రుణాలివ్వాల్సి ఉండగా, అందులో ఒక్కరికి కూడా సబ్సిడీ జమచేయలేదు. కేవలం 336 యూని ట్లకు రుణం మంజూరు చేసి, గ్రౌండింగ్ చేసినట్టు లెక్కల్లో చూపెడుతున్నారు. ఇక, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు వ్యవసాయ, వ్యాపార రంగాల్లో శిక్షణనిచ్చి వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చే కార్యక్రమం కూడా నత్తనడకన సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 750 మందిని ఎంపిక చేసి ఈ ఏడాది వారికి స్వావలంబన చేకూర్చాలన్న లక్ష్యం 45 శాతం మాత్రమే నెరవేరింది. అందులో బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం పొందిన యువకులు కేవలం 110 మంది మాత్రమే.
తీరు ఎప్పుడు మారేనో?
జిల్లాలో రుణపరపతి ప్రక్రియ నత్తనడకన, ఉదాసీనంగా నడవడం ఈ ఏడాదే కొత్తేం కాదు. ఏళ్ల తరబడి యాక్షన్‌ప్లాన్‌లు రూపొందించుకోవడం, ఆ తర్వాత వాటిని అమలుచేయకపోవడం అనేది జరుగుతూనే ఉంది. కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సంవత్సరంలో కూడా రుణం గగనంగానే ఉండడం లబ్ధిదారులకు మింగుడుపడడం లేదు. ఈ తీరు ఇప్పటికైనా మార్చుకోవాలని, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఇచ్చే రుణాలను ఇప్పించడంలో అటు రాజకీయ పార్టీల పెద్దలు, ఇటు ప్రభుత్వ ఉన్నతాధికారులు చొరవ చూపాలని, బ్యాంకర్లు కూడా కొర్రీలు పెట్టకుండా వీలున్నంత మేలు చేకూర్చాలనేది అటు రైతు సంఘాలు, ఇటు యువజన, ప్రజాసంఘాల వాదన.
2014-15 ఆర్థిక సంవత్సరంలో రుణపరపతి అమలు(రూ.కోట్లలో)
సీజన్/రంగం లక్ష్యం మంజూరైంది par శాతంఙఖరీఫ్ 1226.52 816.91 66.6
రబీ 525.62 1159.25 220.55
టర్మ్‌లోన్లు 460 191.13 41.55
వ్యవసాయ అనుబంధ 123 58.8 47.87
చిన్నతరహా పరిశ్రమలు 779 593.48 76.18
ఎస్‌హెచ్‌జీలు 810 524.19 64.67
విద్యా రుణాలు 46.51 58.26 125.26
రుణ ం..!
Published Thu, Feb 19 2015 12:42 AM | Last Updated on Sat, Sep 15 2018 3:13 PM
Advertisement
Advertisement